Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2008లో టాలీవుడ్ 'రాశి-వాసి'

2008లో టాలీవుడ్ 'రాశి-వాసి'

PNR

FileFILE
2008 సంవత్సరం టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఏమాత్రం కలిసి రాలేదని చెప్పొచ్చు. ఈ యేడాది ప్రథమార్థంలో చిత్ర పరిశ్రమలో సరైన విజయం లేక కళావిహీనంగా కనిపిచింది. అయితే.. ద్వితీయార్థంలో వచ్చిన పలు చిన్న చిత్రాలు విజయంతో కాస్త ఊరట లభించింది. అలాగే ఏడాది ఆఖరులో క్రిస్మస్ పండుగ కానుకగా వచ్చి నాగార్జున 'కింగ్' చిత్రం కలెక్షన్ల పరంగా మంచి సక్సెస్‌ను సాధించింది. 2008 సంవత్సరంలో మొత్తం 145 చిత్రాలు విడుదలకు నోచుకున్నాయి. వీటిలో అతి తక్కువ సంఖ్యలో అనగా.. కేవలం 15 చిత్రాలు మాత్రమే సక్సెస్‌ను సాధించడం గమనార్హం. 2008 సంవత్సరంలో జయాపజయాలను ఒకసారి సమీక్షిస్తే..

సందడి లేని సంక్రాంతి సీజన్..
సాధారణంగా ప్రతియేడాది సంక్రాంతి పండుగకు పెద్ద హీరోల చిత్రాలు విడుదలవుతుంటాయి. అయితే ఈ ఏడాది పెద్దగా ఇలాంటి చిత్రాలు విడుదల కాలేదు. అలాగే సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో సక్సెస్ సాధించిన చిత్రాల శాతం కూడా తక్కువే. రవితేజ హీరోగా నటించిన 'కృష్ణ' విజయం సాధించగా, సుమంత్ 'పౌరుడు' చిత్రం ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత భారీ అంచనాలతో, భారీ పెట్టుబడితో వచ్చిన బాలకృష్ణ 'ఒక్కమగాడు' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

అలాగే నిర్మాత ఎంఎస్.రాజు దర్శకుడిగా మారి తీసిన చిత్రం 'వాన' చిత్రం కూడా అద్భుతాలు సృష్టించలేక పోయింది. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చిన చిత్రాల విజయాలు కూడా నత్తనడకనే సాగాయని చెప్పుకోవచ్చు. 'స్వాగతం', 'మిస్టర్ మేధావి', 'కృష్ణార్జునులు' బాపు చిత్రం 'సుందరాకాండ', గోపీచంద్ 'ఒంటరి', గిరిబాబు దర్శకత్వం వహించిన 'నీ సుఖమే నే కోరుకుంటున్నా', ఉదయ్ కిరణ్ 'లక్ష్మీపుత్రుడు' చిత్రాలు విడుదలైన కొద్దివారాలకే పత్తాలేకుండా పోయాయి. అయితే.. 'ఒంటరి' చిత్రం మాత్రం గోపీచంద్‌కు నటనా పరంగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎన్నో ఆశలతో వచ్చిన ఉదయ్ కిరణ్ లక్ష్మీపుత్రుడు కూడా పూర్తిగా నిరాశరిచింది.

విజయాలకు ఊపిరి పోసిన 'గమ్యం'
ఈ యేడాది తొలి రెండు నెలల తర్వాత వచ్చిన లోబడ్జెట్ చిత్రం 'గమ్యం'. ఈ చిత్రం అనూహ్యంగా విజయం సాధించి, నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. ఇదిలావుండగా.. అక్కినేని మూడోతరం హీరోగా సుశాంత్ వెండితెరకు పరిచయం చేసిన చిత్రం 'కాళిదాసు'. ఈ చిత్రం సుశాంత్‌ను హీరోగా నిలబెట్టలేక పోయింది. ఇదే సమయంలో వచ్చిన కామెడీ చిత్రాలైన 'మైఖేల్ మదన్ కామరాజ్' పరాజయం చవిచూడగా, 'బొమ్మనా బ్రదర్స్-చందనా సిస్టర్స్' హిట్ కొట్టేసింది.

వరుస విజయాల హీరోగా పేరొందిన అల్లు అర్జున్ నటించిన 'పరుగు' చిత్రం భారీ వసూళ్లను కురిపించలేక పోయినా సక్సెస్‌ను సాధించింది. ఇదేసమయంలో వచ్చిన విప్లవాత్మక చిత్రాలైన 'ఎర్రసముద్రం', 'బతుకమ్మ' చిత్రాలు తెలంగాణా ప్రాంతాల్లో ప్రేక్షకులను అలరించాయి. బతుకమ్మ చిత్రం బయ్యర్ల పంట పండించింది. ఈ చిత్రంలో సింధు తులానీ కీలక పాత్ర పోషించింది. అయితే.. ఎన్నో ఆశలతో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ 'కంత్రీ', ప్రభాస్ 'బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై' చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయాయి.

మోతాదుకు మించిన 'పాండురంగడు' శృంగారం
'అన్నమయ్య', 'శ్రీరామదాసు' వంటి భక్తిరస చిత్రాల తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'పాండురంగడు'. బాలకృష్ణ, స్నేహ, టబులు ప్రధాన తారాగణం. ఈ చిత్రంలో శృంగారపు మోతాదు కాస్త ఎక్కువైందనే విమర్శలు వచ్చినా, చిత్రం ప్రేక్షకాధారణ పొందింది.

ద్వితీయార్థంలో చిన్నచిత్రాల హవా
ఇకపోతే.. ఈ యేడాది ద్వితీయార్థంలో తక్కువ బడ్జెట్‌తో వచ్చిన చిత్రాలు తమ సత్తాను చాటాయి. శ్రీను వైట్ల దర్శకత్వంలో విష్ణు హీరోగా వచ్చిన 'ఢీ' చిత్రం విజయం సాధించింది. అలాగే అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన 'గోరింటాకు', కళ్యాణ్‌రామ్ నిర్మాతగా మారి హీరోగా నటించిన చిత్రం 'హే రామ్‌'లు చెప్పుకోదగిన విజయం సాధించాయి. 'తొలిప్రేమ' తర్వాత సూపర్‌హిట్ కోసం మొహం వాచిపోయిన దర్శకుడు కరుణాకరన్ ఎట్టకేలకు 'ఉల్లాసంగా.. ఉత్సాహంగా' చిత్రంతో విజయాన్ని రుచిచూశాడు. సురేష్ ప్రొడక్షన్ అధినేత డి.రామానాయుడు నిర్మించిన 'బలాదూర్' పూర్తిగా నిరాశపరిచింది. విశాల్ 'సెల్యూట్' చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

ఇక అల్లరి నరేష్ హీరోగా నటించిన కామేడి చిత్రం 'సిద్ధూ ఫ్రమ్ సికాకుళం' చిత్రం ప్రేక్షకులను అలరించింది. జేడీ చక్రవర్తి, జగపతి బాబులు కలిసి నటించిన 'హోమం' ఫెయిల్ కాగా, మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'అష్టాచెమ్మా' ఆకట్టుకుంది. 'సరోజ' చిత్రం తమిళంలో సూపర్ హిట్ కాగా, తెలుగులో ఫట్‌మనిపించింది. దర్శకుడు సముద్ర 'మల్లెపూవు' థియేటర్‌లోనే వాడిపోయింది. రామ్‌గోపాల్ వర్మ 'రక్ష' చిత్రాలు ఫెయిల్ అయ్యాయి. గోపీచంద్ 'శౌర్యం' మాత్రం కాస్త ఫర్వాలేదనిపించినా.. విక్టరీ వెంకటేష్ నటించిన 'చింతకాయల రవి' అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు.

ఇక యేడాది చివరలో వచ్చిన దిల్‌రాజు "కొత్త బంగారు లోకం" హీరో వరుణ్ సందేష్‌కు మంచి విజయాన్ని అందించింది. దర్శకుడు తేజ కొత్త నటీనటులతో పెట్టించిన 'కేక' ప్రేక్షకులకు పెద్దగా వినిపించలేదు. 'ఏక్‌లవ్‌యుడు' ఉదయ్‌కిరణ్‌కు సక్సెస్‌ను ఇవ్వలేక పోయింది. "బ్లేడ్ బాబ్జీ" విజయంతో మినిమం గ్యారెంటీ హీరోగా అల్లరి నరేష్ చిత్ర పరిశ్రమలో ముద్రవేసుకున్నాడు.

"వినాయకుడు' ఏ సెంటర్లలోనూ, 'యువత' ఏ, బి కేంద్రాల్లో సక్సెస్ సాధించగా, 'దేవరకొండ వీరయ్య' చిత్రం మరో సామాజిక అంశాన్ని స్పృశించింది. నాగబాబు 'ఏక్ పోలీస్', అల్లరి నరేష్ 'దొంగలబండి', పూరీ జగన్నాథ్ వెండితెర లోతుపాతులను స్పృశిస్తూ వచ్చిన 'నేనింతే' చిత్రాలు విజయాన్ని సొంతం చేసుకున్నాయి. క్రిస్మస్ పండగకు వచ్చిన 'కింగ్' కలెక్షన్ల పరంగా రికార్డు సాధించగా, 'నచ్చావులే' చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విజయవంతమైంది.

Share this Story:

Follow Webdunia telugu