Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హలో మిస్టర్.. దిసీజ్ నాట్ ఎ రోడ్. ఇట్ ఈజ్ కపుల్స్ హెవెన్. నౌ యూ కెన్ గో ఎహెడ్...

హలో మిస్టర్.. దిసీజ్ నాట్ ఎ రోడ్. ఇట్ ఈజ్ కపుల్స్ హెవెన్. నౌ యూ కెన్ గో ఎహెడ్...

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

WD
అప్పుడే కాలేజీలోకి అడుగుపెట్టిన శ్రావణ్‌కు కళాశాల ఓ నందనవనంలా కనిపిస్తోంది. ఆ నందనవనంలోకి తొంగి చూస్తున్న లేలేత సూరీడు కిరణాలకు తళుక్కుమనే మేని ఛాయలతో... కోకిల కుహుకుహుల్లా జవ్వనుల ముద్దైన మాటలు వినబడుతున్నాయి. కళాశాలలో అడుగుపెట్టిన తొలి పురుషుడు తనే అన్నట్లు అక్కడ ఆడవాసన తప్ప మగవాసన లేనే లేదు. దారి తప్పి వచ్చానా...? అని ఆలోచించిన శ్రావణ్, దిక్కులు చూడటం మొదలుపెట్టాడు. కళాశాలకు సంబంధించిన బోర్డు ఎక్కడైనా కనబడుతుందేమోనని వెతికాడు. కానీ ఎక్కడా లేకపోవడంతో తిరిగి వచ్చినదారినే వెనుదిరిగాడు. అలా వెళదామనుకున్న శ్రావణ్ ముందుకు కదల్లేకపోయాడు. అక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదలాలనిపించలేదు.

కారణం... అతడికి పది అడుగుల దూరంలో ఓ అప్సరసలాంటి అమ్మాయి. దివినుంచి భువికి దిగివచ్చిన గంధర్వ కన్యా అన్నంత సుందరంగా ఉంది. ఆమె తన స్నేహితురాళ్లతో మాట్లాడుతూ... మధ్యమధ్యలో నవ్వుతూ ఉంటే... ఆ నవ్వును చూసి పరవశువుడైపోతున్నాడు శ్రావణ్. ఇదంతా మరోవైపు నుంచి గమనిస్తున్న ఓ తుంటరి పిల్ల..." ఏయ్.. ఏంటి చూస్తున్నావ్. ఇందాకట్నుంచి గమనిస్తున్నా... అమ్మాయిలను చూడ్డానికే కాలేజీకి వచ్చావా.. అయినా నీకు లేడీస్ కాలేజీతో పనేంటి...? అని టపటపలాడించిందా అమ్మాయి.

అప్పుడు అర్థమైంది శ్రావణ్‌కి... తను లేడీస్ కాలేజీలోకి అడుగుపెట్టానని. ఇంతలో గేటు కాపలాగా ఉన్న వ్యక్తి పరుగు పరుగున రావడం కనబడింది. అతను వచ్చేలోపే తనే ఆ వైపు వేగంగా అడుగులు వేయడం మొదలుపెట్టాడు. అయినా తన మనసు మాత్రం అక్కడే పడిపోయింది. గేట్‌మేన్ ఓ వంద చీవాట్లు పెట్టి మరోసారి అటువైపు రావద్దని వార్నింగ్ ఇచ్చాడు శ్రావణ్‌కి. కానీ శ్రావణ్ మనసు మాత్రం అక్కడే చిక్కుకుపోయింది.

ఎలాగైనా ఆమెను చూడాలి... కలిసి మాట్లాడాలి... అని ఒక నిర్ణయానికి వచ్చి కాలేజీ గేటుకు కాస్తంత దూరంలో ఎదురుచూడసాగాడు. సమయం సాయంత్రం ఐదు గంటలు. కాలేజీ గేటు నుంచి గుంపులు గుంపులుగా అమ్మాయిలు బయటకు వస్తున్నారు. తను చూసిన ఆ అమ్మాయి ఎక్కడ ఉందోనన్న ఆరాటంలో శ్రావణ్ రోడ్డు మధ్యలోకి వచ్చాడు.

"ఏయ్.. ఏంటీ రోడ్డు మధ్యలో.. నీకు మరో పనిలేదా..." అదే గొంతు. తనను కాలేజీ గ్రౌండులో ప్రశ్నలు వర్షం కురిపించిన అమ్మాయే. ఆమె గొంతు పెంచేసరికి శ్రావణ్ పిల్లిలా రోడ్డు దిగి ప్రక్కనే ఉన్న ఓ టీ బంకు టేబుల్‌పై కూలబడ్డాడు. రోడ్డుపై వెళుతున్న అమ్మాయిలందరినీ తన కళ్లతో జల్లెడ పట్టేశాడు. కానీ తను చూసిన కలల భాషిణి కనబడలేదు. అయినా చీకటి పడేవరకూ ఎదురుచూసి... ఉస్సూరుమంటూ ఇంటిముఖం పట్టాడు. రాత్రి నిదురపట్టదాయే. అదే నవ్వు. అదే రూపం. కళ్లు మూస్తే ఆ మల్లెల సిరివానల నవ్వులు. ఎప్పుడు తెల్లవారుతుందా... అని ఆత్రంగా చూడటం మొదలుపెట్టాడు.

రోజూ శ్రావణ్‌ను లేపేందుకు వారి తల్లిదండ్రులు ఎంతగానో శ్రమించాల్సి వచ్చేది. కానీ అదేమీ లేకుండానే ఆ రోజు శ్రావణ్ ఆరుగంటలకే రెడీయై వెళ్లిపోయాడు. మళ్లీ ఆ అమ్మాయికోసం ఎదురుచూపు. ఇంతలో తనకు చీవాట్లు పెట్టిన అమ్మాయి అటుగా నడిచిరావడాన్ని గమనించి మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. అలా వెనుదిరిగి వెళ్లబోతుండగా... రయ్యమని ఓ కారు దాదాపు అతనిపైకి దూసుకొచ్చినట్లు వచ్చి అతడి మోటారు బైకును తాకుతూ ఆగింది. వెంటనే కారు డోరు తీసి అందులోనుంచి అడుగు కింద పెట్టింది ఓ అమ్మాయి.

ఆమెతోపాటు ఇంద్రలోకం నుంచి జాలువారుతూ వచ్చినట్లు ఓ పన్నీటి తెర అతడిని తాకింది. ఆమె నుంచి వెలువడుతున్న సువాసనల పరిమళాల మత్తుకు శ్రావణ్ తనను తానే మైమరచిపోయాడు. గుడ్లప్పగించి అలా చూస్తుండిపోయాడు, "సారీ... డ్రైవింగ్‌కి నేను కొత్త. మీకేమీ అవలేదుగా..." అంటూ అతడికి సమీపంగా వచ్చి నిలబడింది ఆ అమ్మాయి.

webdunia
WD
కారు మోడ్రన్... కళ్లజోడు మోడ్రన్... చెప్పులు మోడ్రన్... మాటలు మోడ్రనే... కానీ దుస్తుల అలంకరణ మాత్రం పూర్తి సాంప్రదాయం. తెల్లటి వోణీ.. పరికిణీ... నల్లటి కురులు... సుధలూరే పెదవులు.. ప్రేమామృతాన్ని కురిపించే నయనాలు... ఓహ్.. ఇంద్రపురి నుంచి భువికేగిన ఓ కన్నె... ఆమెకోసమే తన హృదయం 24 గంటలుగా అల్లల్లాడుతోంది. "హలో మిమ్మేల్నేనండీ... మీ మోటారు కాస్త అడ్డు తీస్తే నే వెళతాను..." ఆ అమ్మాయి అనడంతో ఇహలోకంలోకి వచ్చాడు శ్రావణ్. "సారీ అండీ. తప్పు నాదే. మీరు కరెక్టుగానే వచ్చారు. నేనే రాంగ్ సైడ్" అంటూ నొచ్చుకున్నాడు.

"మీరు రాంగ్ వచ్చినా నేను రైట్‌గా చూసి నడపాలి కదా.." అని నవ్విందా అమ్మాయి. ఇంకా ఆమె తీయటి మాటలు వినాలనిపిస్తోంది శ్రావణ్‌కి. కానీ ఏం మాట్లాడాలో తెలియని స్థితి. కారు స్టార్ట్ చేసి వెళ్లబోతున్న ఆ అమ్మాయివైపు చూసి, "మా కజిన్ సిస్టర్ ఇదే కాలేజీలో చేరాలనుకుంటోంది. కాస్త వివవరాలు చెప్పరూ..." అన్నాడు. "కాలేజీ గేటు బయట ఎంక్వైరీ ఉంది.. అక్కడ అడగండి. అన్ని వివరాలు చెపుతారు" అంటూ వెళ్లిపోయింది ఆ అమ్మాయి. అలా పరిచయమైన ఆ అప్సరసలాంటి అమ్మాయి తన జీవిత భాగస్వామి అయితే....? ఓహ్.

ఎలాగైనా తనను వివాహం చేసుకోవాలి. ఆ ప్రయత్నంలో ఆమె పేరు... ఊరు... పుట్టు పూర్వోత్తరాలు అన్నీ సంపాదించాడు శ్రావణ్. ఆమె అందానికి తగ్గట్లే.. ఆమె పేరు సుభాషిణి. తండ్రి ఓ పెద్ద బిజినెస్ మ్యాన్. ఉన్నత స్థానంలో ఉన్న అబ్బాయికిచ్చి సుభాషిణిని పెళ్లి చేయాలని చూస్తున్నాడు. ఇదంతా తెలుసుకున్న శ్రావణ్... మనసు విశ్రాంతి తీసుకోవడం మానేసింది. ఆమె ఆలోచనలతో నిండిపోయింది. అలా రోజులు దొర్లిపోతున్నాయి.

కానీ ఆ అమ్మాయితో ఎలాగైనా కలిసి మాట్లాడాలనే తపనతో ఒక్కరోజు కూడా మిస్ అవకుండా... ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 10 వరకూ తను ఎప్పుడూ ఎదురు చూసే టీ బంకు వద్దే కూచోవడం అలవాటైంది శ్రావణ్‌కి. కానీ ఏ రోజూ తను అనుకున్నట్లుగా జరుగలేదు. చివరికి కాలేజీ రోజులైపోయాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ముగించుకుని ఉద్యోగ వేటలో పడ్డాడు శ్రావణ్. అలాంటి రోజులో ఒకరోజు... తమ ఇంటి ముందు ఓ కారు వచ్చి ఆగింది.

కాలేజీ గేటు వద్ద ఏ కారుకోసం ఎదురుచూస్తాడో.... అదే కారు వచ్చి ఇంటి ముందు ఆగేసరికి ఆత్రంగా వెళ్లాడు శ్రావణ్. అందులోంచి అమ్మాయి దిగలేదు. 45 ఏళ్లున్న ఓ మధ్యవయస్కుడు దిగాడు. అతడిని చూసిన శ్రావణ్ బిగుసుకుపోయాడు. మాట్లాడేందుకు నోరు పెగల్లేదు. అయితే అతను మాత్రం అదేమీ పట్టించుకోకుండా.. నేరుగా శ్రావణ్ తల్లిదండ్రుల వద్దకెళ్లి కూచున్నాడు. శ్రావణ్ లోలోన భయపడసాగాడు. తను టీ బంకు వద్ద బీటేస్తున్న సంగతి చెప్పి చీవాట్లు పెట్టిస్తాడా..? అని అనుమానంతో ఓరగా నిలబడ్డాడు.

ఇంతలో సుభాషిణి తండ్రి మాట్లాడటం మొదలు పెట్టాడు. " నా చిన్నారి... సుభాషిణి ఏది అడిగినా ఇప్పటివరకూ కాదనలేదు. నిన్న ఢిల్లీకి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ కొడుకుతో పెళ్లి చూపుల ఏర్పాట్లు చేశాను. అప్పుడు చెప్పింది మీ వాడి గురించి. అతనే కావాలంది. చిత్రం మీ వాడు మా అమ్మాయితో ఒకే ఒక్క సందర్భంలో మాట్లాడట. మరి ఆ కాస్సేపట్లో అతనిలో ఆమెకు ఏమి నచ్చాయో.. నాకైతే. తెలీదు. మీరు ఒప్పుకుంటే.. కార్యక్రమం పూర్తి చేద్దాం. మీవాడికి ఉద్యోగం లేదు. మీకు వెనుకా మందు ఆస్తులు లేవు. అయినా... ఎందుకంటే నా చిన్నారి సెలక్షన్. మామూలుగా ఉండదు. గోల్డ్. మరి వస్తా..." అని వెళ్లిపోయాడు.

ఆ తర్వాత సుభాషిణి- శ్రావణ్ వివాహం అయింది. తను కలలు కన్న కన్నియ తన భాగస్వామి అయింది. తొలిరేయికై ఆ కలభాషిణి సుభాషిణి అడుగులో అడుగువేసుకుంటూ శ్రావణ్ ముందు వచ్చి నిలుచుంది. సరసాలు పోవాల్సిన ఆ సమయంలో... శ్రావణ్, " నేను నీకెందుకు నచ్చాను" అని సుభాషిణిని అడిగాడు. దానికామే అందంగా నవ్వింది.

తేనియలూరే పెదవులను అందంగా కదుపుతూ... "నాకోసం రోజూ క్రమం తప్పకుండా ఎదురు చూశారు. అలాగే నా వివరాలన్నీ తెలిసినా మా ఇంటివైపు తొంగి చూడలేదు. నా ఫోను నెంబరు మీ వద్ద ఉన్నా నాకు ఫోను చేయలేదు. ఒక అమ్మాయి పట్ల అబ్బాయి ఎలా ఉండాలని ఒక అమ్మాయి కోరుకుంటుందో అలా ఉన్నారు. నాకోసం టీ బంకు వద్ద గంటలు గంటలు ఎదురు చూశారు తప్ప.. నాకేనాడు ఆటంకం కలిగించలేదు. నాకోసమే ఎదురు చూస్తున్నట్లు మరెవరికీ చెప్పనూ లేదు. ఆ మంచితనం నాకు నచ్చింది. మీరు నిజంగా గోల్డ్" అంది సుభాషిణి.

శ్రావణ్ మరోసారి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. ఆమె మాట్లాడుతుంటే అలా చూస్తుండిపోయాడు. మరో మాట మాట్లాడలేదు. "హలో మిస్టర్... దిసీజ్ నాట్ ఎ రోడ్. ఇట్ ఈజ్ కపుల్స్ హెవెన్. నౌ యూ కెన్ గో ఎహెడ్" అన్న సుభాషిణి మాటలు విన్న శ్రావణ్ తొలిరేయికి పరుగులు పెట్టించాడు.

Share this Story:

Follow Webdunia telugu