Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుస్తకాల సాక్షిగా... ప్రేమ కథ

పుస్తకాల సాక్షిగా... ప్రేమ కథ

WD

FileFILE
అనుకున్న దాని కన్నా ముందుగానే లైబ్రరీకి చేరుకున్నాడు సురేష్. నిలువెత్తు నిశ్శబ్ధానికి నిదర్శనంగా లైబ్రరీలో పంఖాల చప్పుడు, పుస్తకాల కాగితాల కదలికల నుంచి ఉద్భవించే శబ్దాలు మినహాయించి మరేవిధమైన శబ్దం లైబ్రరీ ఆవరణలోకి చొరబడే సాహసం చేయడంలేదు. చేతిలో పుస్తకం కాగితాలు కదిలిస్తున్నా అతని చూపంతా కిటికీ నుంచి కనపడే రోడ్డు పైనే కేంద్రీకృతమై ఉంది. లైబ్రరీకి ఆనుకుని ఉన్న మహిళా కళాశాలలో తరగతులు ముగిసినందుకు సంకేతంగా విద్యార్థినులు అందరూ బిలబిలామంటూ రోడ్డు మీదకు వచ్చారు. అమృత కోసం సురేష్ కళ్లు ఆతృతగా వెదికాయి. కాసేపటికి రోడ్డు మొత్తం ఖాళీ అయిపోయింది.

"బహుశా అమృత ఇవాళ కాలేజీకి వచ్చి ఉండదు..." అనుకున్నాడు. ఇవాళ సాయంత్రం ట్రైన్‌కు హైదరాబాద్ వెళ్లిపోతున్నాడు సురేష్. మంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలో అతనికి ఉద్యోగం వచ్చింది. అమృత కాలేజీ చదువు ఈ సంవత్సరంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి భవిష్యత్ ప్రణాళికను చర్చించుకోవడానికి.... క్షమించాలి... వ్రాతపూర్వకంగా మాట్లాడుకోవడానికి లైబ్రరీలో కలవాలని అనుకున్నారు. ఒక్కసారిగా సురేష్ గతంలోకి వెళ్లిపోయాడు. ముఖ్యమైన పుస్తకం కోసం లైబ్రరీకి వెళ్లిన సురేష్‌కు... అక్కడ సీరియస్‌గా నాలుగైదు పుస్తకాలు చదువుకుంటున్న అమృత కనిపించింది. తొలిసారిగా ఏదో తెలియన భావనకు గురైయ్యాడు. దానినే ప్రేమ అని తెలుసుకోవడానికి, అదీ అమృత చెప్తే కానీ అతనికి తెలియలేదు.

webdunia
FileFILE
తమ ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడం, అలాగే పదుగురి నోళ్లలో నానడం వారిద్దరికి ఇష్టం లేదు. అందుకే చిన్న చిన్న కాగితపు ముక్కల ప్రేమ లేఖలను లైబ్రరీలో పుస్తకాల ద్వారా ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా వారి ప్రేమను పరిపుష్టం చేసుకోసాగారు." నేను నిన్ను ప్రేమిస్తున్నాను... ", "బాగా చదువుకోవాలి...", "ఇంటర్వ్యూలో నువ్వు నెగ్గాలి..." ఇలాంటి మాటలన్నీ రాతపూర్వకంగానే జరిగేవి. ఇంటర్నెట్, సెల్ ఫోన్ ఎస్ఎమ్ఎస్ ప్రేమికులకు వారధి వేస్తున్న ప్రస్తుత కాలంలో అమృత, సురేష్‌లు వాటి జోలికి కూడా పోలేదు. కిటికీలో నుంచి అమృత కనపడగానే సురేష్ కళ్లలో ఎక్కడలేని వెలుగు తొంగి చూసింది.

సురేష్ ఎదురుగా గల కుర్చీలో కూర్చుంది అమృత. ఇక మొదలైంది ఉత్తరాల పర్వం... "సారీ... రావడం లేటైంది...", "ఈ మాత్రానికే సారీ చెప్పాలా...", "సరే రాత్రి ట్రైన్‌కే కదా బయలుదేరేదీ?..." "అవును...", "నాకు కూడా మీ కంపెనీలో ఏదైనా జాబ్ చూడరాదూ?", "ఓ దానికేం సరియైన మ్యాన్‌పవర్ కోసం వాళ్లు తెగ వెదికేస్తున్నారు. కాలేజీ పూర్తయ్యేలోగా ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు పూర్తి చేసేయి...", "ఓకే అలాగే...", "అంతా సవ్యంగా జరిగితే పెద్దల అంగీకారంతో పెళ్లి పీటల మీద కూర్చుందాం...", ఖాళీ కాగితంతో బదులిచ్చింది అమృత. "అయ్యబాబోయ్ అంత సిగ్గా?...", "అది కాదు పెద్దలు ఒప్పుకుంటారా?" "మనం తప్పు ఏమి చేయటం లేదు కదా... ప్రేమించుకున్నాం అంతే... అదీ నాకు ఉద్యోగం వచ్చాకనే కదా మనం పెళ్లి చేయమని అడుగుతోంది...", "నిజమే కానీ...", "కానీ లేదూ అర్థణా లేదూ...", "సరే అలాగే... నీ ఆరోగ్యం జాగ్రత్త విష్ యూ ఆల్‌ది బెస్ట్..." అలా సాగింది ప్రేమజీవుల ఉత్తరాయణం. కల్మషమెరుగని వారి ప్రేమకు మనమూ చెబుదాం బెస్టాఫ్‌లక్

Share this Story:

Follow Webdunia telugu