Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రయాన్-1 విజయంతో అగ్రరాజ్యాల సరసన భారత్...

చంద్రయాన్-1 విజయంతో అగ్రరాజ్యాల సరసన భారత్...

Raju

WD

నింగినంటిన భరత కీర్తి....

చంద్రమండల రహస్యాల శోధన కోసం భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు చేపట్టిన చంద్రయాన్- 1 ప్రయోగం విజయవంతమైంది. దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 22వ తేదీ, బుధవారం ఉదయం 6.22 గంటలకు చంద్రునిపైకి పంపిన మానవరహిత వ్యోమనౌక చంద్రయాన్-1 విజయవంతంగా క్షక్ష్యలోకి ప్రవేశించింది.

దీంతో చంద్రునిపైకి ఉపగ్రహాలను పంపిన అగ్రరాజ్యల సరసన భారత్ నిలబడటం ద్వారా భారత్ అంతరిక్ష పరిశోధనల్లో మరో మైలురాయిని అధిగమించింది. ఇప్పటివరకు అమెరికా, మాజీ సోవియట్ యూనియన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, చైనా, జపాన్ మాత్రమే చంద్రునిపైకి ఉపగ్రహాలను ప్రయోగించగా, ప్రస్తుతం భారత్ ఆరో దేశంగా అవతరించింది.

వందకోట్ల మందికి పైగా భారతీయుల హర్షాతిరేకాల మధ్య శ్రీహరికోటనుంచి చంద్రయాన్- 1 ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించిన తర్వాత ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ విలేఖరులతో మాట్లాడారు.ఈ ప్రయోగానికి ఎటువంటి చిన్న అంతరాయం కూడా కలగలేదన్నారు. ఈ ప్రయోగం విజయవంతమవడం వెనుక ఉన్న శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. చంద్రయాన్-1 ప్రయోగం భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరతీసిందని చెప్పారు.
అనంత విద్యుత్తుకు మార్గం...
  భూమ్మీద అరుదుగా లభించే హీలియం-3 మూలకం చంద్రుడిపై 50 లక్షల టన్నులు ఉందని అంచనా.. దీంతో మొత్తం ప్రపంచ విద్యుత్ అవసరాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 వేల సంవత్సరాలు నిరాఘాటంగా తీర్చుకోవచ్చు. చంద్రుడిపైకి మనిషి యాత్రకు మూలం ఇదే మరి...      


అక్టోబర్ 23న ఉపగ్రహ మోటార్లను 18 నిమిషాలపాటు పేల్చి దానిని 37, 900 కిలోమీటర్ల ఎత్తులోని భూకక్ష్యలో ఇస్రో శాస్త్రజ్ఞులు ప్రవేశ పెట్టారు. అక్టోబర్ 25న 16 నిమిషాల పాటు మోటార్లను పేల్చి ఉపగ్రహాన్ని 74,715 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకుపోయారు.

అక్టోబర్ 26వ తేదీన మరో 9.5 నిమిషాలపాటు మోటార్లను పేల్చి దానిని 1.64,600 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు. బుధవారం మోటార్లను మరో 190 సెకనులపాటు పేల్చి ఉపగ్రహాన్ని 2,67,000 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు తర్వాత నవంబర్ 3న మోటార్లను మరో 150 సెకనులపాటు పేల్చి ఉపగ్రహాన్ని 3,84,000 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు.

ఈ కక్ష్యలో చంద్రయాన్ రెండేళ్లపాటు పరిభ్రమిస్తుందని మాధవన్ నాయర్ ప్రకటించారు. కౌంట్‌డౌన్ నుంచి ప్రయోగ దశవరకు, అక్కడి నుంచి చంద్ర కక్ష్యలో ప్రవేశపెట్టేంతవరకు భారత్ ప్రయోగించిన మానవ రహిత వ్యోమనౌక ఏ దశలోనూ విఫలం కాలేదని, లోపరహితంగా అన్ని దశలను పూర్తి చేసుకుందని నాయర్ సగర్వంగా ప్రకటించారు.

webdunia

చందమామను ముద్దాడిన భారతీయ జెండా


అక్టోబర్ 22న చంద్రుడిపైకి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-1 నౌక 3 లక్షల 84 వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతంగా ముగించి కక్ష్యలన్నీ దాటి నవంబర్ 15వే తేదీ శుక్రవారం నాటి నిర్మల రాత్రి వేళ చందమామపైకి వినిర్మలంగా అడుగు పెట్టింది.

అంతరిక్షంలో భూమికి అత్యంత చేరువగా ఉన్న జాబిలి దక్షిణ ధ్రువంపై మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ -ఎంఐపి- విజయవంతంగా దిగిన చారిత్రక క్షణాలు భారత జాతిని పరవశింపజేశాయి. ఈ మహత్తర ఘట్టం ఆవిష్కరణతో చంద్రుడి ఉపరితలాన్ని స్పర్శించిన నాలుగో దేశంగా భారత్ చరిత్రకెక్కింది.

