Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేయసిలేని 'ప్రేమ' కోసం 143 పేజీల ప్రేమలేఖ

ప్రేయసిలేని 'ప్రేమ' కోసం 143 పేజీల ప్రేమలేఖ

Munibabu

FileWD
ప్రేమ మనిషి జీవితంలో భాగం. దీనిపై ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన అభిప్రాయం. కొందరు ప్రేమ గొప్పదంటారు. మరికొందరు దానివల్ల కష్టాలే తప్ప మరేం లేదంటారు. ఏది ఏమైన యవ్వనంలో కలిగే ప్రేమ ప్రతి మనిషికీ ఓ మధుర జ్ఞాపకమే. అందుకే ప్రేమలో పడ్డవారు పదాలు రాకపోయినా కవులై పోతారు. అక్షరాలు లేకుండానే ప్రేమకవిత్వాలు రాసేస్తారు.

అయితే ప్రస్తుత రోజుల్లో ప్రేమ లోతేంటో తెలిసినా ప్రేమ పక్షులు కవులయ్యే సంగతేమోకాని, 'ప్రియా... నీవు లేని లోకంలో ఒంటరిగా నిలుచున్నా... అంటూ వాక్యాలు కూడా రాయలేక పోతున్నారు.

కాలంతో పాటు ప్రేమలోనూ మార్పులు వస్తున్నాయి. చూపులు కలిస్తే నాలుగు మాటలు... పరిచయమైతే పబ్‌లో కప్పు కాఫీ... మరింత గాఢమైతే బీచ్‌లో భేటీలు... మనస్సులు జత కలిస్తే ఏడడుగుల బంధం... నచ్చకుంటే ఎవరిదారి వారిదే. ఇది ఈ కాలపు ప్రేమాయణం. అంతేనండోయ్.. ప్రేమ కూడా వ్యాపారమైపోతోంది.

ప్రేమలేఖలకు, ఎదురుచూపులకు కాలం చెల్లింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఓ వీర ప్రేమికుడు ప్రేయసి కోసం సింపుల్‌గా 143 పేజీల ప్రేమలేఖను రాశాడు. అతడి ఓపికకు జోహార్లు. 'ప్రేమికుల రోజై'న ఫిబ్రవరి 14న ఈ లేఖను మొదలు పెట్టిన ఆయన 'ఐ లవ్‌ యూ'కు కోడ్‌భాషకు సరిపడేలా 143 పేజీల లేఖ రాశాడు.


ప్రేమ కోసం ఎస్ఎమ్ఎస్ తప్ప చిత్తు కాగితం మీద కూడా అక్షరాలు రాయలేని ఈ కాలంలో ఇతడు 143 పేజీల లవ్‌లెటర్ రాశాడంటే పనీపాట లేదేమో అని పొరబాటు పడకండి. ఇంత సూదీర్ఘమైన ప్రేమలేఖ రాసిన హరీష్ అనే సదరు పురుషపుంగవుడు బీఎస్ఎన్ఎల్ సంస్థలో ఉద్యోగి.

అయితే హరీష్ రాసిన ఈ ప్రేమలేఖకు సంబంధించి రెండు విశేషాలున్నాయి. ఇంతపెద్ద ప్రేమలేఖ రాసిన హరీష్‌కు నిజ జీవితంలో ప్రేయసి లేదు. అలాగే అతను ఈ ప్రేమలేఖను రాసింది తన ప్రేమికురాలి కోసం కాదు. ఇంతకీ హరీష్ ఇంత సుదీర్ఘమైన ప్రేమలేఖ రాసింది ఎందుకో తెలుసా..? తన పేరును గిన్నీస్ రికార్డులో పదిల పరుచుకోవడానికేనట. సుదీర్ఘ ప్రేమ రాసేందుకు హరీష్‌కు ఓపిక ఉందేమోగానీ.. ఆ లేఖను చదివేందుకు మనకు మాత్రం సమయమెక్కడుంది చెప్పండి.

ఇంతకీ ఈ ప్రేమలేఖలో ఉన్న అసలు విశేషాలేంటో తెలుసుకుందామా? 143 పేజీల్లో రాసిన ఈ ప్రేమలేఖను వరుసగా పేరిస్తే 143 అడుగుల పొడవు అవుతుందట. ప్రియమైన అభిసారికకు... అని మొదలుపెట్టి.. ఈ ప్రేమలేఖ నీకోసమే వేచి ఉన్నా... అనే వాక్యంతో పూర్తి చేశాడు. ఈ లేఖలో ఉన్న 4,136 వాక్యాల్లో మొత్తం 33 వేల 100 అక్షరాలను పొందు పరిచాడు. ఇన్ని విశేషాలున్నాయి కాబట్టే... ఈ ప్రేమలేఖ ద్వారా గిన్నీస్‌లో స్థానం సంపాదించాలని హరీష్ కలలు కంటున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu