కార్యాలయాల్లో రొమాన్స్ నేడు సర్వసాధారణమైందంటున్నారు నిపుణులు. అయితే ఈ శృంగారం కార్యాలయాలకు పెద్ద తలనొప్పిగా తయారవుతోందట. కొన్ని జంటల శృంగారం శృతి మించి రాగాన పడటంతో అది మిగిలిన ఉద్యోగుల దృష్టికి వచ్చి వారిపై ప్రత్యేక చర్చలు, సెటైర్లు వేసుకుంటూ చేసే పని గంటలు తగ్గిపోతున్నాయట.
మరోవైపు పీకల్లోతు శృంగారంలో మునిగిపోయిన సదరు జంట 'కామాతురాణం నభయం, నలజ్జ' చందంగా ప్రవర్తిస్తూ తమ సెల్‌ఫోన్లలో నిమిషానికో మెసేజ్ ఇచ్చుకుంటూ ఆఫీసు కాలాన్ని హరించివేయడం జరుగుతోందట. ఇదిలా ఉంటే కార్యలయంలో కొన్ని జంటలు నెరపే విచ్చలవిడి రొమాన్స్ మూలంగా ఆయా కంపెనీలకు చట్టపరమైన ఇబ్బందులు తలకు చుట్టుకుంటున్నాయట.
ఎన్ని సమస్యలున్నా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎవరు ఎగతాళి చేసినా, ఆఫీస్ రొమాన్స్‌ను సదరు కపుల్స్ ఆపనే ఆపరని రొమాన్స్‌పై పరిశోధనలు చేస్తున్న లండన్ పరిశోధకుల బృందం తేల్చేసింది. ఎందుకంటే 24 గంటల్లో మూడొంతుల జీవితాన్ని ఆఫీసులో గడపడమే ఇందుకు కారణమనీ, సమస్యలలో ఉన్న స్త్రీ/పురుషుడు మరో వ్యక్తితో మనసు విప్పి మాట్లాడుకునే వేదికగా ఆఫీసు మారుతోందంటున్నారు.
అయితే సక్రమమైన రొమాన్స్(పెళ్లితో ముగిసేది) కాక వివాహేతర రొమాన్స్ చాలా చేటు చేస్తోందనీ, అది వారి వ్యక్తిత్వాలపై ప్రభావం చూపి విలువ లేకుండా చేస్తుందనీ, ఫలితంగా సదరు ఉద్యోగి ఉద్యోగం ఊడే పరిస్థితి తలెత్తుతుందంటున్నారు.
ఇదిలా ఉంటే "ఆఫీసులో రొమాన్స్" బయట ప్రపంచానికి తెలియడంతో సదరు ఉద్యోగుల యాజమాన్యపు పరువు ప్రతిష్టలు గంగలో కలిసేదిగా ఉంటుందని తమ పరిశీలనలో తేలిందంటున్నారు. చాలా కంపెనీలు ఇటువంటి అడ్డగోలు ప్రేమాయణాలు తమ దృష్టికి వచ్చినప్పుడు వాటిని అడ్డుకునేందుకు పరోక్ష హెచ్చరికలు చేయడం జరుగుతోందంటున్నారు.
ఇక్కడ రొమాన్స్ చేసుకోవచ్చు...
ఆఫీసు రొమాన్స్‌ను కొన్ని కంపెనీలు సాదరంగా స్వాగతిస్తున్నాయి. కొన్ని జంటలు తాము త్వరలో భార్యాభర్తలవుతామని సదరు కంపెనీకి నచ్చజెప్పిన మీదట వారి రొమాన్స్‌కు ఆఫీసులో గ్రీన్ సిగ్నల్ ఉంటుందట. అయితే ఆఫీసు పని ముందు... ఆ తర్వాతే రొమాన్స్. అయితే అది శృతి మించి పెళ్లికి ముందే లైంగిక సంబంధానికి దారితీస్తున్నట్లు తెలిస్తే... ఉద్యోగులను నేరుగా ఇంటికి పంపటానికి సదరు కంపెనీలు వెనుకాడవు.
ఆఫీస్ రొమాన్స్... ఇబ్బందులు
ఆఫీస్ రొమాన్స్ చేసే ఉద్యోగులలో చాలా సందర్భాల్లో వారివారి జీవితాల్లో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలే ఎక్కువంటున్నారు పరిశోధకులు. రొమాన్స్ జరిపిన ఫలితంగా ఏదో ఒకరోజు వివాహమాడక తప్పదు. ఇలా వివాహం చేసుకున్న రొమాంటిక్ కపుల్స్‌కి ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు.
"మాది కాంక్రీట్ రొమాంటిక్ బంధం" అని చెప్పుకునే కపుల్స్ ఉన్నట్లుండి తమ బంధాన్ని తెగ్గొట్టుకుని వీధికెక్కడం వంటి చర్యల వల్ల అటు కంపెనీకి, ఇటు వారి జీవితాలు సమస్యల్లో చిక్కుకున్న సందర్భాలు అనేకం. ఇక అక్రమ రొమాంటిక్ బంధాల గురించి వేరే చెప్పనక్కరలేదు. అవి ఎప్పుడు విస్ఫోటనానికి గురవుతాయో, సదరు కపుల్‌లోని ఏ వ్యక్తి జీవితంతో ఆడుకుంటాయో చెప్పలేని పరిస్థితి.
ఈ నేపథ్యంలో నేడు చాలా కంపెనీలు ఆఫీస్ రొమాన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించి ఈ సమస్యను అధిగమించడానికి ప్రత్యేక నిబంధనావళిని తయారు చేస్తున్నాయి. ఉద్యోగులైనవారిలో ఎవరైనా రొమాన్స్ నెరపినట్లు తెలిస్తే, దానివల్ల కలిగే దుష్ఫలితాలకు తాము బాధ్యులము కాదని కొన్ని కంపెనీలు ఉద్యోగుల వద్ద సంతకాలు తీసుకుంటున్నాయట. ప్రస్తుతం ఇది పాశ్చాత్య దేశాల్లో అమల్లో ఉంది. త్వరలో దీనిని మన దేశంలోని ప్రధాన నగరాలలో ఉండే కంపెనీలు ఆచరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమచారం.