Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బుష్- బూటు దెబ్బపై వెబ్‌దునియాలో ఆట

బుష్- బూటు దెబ్బపై వెబ్‌దునియాలో ఆట
WD
అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ ఇరాక్ పర్యటన సందర్భంగా తనపై ఇరాకీ విలేకరి విసిరిన నల్ల బూట్లు ప్రస్తుతం అరబ్ ప్రపంచంలో కోటి డాలర్లు పలుకుతున్నాయి. ఒకే ఒక్క క్షణం తేడాతో ఓ సాధారణ విలేకరి ధరిస్తూ వచ్చిన ఈ బ్లాక్ షూ జత ప్రపంచంలోనే సుప్రసిద్ధ బూట్లుగా మారిపోయాయి.

ఇరాకీ విలేకరి జైదీ అమెరికా అధ్యక్షుడిపై విసిరిన బూట్లలో ఒక్కటి తనకు ఇచ్చినా సరే 10 మిలియన్ -కోటి- అమెరికన్ డాలర్లను ఇస్తానని అరబ్ ప్రపంచానికి చెందిన ఓ వ్యక్తి ప్రకటించాడు.మరోవైపున లిబియా అధినేత కల్నర్ మహమ్మద్ గడ్డాఫీ కుమార్తె ఈ షూలను జార్జి బుష్‌పై విసిరిన 29 ఏళ్ళ సాధారణ జర్నలిస్టు జైదీకి శౌర్య పతకం ప్రకటించినట్లు వార్తలు.

జైదీ చేసిన ఈ సాహసోపేత చర్య అనంతరం ఇరాకీల ఉత్సాహానికి అంతే లేకుండా పోయింది. ఇరాక్ లోని సదర్ నగరంలో ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడి బూట్లను, చెప్పులను స్తంభాల పైకి విసురుతూ అమెరికా దళాలు వెంటనే తమ దేశం నుంచి వైదొలిగి పోవాలని నినాదాలు చేశారు.

నజాఫ్ నగరంలో, ప్రజలు దారిన పోతున్న అమెరికన్ సైనిక వాహనాల బారుపై తమ బూట్లను విసిరివేశారు. వీధుల్లో సంభాషణల్లో, టెలివిజన్లో, ఇంటర్నెట్ చాట్ రూములలో... ఒకచోట కాదు... యావత్ మధ్యప్రాచ్యంలో సోమవారం నుంచి ఇరాకీ విలేకరి అమెరికా అధ్యక్షుడిపై విసిరిన బూట్లు చర్చనీయాంశంగా మారాయి.

అయితే కొంతమంది జైదీ చర్యను ఖండిస్తున్నారు. అతిథుల పట్ల అరబ్ ప్రపంచం చూపించే సాంప్రదాయిక ఆతిథ్యానికి లేదా గౌరవానికి జైదీ చర్య భంగం కలిగించిందని వీరు భావిస్తున్నారు. ప్రజల మనోభావాలతో వీరు ఏకీభవిస్తున్నప్పటికీ జైదీ అలా చేయవలసింది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

జైదీ చర్య నాగరిక రీతిలో వ్యక్తం కానప్పటికీ, ఇది ఇరాకీ ప్రజల మనోభావాలను వ్యక్తం చేస్తోందని, అమెరికా దురాక్రమణకు వ్యతిరేకంగా ఇరాకీలలో పేరుకుపోయిన ఆగ్రహానికి ఇది ప్రతీక అని సమారాలోని ఫిజిషియన్ కుతైబా రజా పేర్కొన్నారు. మరోవైపు అరబ్ దేశాల్లో టీవీ చానళ్లలో జైదీ ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారారు. సిరియా, డెమాస్కస్, లెబనాన్ తదితర దేశాల్లో టీవీ ఛానళ్లు సోమవారం పొడవునా జైదీ ఫోటోను ప్రదర్శిస్తూ వచ్చారు.

బుష్ పైకి బూట్లు విసిరిన అతగాడి పరిస్థితి అలా ఉంచితే అధ్యక్ష పీఠాన్ని వదిలిపోబోయే ముందు బుష్‌కు పెద్ద అవమానమే జరిగింది. బూటు దెబ్బ తగలకుండా తప్పుకున్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా బుష్- బూటు దెబ్బపైనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో వెబ్ దునియా వీక్షకులకోసం ఓ ఫన్నీ గేమ్‌ను మీ ముందుంచింది. బుష్- బూటు దెబ్బపై ఆట ఆడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఆటాడండి.

Share this Story:

Follow Webdunia telugu