ప్రేమ అన్న రెండక్షరాలకున్న శక్తి తక్కువేమీ కాదు. ప్రేమ అన్న దానికి జాతిలేదు, మతం లేదు, కులం లేదు, గోత్రం లేదు. జీవితాంతం ప్రేమను కాపాడుకునేవారే దానికి కావల్సింది. అందుకే ప్రేమ విశ్వ వ్యాప్తమైంది. ప్రపంచంలో ఏమూలన ఉన్న మనిషైనా, ఏ భాషా మాట్లాడేవారైనా, ఎలాంటి సంస్కృతికి చెందినవారైనా సరే ప్రేమబావం మనసులో అడుగుపెట్టిందంటే ఒకేలా స్పందిస్తారు. తమలో ఊపిరి పోసుకున్న ప్రేమను కాపాడుకోవడానికి ఏ త్యాగానికైనా సిద్ధమవుతారు. మనిషిలో అంతర్లీనంగా ప్రేమ అనే భావం ఉంది కాబట్టే ఎవరెన్ని చెప్పినా, ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా ప్రతిసారీ ప్రేమ విజయం సాధిస్తూనే ఉంది. మరి ఓడిపోయిన ప్రేమల సంగతేంటి... ? అన్న సందేహం ఇక్కడ మనకు రావచ్చు. |
నిజమైన ప్రేమలేని వారి నుంచి దూరం కావడం ద్వారా ప్రేమ విజయాన్నే సాధిస్తుంది.
|
|
|
ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. ఎందుకంటే విజయం సాధించడమే తప్ప ఓటమి ఎరగనిదే ప్రేమంటే. ప్రేమించి జీవితంలో ఒకటికాలేక పోయిన ప్రేమ జంటలన్నీ తమ ప్రేమ ఓడిపోయిందనో, ప్రేమ విజయం కాలేదనో చెబుతుంటారు. అంతేనా తమ ప్రేమ ఓడిపోయింది కాబట్టే తాము జీవితంలో ఒక్కటి కాలేక పోయామని చెబుతుంటారు.
కానీ వీరి విషయంలో వాస్తవానికి ప్రేమ ఓడిపోలేదు. విజయమే సాదించిందని చెప్పవచ్చు. ఇద్దరి మధ్య ఏర్పడిన ప్రేమ బందం నిజమైతే వారెపుడూ విడిపోవడానికి ప్రయత్నించరు.
అలాకాక ఇంట్లోవారు వద్దన్నారనో, పరిస్థితులు అనుకూలించలేదనో ప్రేమబంధం నుంచి దూరం కావాలని ఎప్పుడైతే ప్రేమికుల జంట ఆలోచిస్తుందో వారి మధ్య జనించిన ప్రేమ అప్పుడే వారి నుంచి దూరమై పోతుంది. నిజమైన ప్రేమలేని వారి నుంచి దూరం కావడం ద్వారా ప్రేమ విజయాన్నే సాధిస్తుంది.
అలా ప్రేమ దూరమయ్యాక ప్రేమలో మేము ఓడిపోయామని ప్రేమికులు పేర్కొంటే ఆ ఓటమి ప్రేమకు ఎట్టి పరిస్థితుల్లోనూ వర్తించదు. అందుకే నిజమైన ప్రేమ ఎన్నటికీ ఓడిపోదు. అలాగే ఇద్దరు మనుషులు ఓడిపోతే ఆ ఓటమి ప్రేమకు సంబంధించింది కానేకాదు. ఒకవేళ అందరూ చెబుతున్నట్టు ఓడిపోవడమన్నదే తెలుసుంటే ప్రేమ ఇంత గొప్ప విషయం అయ్యేది కాదు.