ప్రిన్సెస్ డయనా (ప్రేమ) లేఖలు రగిలిన ఆ రోజు...
విరబూసే వెన్నెల నవ్వితే ఎలా ఉంటుందీ...?నిండు పున్నమినాడు గలగలల గోదారి ప్రశాంతపు పరవళ్లు ఎలా ఉంటాయి...?ప్రకృతి ఒడిలో ముత్యపు వాన చినుకుల్లో తడుస్తూన్నప్పుడు ప్రేమించే హృదయం హత్తుకుంటే ఎలా ఉంటుందీ...?సంధ్యా సమయంలో పక్షుల కిలకిలలమధ్య ఇరు ప్రేమ హృదయాల ఎదలోతుల్లో పురివిప్పిన ప్రేమలయల మూగ వేదన ఎలా ఉంటుంది...? ఇటువంటివన్నీ ప్రేమికుల ఎదఎదనూ పైకెగదోయు అంశాలే... చెప్పాలంటే ప్రేమికులు వల్లించే విరహ భావనల లోతులు ఇంతకన్నా ఘాటుగానే ఉండవచ్చు. ఆ ఘాటైన ప్రేమ గుళికల రసానందం కేవలం ప్రేమికులకే తెలుసు. ఆ రసానందం కాస్సేపు దూరమైతే చాలు... చనువెరిగిన హృదయం దూరమైనప్పుడు అనుభవించే విరహవేదనను చంపకమాలగానూఊరిస్తూ ఉరకలవేయిస్తూ వయసు చేసే అలజడులు ఉత్పలమాలగానూ కను రెప్పలమాటున దాగిన ఇష్ట స్వరూపి బింబం కంద పద్యంగానూ... ఎంత వర్ణించినా.. ఎలా చెప్పనూ... ఇంకా ఏదో చెప్పాలి.. చెప్పాలి... రాయాలి... రాయాలి.. రాస్తూనే ఉండాలి.. ప్రేమలేఖలు. ఆ అందమైన ప్రేమలేఖల అక్షరపు విలువ వెలకట్టలేనిది. మనిషి ఉనికి లేకున్నా వారి మనసుతో మాటాడించే తీయనైన భావనే ఆ ప్రేమలేఖ. అటువంటి ప్రేమలేఖ బుగ్గైతే... అప్పటివరకూ మనసు దోచిన నెలరాజు/ వెన్నెల రాణిని పలువరించే ప్రేమాక్షరాల ప్రాణాలు పోవూ. నిజంగా అదే జరిగింది. పాలకడలి నుంచి కడిగిన ముత్యంలా ఈ భూప్రపంచంపై కాలిడిన ప్రిన్సెస్ డయానా మరణం ఓ మిస్టరీ. ఆమె పెళ్లి ఒక కాంట్రడిక్టరీ. కానీ ఎవరికీ తెలియని ఆమె (ప్రేమ)లేఖలు బుగ్గి పాలవడం మాత్రం మిస్టరీ..? అవును.. డయనా తన స్వహస్తాలతో రాసిన లేఖలను ప్రిన్సెస్ మార్గరేట్ బుగ్గిపాలు చేసిందట. ఈ లేఖల్లే డయానా రాసిన ఉత్తరాలతోపాటు రాజరికపు కుటుంబాలకు సంబంధించిన ఎన్నో వ్యక్తిగత రహస్యాలున్నాయట. రాచరికపు కుటుంబ సభ్యులు వెలువరిచిన ఆ వ్యధలను బయటి ప్రపంచం చూడరాదని ఎలిజబెత్- 2 ఆదేశించడంతో ఆ రహస్యపు అక్షరాల ఖజానాను తాను బుగ్గి చేసినట్లు ప్రిన్సెస్ మార్గరేట్ తన స్నేహితురాలతో చెప్పినట్లు ఇటీవల ఓ పత్రిక ప్రచురించింది. చార్లెస్‌తో డయానా విడిపోయిన తర్వాత ఆమె రాసిన లేఖలు.. ఇంకా వ్యక్తిగతమైన ఉత్తరాలు కాలి బూడిదైన లేఖల్లో ఉన్నాయట. ఏం చేస్తాం... మొన్న డయనా ప్రేమ హృదయం రగిలింది.. నిన్న డయానా హృదయాక్షరాల హోరు ప్రజ్వరిల్లి కాలి బూడిదైంది. ఎంతైనా నిండు ప్రేమ క(థా)దా.