Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంచులోకంలో విరిసిన మరుమల్లె

మంచులోకంలో విరిసిన మరుమల్లె
, మంగళవారం, 18 డిశెంబరు 2007 (13:24 IST)
యిమ్మడిశెట్టి వెంకటేశ్వర్రావు
కుర్రాళ్లతో కాలేజీ నందనవనంగా ఉంది. ఆకాశాన్నంటే వృక్షాల నీడన బోయ్స్ అండ్ గాళ్స్ ఊసులాడుకుంటున్నారు. మరోవైపు తమకే తెలిసిన తీయని నవ్వులను కాలేజీ ప్రాంగణంలో విరబూయిస్తున్నారు అమ్మాయిలు. ఆ అందమైన నవ్వులు వెన్నెల తెచ్చిన వసంతంలా ఉంది. ఆరడగుల అందగాడుగా పేరుతెచ్చుకున్న నరేంద్రకు మాత్రం కోపం నషాలనికంటుతోంది. ఎందుకంటే అతనికి ఆడాళ్లంటే ద్వేషం.

ఎందుకో... అని ఎవరైనా అడిగితే... రెండు ముక్కల్లో మాత్రం చెప్పడు. పరిచయంతో మొదలై దానికి మహాకావ్యం రూపు తెచ్చే ప్రయత్నం చేస్తాడు. అందుకే అతనివద్ద అమ్మాయిల గొడవను ఎవరూ ఎత్తరు. ఆడాళ్లంటే తనకు ఉన్న అయిష్టతను ఎవరూ అడగకుండానే అందరి వద్ద ప్రకటించటం అతని దినచర్యలో ఓ భాగమైపోయింది. ఈ విషయం ఆ నోటా... ఆ నోటా అదే కళాశాలలో చదువుతున్న మల్లికను చేరింది.

సృష్టికి మూలం స్త్రీయే అని అతనికి తెలియజెప్పాలని గట్టిగా నిర్ణయించుకుంది మల్లిక. ఈ మల్లిక ఓ చూపు విసిరితే... చాలు... అన్నట్లు ఆమె కోసమే అబ్బాయిలు పడిగాపులు కాస్తుంటారు. అంతటి అందగత్తె అయిన మల్లిక నరేంద్ర మనసును మార్చాలనే కాదు... అందగాడైన అతని చేయిపట్టాలని కూడా లోలోన నిర్ణయించుకుంది. అంతే తన తోటి స్నేహితురాళ్లతో మగ వేషాలు వేయించింది. నరేంద్ర ఇంటికి తరచూ వెళ్లటమే కాదు అతనికి మంచి మగ స్నేహితునిగా మారింది.

కళాశాల సగం రోజులు గడిచాయి. డిసెంబరు మాసం వచ్చింది. ప్రకృతి అందాలు మంచు తెరలమాటున మాయమవుతూ ఓ అద్భుత లోకాన్ని సృష్టిస్తున్నాయి. ఆ మంచు మేఘాలను చీల్చుకుంటూ నరేంద్ర తన కళాశాల ఆవరణలో అడుగుపెట్టాడు. బోర్డుపై ప్రతి ఏటా తమ కాలేజీ చేపట్టే సాహసయాత్ర ఈసారి హిమాలయాలపై దృష్టి సారించిందని రాసి ఉంది. ఇటువంటి సాహసయాత్రలను చేయటంలో ఎంతో ఆసక్తిని కనబరిచే నరేంద్ర యాత్రకు రంగం సిద్ధం చేసుకున్నాడు.

అతనితోపాటు మగ ఫ్రెండ్ మల్లికా సిద్ధమైంది. మూడు రోజులు ప్రయాణంలో తాను పడతినికాదన్న విషయం తెలియకుండా ఉండేందుకు మల్లిక నానా తంటాలు పడింది. చివరికి వారు బసచేయాల్సిన హోటల్‌కు చేరుకున్నారు. ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేసే అలవాటును నరేంద్ర మంచు కొండల్లోనూ సాగించాడు. అలాంటి రోజుల్లో ఓ రోజు.... మగవేషంలో ఉన్న మల్లిక నరేంద్రను అనుసరిస్తోంది.

ఒక్కసారిగా మంచువాన... ఎముకులు కొరికే చలి... సాహస యాత్రలో జయించాలన్న నిశ్చయంలో నరేంద్ర, ఆ మంచువానను లెక్కచేయక మంచు పర్వతాలవైపు వడివడిగా నడుస్తున్నాడు. ఇంతలో పెద్ద కేక... అల్లంత దూరాన ఓ అమ్మాయి మంచువానకు గువ్వలా ఒదిగిపోయి గడగడ వణుకుతోంది. ఒక్క ఉదుటున ఆమెవద్దకు చేరాడు నరేంద్ర.. చిత్రం.... ఆడాళ్లంటేనే అసహ్యంచుకునే నరేంద్ర... ఆ క్షణం..

ఆమె అందానికి దాసుడయ్యాడు. మొదటిసారిగా అతని మోములో ప్రేమ తాలూకు భావనలు మొలిచాయి. చలిగా నటించటాన్ని మల్లిక మరింత ఎక్కువ చేసింది. అంతే అతను తనను తాను మరిచి మల్లికను తన చేతులపై వేసుకుని తన హోటల్ గదివైపు పరుగులు తీయటం ప్రారంభించాడు. అంతలో చటుక్కున అతనిలో ఓ ఆలోచన... తన స్నేహితుడేమయ్యాడా అని...

అతని ఆలోచనను పసిగట్టిన మల్లిక మగస్నేహితుని తాలూకు ఆనవాళ్లను అతని ముందు పరిచింది. నరేంద్ర మరో మాట మాట్లాడే లోపే మంచు వాన మరింత అధికమైంది. మల్లిక మరింత దగ్గరయ్యింది... మధురమైన తన మంచుయాత్రను, మల్లికతో సాగించిన ప్రణయాన్ని ఈసారి తన స్నేహితులతో కాదు.... తన భార్యామణి మల్లికతోనే మళ్లీ మళ్లీ చెపుతూనే ఉన్నాడు నరేంద్ర.

Share this Story:

Follow Webdunia telugu