Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోట్ల పారితోషికాలు... భారీ బడ్జెట్లకు చెల్లు

కోట్ల పారితోషికాలు... భారీ బడ్జెట్లకు చెల్లు
WD
చిన్న చిత్రాలకు ఊపిరిలూదిన ఉల్లాసంగా... ఉత్సాహంగా...

పరిమిత బడ్జెట్ అయినా చిత్రాలను భారీస్థాయిలో రూపొందించే వై.వి.ఎస్. చౌదరి సంక్రాతికి నందమూరి బాలకృష్ణతో "ఒక్కమగాడు" తీసి బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడ్డాడు. "భారతీయుడు" వంటి కథను కమల్‌హాసన్‌తో తీసిన తర్వాత దాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం బెడిసికొట్టడం దర్శకుడిగా అతనికి తొలిదెబ్బ.

ప్రతి ఏడాది సంక్రాంతి రాజుగా ఉండే ఎం.ఎస్.రాజు ఈసారి కన్నడ చిత్రాన్ని రీమేక్‌గా "వాన" తీసినా కాసుల పంట పండలేదు. రవితేజతో వి.వి.వినాయక్ చేసిన తొలి ప్రయత్నం "కృష్ణ" ఒక్కటే సక్సెస్ అయింది. దాంతో ఇండస్ట్రీ కాస్త ఊపిరి పీల్చుకుంది.

ఈ ఏడాది వాసుకు అనుకూలించలేదు. "చంద్రముఖి" వంటి సెస్సేషనల్ హిట్ తీసిన పి.వాసు "కృష్ణార్జున" అనే చిత్రాన్ని, నాగార్జున, విష్ణుతో తీసినా ఫలితం లేకపోయింది. అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తే విషయం ఏమిటంటే... క్రిష్ అనే నిక్‌నేమ్‌తో పిలువబడే రాధాకృష్ణ అనే దర్శకుడు తన తండ్రి పెట్టిన పెట్టుబడితో "గమ్యం" అనే చిత్రాన్ని తీసి పబ్లిసిటీ కూడా పెద్దగా లేకుండా బ్రహ్మాండమైన సక్సెస్ చేయడం. అల్లరినరేష్, శర్వానంద్ నటించిన ఈ చిత్రంలో నరేష్ పాత్రే లేకపోతే చిత్రమేలేదనట్లుగా ఉంటుంది. ఆ హిట్టే ఆ దర్శకుడికి వెంకటేష్ చిత్రానికి పనిచేసే అవకాశాన్ని కల్పించింది.

webdunia
WD
కొత్త హీరో సుశాంత్ "కాళిదాసు"తో ఫర్వాలేదనిపించుకున్నాడు...

నితిన్‌కు "ఆటాడిస్తా" పెద్ద సక్సెస్ ఇవ్వలేకపోయింది. నాగార్జున మేనల్లుడుగా అరంగేట్రం చేసిన సుశాంత్ "కాళిదాసు"తో కాస్త ఫర్వాలేదనిపించాడు. అల్లుఅర్జున్‌కు "పరుగు" గతంతో పోలిస్తే పెద్ద సక్సెస్ కింద రాదు. ఎన్టీఆర్‌కు "కంత్రీ", ప్రభాస్‌కు "బుజ్జిగాడు" చిత్రాలు ఏమాత్రం కెరీర్‌ను పెంచలేకపోయాయి.

ఇక బాలకృష్ణ సక్సెస్ కోసం "పాండురంగడు" తీసినా ఆయన నాన్నగారు నటించిన పాండురంగ మహాత్మ్యంతో పోలిస్తే ఎందుకూ కొరకాదు. అందరికంటే చక్కని హిట్ శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్‌కు "రెడీ"తో దక్కింది. గత ఏడాది ఢీ అంటూ ముందుకు వచ్చి మరోసారి రెడీ అని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం నాగార్జునతో రూపొందిన "కింగ్" డిసెంబర్ 24న విడుదల కానుంది.

బెంగళూరుకు చెందిన యశోసాగర్‌ను హీరోగా చేస్తూ... ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన "ఉల్లాసంగా... ఉత్సాహంగా" నిర్మాతకు, దర్శకునిగా కాస్త ఊరటనిచ్చింది. అగ్ర నిర్మాతగా పిలువబడే సి. అశ్వనీదత్‌కు రజనీకాంత్, జగపతిబాబు నటించిన "కథానాయకుడు" చిత్రం విడుదల కాస్త మేలు చేసింది. సినిమా ఆడకపోయినా అన్ని ప్రాంతాల్లో చిత్రాన్ని అమ్మేయడం అనే బిజినెస్ టెక్నిక్ ప్రతిసారి అశ్వనీదత్‌కు ఉపయోగపడింది.