భారత కీర్తిని విశ్వవ్యాప్తంగా చాటిన ఓ మహత్తర ఘట్టానికి ఈ శుక్రవారం రాత్రి చందమామ వేదికగా నిలిచింది. చంద్రయాన్ నౌక నుంచి ఎంఐపీ రోబో విజయవంతంగా వేరుపడి చంద్రుడి ఉపరితలంపైకి చేరింది. ఈ రోబోకు ఇరువైపుల త్రివర్ణ పతాకం అమర్చారు. రోబోపై సంస్కృత శ్లోకాన్ని లిఖించారు. ఈ ప్రక్రియలో మొదట మువ్వన్నెల పతాకం చంద్రుడి ఉపరితలాన్ని ముద్దాడింది.

ఈ రోబోలో అమర్చిన వీడియో చంద్రుడిపై సమాచారాన్ని ఇస్రోకు చేరవేస్తుంది. రోబోలోని సాంకేతిక పరికరాలు చంద్రుడిపై వాతావరణ పరిస్థితులను అంచనా వేసి ఇస్రోకు చేరవేస్తుంది. దీనితో చంద్రుని స్థితిగతులు అర్థం చేసుకుని భవిష్యత్ ప్రయోగాలకు ఈ ప్రయోగం మార్గదర్శనం చేస్తుంది. ఎంఐపి పరికరం నాలుగు మూలలా భారతీయ త్రివర్ణ పతాకాన్ని ఉంచారు. చంద్రుని ఉపరితలం వైపు తుది ప్రయాణానికి సిద్ధమవుతూ ప్రధాన నౌక నుంచి ఎంఐపీ గురువారమే విడివడింది.

2015 లోపే అంతరిక్షంలోకి భారతీయులు...!
చంద్రయాన్- 1 ప్రయోగం అద్భుతంగా విజయం సాధించిన నేపథ్యంలో చంద్రుని మీదికి మనిషిని పంపే సంక్లిష్టమైన, బృహత్తరమైన, ఘనతర కార్యాన్ని మరో ఏడేళ్ల లోపే పూర్తి చేయగలమని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది. 2015 నాటికే మానవ సహిత ఉపగ్రహాన్ని చంద్రుని మీదకు పంపుతామని ఇస్రో పేర్కొంది.

ఇకపై ఇద్దరు రోదసీ యాత్రికులను జిఎస్ఎల్‌వి రాకెట్ సాయంతో మోసుకెళ్లే క్యాప్సూల్‌ను ఎలా తయారు చేయాలనే దానిపై తాము దృష్టి సారించవలసి ఉందని ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ అన్నారు. మనిషిని భూమికి దాదాపు రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉండే కక్ష్యలోకి ప్రవేశ పెట్టడం, తిరిగి క్షేమంగా భూమికి చేర్చడం ఏమంత ఆషామాషీ వ్యవహారం కాదని నాయర్ తెలిపారు. సాంకేతికపరమైన ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని చెప్పారు.
జాబిలిపై జాతీయ పతాకం...
  లక్షలాది కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతంగా ముగించి కక్ష్యలన్నీ దాటి చందమామపైకి అడుగు పెట్టిన చంద్రయాన్-1 నౌకలోని ఎంఐపి పేలోడ్ భారతీయ త్రివర్ణ పతాకాన్ని చంద్ర ఉపరితలంపై సుతారంగా హత్తింది. భారతీయ సాంకేతికాభివృద్ధికి ఇది మంగళ నీరాజనం...      


చంద్రయాన్ ప్రయోగం తర్వాత ఇస్రో తదుపరి సహజ గమ్యం అరుణగ్రహమే -మార్స్- నని నాయర్ ప్రకటించారు. శాస్త్ర ప్రపంచం నుంచి ప్రతిపాదనలు రాగానే అంగారక గ్రహ యాత్రకు పథకాన్ని తాము ఖరారు చేయగలమని నాయర్ తెలిపారు. అంగారక గ్రహానికి అంతరిక్ష నౌకను తీసుకుపోయే సామర్థ్యం జీఎస్ఎల్‌వి ఉపగ్రహానికి ఉందని స్పష్టం చేశారు.

చంద్రుడిపై, అంగారక గ్రహంపై రోదసీయాత్రికులు తిరుగాడే అరుదైన క్షణాలను తాను ప్రస్తుతం కలగంటున్నానని మాజీ దేశాధ్యక్షుడు డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం పేర్కొన్నారు. భారతీయ తొలి మానవరహిత ఉపగ్రహం చంద్రయాన్-1 పరిశోధనతో సన్నిహితంగా ముడిపడిఉన్న కలాం... భారతీయ త్రివర్ణ పతాకం చంద్రుడిని ముద్దాడే కమనీయ దృశ్యం దేశవ్యాప్తంగా యువతకు స్ఫూర్తిని కలిగిస్తుందని చెప్పారు.

చంద్రయాన్-1 ప్రయోగాన్ని తుదివరకు లోపరహితంగా కొనసాగించిన భారతీయ అంతరిక్ష సంస్థ శాస్త్రజ్ఞుల కృషిని కలాం కొనియాడారు. టెక్నాలజీలో అద్భుత సామర్థ్యం, సృజనాత్మక నాయకత్వం అనే రెండు విశిష్ట గుణాలను వారు సంతరించుకున్నారని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu