"తెల్ల" ప్రజలకు "నల్ల" అధ్యక్షుడు
నవంబర్ 4. ఆ రోజు మంగళవారం. ఆ రాత్రి అమెరికా చరిత్రలో నూతన అధ్యాయానికి తెర లేచింది. ఇటీవలి కాలం వరకు యావత్ప్రపంచం కలలో కూడా ఊహించని అపరూప దృశ్యం ఆరోజు రాత్రి అమెరికా రాజకీయ యవనికపై కదలాడింది. బారక్ ఒబామా.. నల్లజాతి చరిత్రలో దివ్య కాంతితో మెరిసిన నల్ల వజ్రం... ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నేతగా ఆవిర్భవించారు. ఎన్నికలు ముగియక ముందే అమెరికా నూతన నేత ఎవరో తెలిసిపోవడం ఇటీవలి అమెరికా రాజకీయ చరిత్రలో సంభవించలేదు. అలాంటి అద్భుత విజయం ఈ నల్లజాతి వజ్రం సొంతమైంది. అందుకే అమెరికన్లు ఇప్పుడు ముక్త కంఠంతో ఏక గీతం ఆలపిస్తున్నారు. ఆ గీత సారాంశం ఏమంటే.. బారక్ ఒబామా.. అమెరికా సంయుక్త రాష్ట్రాల నూతన అధ్యక్షుడు...అమెరికా చరిత్రలో ప్రప్రథమంగా నల్లజాతి అధ్యక్షుడు వైట్‌హౌస్‌లో సర్వ శక్తివంతమైన అధ్యక్ష పీఠం అధిరోహించనున్నారు. అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులుగా 2009 జనవరి 20న ఒబామా బారక్, సెనేటర్ జోసెఫ్ బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాదాపు ఆర్థికమాంద్యం అంచుల్లో నిలిచిన అమెరికా.. ఇరాక్, ఆప్ఘనిస్తాన్‌లలో సుదీర్ఘ యుద్ధాల్లో మునిగి ఉన్న అమెరికా 44వ దేశాధ్యక్షుడిగా ఒబామా సంపూర్ణ ప్రజామోదంతో ఓవల్ ఆఫీసులో అడుగుపెట్టనున్నారు.ఒబామాకు మహాత్మా గాంధీ ఆదర్శం అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రప్రథమ నల్లజాతి అధ్యక్షుడిగా చరిత్ర తిరగరాసిన ఒబామా బారక్ తనకు నిలువెల్ల ప్రేరణ ఇచ్చిన మేటి వ్యక్తి మహాత్మా గాంధీయేనని పేర్కొన్నారు. జీవితానికి సంబంధించిన వాస్తవ సందేశం గురించి మహాత్మాగాంధీ తనకు ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటారని ఒబామా చెప్పారు. ప్రపంచ శాంతి దూత అయిన మహాత్మాగాంధీ పట్ల చెక్కుచెదరని ప్రేమ భావాన్ని హృదయంలో నిలుపుకునేందుకోసం తన సెనేట్ ఆఫీసులో మహాత్ముడి నిలువెత్తు చిత్రపటాన్ని ఒబామా అలంకరించుకున్నారు. భారత్‌తో అమెరికా సన్నిహిత సంబంధాలకు సానుకూలత వ్యక్తం చేసే ఒబామా బారక్ ఒక భారతీయ పత్రికతో మాట్లాడుతూ భారతీయ అమెరికన్ మిత్రులను అనేకమందిని కలిగిఉండటం తన అదృష్టంగా చెప్పుకున్నారు. భారత్‌లో గ్రామీణాభివృద్ధి పనిలో తన తల్లి పనిచేసిన జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. |
అమెరికాలో నల్లజాతి చైతన్యాన్ని 1960లలో రగుల్కొల్పిన మార్టిన్ లూథర్ కింగ్ నుంచి ఒబామా దాకా ఎందరో ప్రపంచ ప్రసిద్ధ ప్రముఖులు గాంధీ ప్రేరణ ప్రభావాల ఔన్నత్యం గురించి కొనియాడుతూ వస్తున్నారు. భారత్‌లో గాంధీ ఆశయాలు కనుమరుగు కావడమే విషాదకరం... |
|
|
సాటిలేని సహన శక్తి, చెక్కుచెదరని స్పూర్తిలకు ఉదాహరణగా నిలబడిన గాంధీ, అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసేలా ప్రభావితం చేయడమే కాక, భారతజాతిని వలసవాద పాలన నుంచి విముక్తి చేసిన మహత్తర విప్లవాన్ని ప్రజ్వలింపజేశారని అమెరికా అధ్యక్షుడు ఒబామా పేర్కొన్నారు. గాంధీ ప్రాధాన్యత విశ్వవ్యాప్తమైనదని ఒబామా కొనియాడారు. ఆయన స్ఫూర్తి, ప్రేరణలతో ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రజలు ప్రభావితులయ్యారని చెప్పారు.
శతాబ్దికాలం పైగా అణచివేతకు పాల్పడిన వ్యవస్థను పరమ శాంతియుతంగా కూల్చివేయడంలో గాంధీజీ సాధించిన విజయం ఒక తరం యువ అమెరికన్లను ప్రభావితం చేసిందని ఒబామా ప్రశంసించారు. చివరకు దక్షిణాఫ్రికాలో జాతి వివక్షతను నిర్మూలించడంలో, తూర్పు యూరప్‌లో విప్లవాలు చెలరేగడంలో కూడా గాంధీజీ ఆలోచన పాత్ర ఉందని 47 ఏళ్ల ఒబామా బారక్ చెప్పారు.