రవితేజకు "బలాదూర్" ఏ మాత్రం సూట్‌కాని సబ్జెక్ట్. దాంతో తన పాత రూట్‌కు వచ్చేసి "నేనింతే" అంటూ పూరీ జగన్నాథ్‌తో చేశాడు. సినిమారంగంపై సెటైర్‌గా తీర్చిదిద్దిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతుంది. ఇక అగ్రహీరోల్లో వెంకటేష్‌కు "చింతకాయలరవి" పెద్దగా విజయం సాధించలేకపోయినా తన నిర్మాతకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెబుతున్నారు.

webdunia
WD
సెంచరీ కొట్టిన చిన్న చిత్రం అష్టా- చమ్మా...

ఇక దిల్‌రాజు కొత్తబంగారులోకం అంటూ కొత్తవారితో చేసిన ప్రయత్నం ఫలించింది. ఈసారి ఎక్కువగా లాభించింది. అల్లరి నరేష్‌కు, "గమ్యం" నుంచి "బ్లేడ్‌బాబ్జీ" వరకు హిట్‌అయ్యాయి. బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్, సిద్ధు ఫ్రమ్ సికాకుళం, బ్లేడ్ బాబ్జీ వంటి చిత్రాలు నరేష్‌కు హ్యాట్రిక్ సాధించి పెట్టాయి.

కథను కొత్త ప్రయోగం చేసి క్లైమాక్స్‌ను ఓపెనింగ్ చేసినా, ఓపెనింగ్‌ను క్లైమాక్స్‌తో తీర్చిదిద్దిన "సెల్" అనే చిత్రం ప్రయోగం బాగున్నా చూసేందుకు ప్రేక్షకులు సాహసం చేయలేకపోయారు. గోపిచంద్ "శౌర్యం", కొత్తవారితో డి.సురేష్ బాబు చేసిన "అష్టా-చమ్మా" ప్రయోగాలు ఫలించాయి.

హీరోతో సంబంధం లేకుండా కొత్తవారితో తీసిన హాస్యచిత్రం "వినాయకుడు" బాగానే ఆడుతోంది. కానీ గత ఏడాది "హ్యాపీడేస్"తో వెలుగులోకి వచ్చిన వారంతా హీరోలుగా మారిన కాల్‌సెంటర్, అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ చిత్రాలు మినహా కొత్తబంగారులోకం, వినాయకుడు వంటి చిత్రాలు విజయవంతమైయ్యాయి. శేఖర్‌ కమ్ముల నిర్మాతగా మారి తీసిన "ఆవకాయ్ బిర్యాని" అంటేనే ప్రేక్షకుడు భయపడడం విశేషం.

webdunia
WD
డబ్బింగ్ చిత్రాలకు నో ఛాన్స్...

గత రెండేళ్లను తరచి చూస్తే... స్ట్రెయిట్ చిత్రాలకు డబ్బింగ్ చిత్రాలు పోటీపడి విజయావకాశాలను నీరుగార్చాయి. కానీ ఈసారి డబ్బింగ్ చిత్రాలు విడుదలైనా ఏవీ సరిగ్గా ఆడలేకపోయాయి. సూర్య సన్నాఫ్ కృష్ణన్, పార్థు, లక్ష్మీపుత్రుడు, సెల్యూట్, రక్ష తదితర చిత్రాల్లో కొత్తదనం ఉన్నా ఆకట్టుకోలేకపోయాయి.

హీరోగా చేసిన శ్రీహరి విలన్‌గా కనిపించిన "సరోజ" చిత్రం బెడిసి కొట్టింది. అటు తమిళంలోనూ పెద్దగా ఆడలేకపోయింది. యానిమేషన్‌తో వచ్చిన "ఘటోత్కచుడు" చిత్రం కూడా ఏమాత్రం విజయం సాధించలేకపోయింది. రాబోయే తరం అంతా యానిమేషన్‌దే అన్న డి. సురేష్ బాబు కుమారుడు రాణా మాటలు ప్రస్తుతం ఫలించలేదు.

ఏది ఏమైనా మంచి కథ, చక్కటి అభినయం, సాంకేతిక పరిజ్ఞానాలు ఉంటే చాలు కోట్ల పారితోషికాలు, నటీనటులు, భారీ సెట్లు లేకుండా విజయం సాధించవచ్చని ఈ ఏడాది పాఠం నేర్పింది.

Share this Story:

Follow Webdunia telugu