Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమ మైకంలో మనసు పలికే మౌనరాగం

Advertiesment
ప్రేమ మైకంలో మనసు పలికే మౌనరాగం
ప్రేమంటే ఏమని ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరూ ఒక్కో అభిప్రాయాన్ని వెలిబుచ్చుతారు. ప్రేమ అన్న పదాన్ని అందరి పెదాలు ఒకేలా ఉచ్చరించినా ఆ భావం మనసులో చేరినపుడు వారి నుంచి వచ్చే అభిప్రాయాలు మాత్రం అనేక రకాలుగా ఉంటాయి. విశ్వంలోని ప్రతి అంశంపై వివిధ అభిప్రాయాలున్నట్టే ప్రేమ మీద కూడా ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం.

ప్రేమ గొప్పదంటూ వాదించేవారు ఉన్నట్టే దానివల్ల కష్టాలే తప్ప సుఖాలేదీ అని వాదించేవారూ ఉన్నారు. అయితే ఇదంతా ప్రేమ అనే వృత్తానికి వెలుపల ఉన్నవారికి సంబంధించింది. తొలిసారిగా ప్రేమభావం మదిలో ప్రవేశించి ప్రేమ అనే వృత్తంలోకి అడుగుపెట్టినపుడు ఆ మనిషి మనసులో పుట్టే ఆలోచనలు ఎదుటివారికి అర్థం కావడం కొంచెం కష్టమే.

ప్రేమ అనే భావం మనసులో ప్రవేశించాక ఆ మనిషి చాలాకాలం పాటు భౌతిక సమాజానికి కాస్త దూరంగానే బ్రతికేస్తాడు. తనలోని ప్రేమభావం, ఆ ప్రేమను మరింత బలీయం చేసుకోవడానికి తానేమీ చేయాలి, తన ప్రేయసి లేదా ప్రియుడ్ని ఎలా సంతృప్తి పరచాలి... ఇలా సాగుతుంటాయి ఆ మనిషి యొక్క ఆలోచనలు.
  ప్రేమ గురించి గంటలు గంటలు ఉపన్యాసాలు దంచేసేవారు సైతం తమ ప్రేమ విషయాన్ని వెల్లడించాలంటే మాటలేరానట్టు తడబడిపోతుంటారు.      


అందుకే ప్రేమలో పడ్డవారిలో అప్పటివరకు ఉన్న ప్రవర్తనకు, ఆ తర్వాత ప్రవర్తనకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం కన్పిస్తుంది. తనలోకి ప్రవేశించిన ప్రేమ మైకంలో మునిగిపోయి ఆ ప్రేమలోకంలో విహరించే సదరు వ్యక్తి తన చుట్టూ ఉన్న వారి సంగతి సైతం మర్చిపోతుంటాడు. ఈ పరిస్థితిలో అతన్ని కదిలిస్తే ప్రేమ గురించి అతను చెప్పే భావాలను గ్రంధస్తమే చెయ్యొచ్చు.

అంత తీవ్రంగా ఉంటుంది మనిషిలోని ప్రేమభావం. అదేసమయంలో ఒక వ్యక్తికి సంబంధించిన ప్రేమ భావానికి ఎదుటివారినుంచి కూడా అంగీకారం లభిస్తే ఇక ఆ వ్యక్తి ఆనందానికి హద్దే ఉండదు. నిరంతరం అదే ధ్యాసలో, అదే తలపులతో బ్రతికేస్తుంటాడు. ఇంతలా ఓ మనిషిని ప్రభావితం చేసే ప్రేమభావం ప్రేమించిన వారి సన్నిధిలో మాత్రం మౌనానికే పరిమితమౌతుంది.

అందుకే శతకోటి భావాలతో ప్రేయసి వద్దకు చేరిన ప్రియుడు ఆమె సన్నిధిలో మూగవాడైపోతుంటాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ చెప్పడానికే పదాలు వెతుక్కోవాల్సిన పరిస్థితిలో ఇక హృదయంలో వెల్లువెత్తుతున్న తలపుల్ని ఆమె వద్ద ఎలా వివరించగలడు. అందుకే ప్రేమ మైకం కమ్మేసిన వేళ మనసు మాత్రం మౌనానికే పరిమితమౌతుంది.

ప్రేమలో పడ్డ మనిషి భౌతికంగా భావావేశానికి గురవుతుంటే వారి మనసు మాత్రం ఎందుకు మౌనానికి పరిమితమవుతుంది అంటే... అదేమరి ప్రేమ గొప్పతనమంటే. ప్రేమ గురించి గంటలు గంటలు ఉపన్యాసాలు దంచేసేవారు సైతం తమ ప్రేమ విషయాన్ని వెల్లడించాలంటే మాటలేరానట్టు తడబడిపోతుంటారు.

ప్రేమభావాన్ని తెలపాల్సిన హృదయం మౌనాన్ని ఆశ్రయించిన తర్వాత ఇక వారు ఎలా మాట్లాడగలరు. ప్రేమభావానికి మెదడు బీజాలు వేసినా దాన్ని పెంచి పోషించేది మనసే. అయితే ఆ ప్రేమభావాన్ని తెలపాలంటే మాత్రం ఎందుకే చిత్రంగా మనసు మూగదైపోతుంది.

కానీ ఆ మనసు సైతం కొన్నాళ్లకు మాటలు నేరుస్తుంది. ఎప్పుడంటారా మనం మనసు పడ్డవారు మన ప్రేమభావాన్ని అర్థం చేసుకుని మనసు తంత్రుల్ని శృతి చేసినవేళ మౌనరాగాన్ని విడిచిపెట్టే మన మనసు వసంతం వేళ కోయిలలా కొత్త సంగీతాన్ని వినిపిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu