ప్రేమగురించి చాలాసార్లు, చాలా సందర్భంలో ఎంతో గొప్పగా చెప్పుకునే ఉంటాం. కానీ ప్రేమ గురించి ఎంత చెప్పినా, ఎంత విన్నా ప్రేమలో పడ్డ ప్రతి ఒక్కరూ ఆ ప్రేమ గురించి మరో కొత్త కోణంలో మనకు వివరించే ప్రయత్నం చేస్తునే ఉంటారు. ఎటొచ్చి మనం అంతకుముందు అలాంటి ప్రేమ కథలు చాలానే వినివుంటాం. అందుకే వారు చెప్పేది మనకు ఏమాత్రం ఆసక్తి కలిగించకపోవచ్చు.
కానీ ఆ చెప్పేవారిని ఒక్కసారి మనం గమనించగలిగితే వారిలో కనిపించే ఆ సంతోషం, ఆతృత, కళ్లలో మెరుపు మనకు స్పష్టంగానే కనిపిస్తుంది. తొలిప్రేమ మైకం మదిని కమ్మేసినవేళ ప్రతీ ఒక్కరిలో కనిపించే లక్షణాలే అవి అని సరిపుచ్చుకుందామనుకున్నా ఎందుకో ఆ తరహా ప్రేమలు కొద్దిరోజులు తర్వాత కచ్చితంగా విచ్చిన్నమయ్యే ఉంటాయి. తొలినాళ్లలో ఓ వ్యక్తిలో సంతోషాన్ని, ఆతృతను కలిగించిన ప్రేమ రానురాను ఎందుకలా వాడిపోతుందంటే జవాబు చెప్పడం అంత కష్టమేమీ కాదు.
కేవలం ఆకర్షణ కారణంగానో, వయసు ప్రభావంతోనో కలిగే అలాంటి ప్రేమలు పొద్దున వికసించిన పువ్వుల్లా పరిమళాలు వెదజల్లినా రోజులు గడిచేకొద్దీ వాడిపోక తప్పదు. ఎందుకంటే ఆ తరహా ప్రేమల్లో ఆకర్షణ, ఆవేశం, ఆతృత తప్ప ఆలోచన, కలిసి ఉండాలనే తపన, వీడిపోకూడనే నిశ్చితాభిప్రాయం ఉండదు కాబట్టి. యవ్వనం చిగురించే వయసులో, కాలేజీ క్యాంపస్‌లో, రోజూ బస్సెక్కే బస్టాండుల్లోనూ చిగురించే ఇలాంటి ప్రేమలు ఎందుకు రాణించవంటే అసలవి ప్రేమలే కావు కాబట్టి.
మరి అలాంటి ప్రేమల కోసం విపరీతమైన తపన అవసరమా అని ప్రశ్నించుకుంటే ఇక ప్రేమ అనేది విఫలమయ్యే ప్రసక్తే ఉండదు. సినిమాల ప్రభావం కావచ్చు, సమాజంలో వచ్చిన మార్పులు కావచ్చు ఇద్దరు యువతీ యువకుల మధ్య సహజసిద్ధంగా ఏర్పడే ఆకర్షణకు ప్రేమ అనే అందమైన పేరు పెట్టి ఆ అకర్షణ కాస్తా తగ్గాక మా ప్రేమ విఫలమైందని చెప్పుకోవడం నేడు రివాజుగా మారింది. అందుకే ప్రేమ పేరుతో నేటి సమాజంలో ఇన్ని ఘోరాలు, ఇన్ని నేరాలు జరుగుతున్నాయి.
అయితే ఏమాత్రం నిజంలేని, ఆకర్షణవల్ల మాత్రమే ఏర్పడ్డ అలాంటి ప్రేమలకోసం మనమెందుకు అలా తపనపడడం అని సదరు ప్రేమికులు ఒక్కసారి ఆలోచించగలిగితే ఇక అలాంటి ప్రేమలు మచ్చుకైన కన్పించవు. అంతేకాదు ఆ తరహా ప్రేమలవల్ల జరుగుతున్న దారుణాలు సైతం ఉండవు. అందుకే ఆలోచించండి భవిష్యత్ జీవితాన్ని నాశనం చేయడం తప్ప ఓ జీవితాన్ని నిలబెట్టడానికి ఏమాత్రం పనికిరాని అలాంటి ప్రేమల గురించి అంతగా తపన పడడం అవసరమా... ?