ప్రతివారి మదిలోనూ ఎప్పుడో ఒకప్పుడు ప్రేమ జనించి తీరుతుంది. అంతమాత్రానా అందరూ ప్రేమికులైపోరు. వారంతా ప్రేమలో విజయం సాధించనూలేరు. ఎందుకంటే ప్రేమను పొందాలంటే నిరీక్షణ అనే పెట్టుబడి పెట్టి తీరాల్సిందే. నిరీక్షించలేని వారు ప్రేమను అంత సులువుగా సొంతం చేసుకోలేరు. నిరీక్షణ అనే సాగరాన్ని దాటిన వారు మాత్రమే ప్రేమ దీవిని చేరుకోగలరు. నిరీక్షణను జయించి ప్రేమ దీవిని ఒక్కసారి చేరుకోగల్గితే ఇక వారి జీవితమంతా నిత్య ఆనందమే. ఎదుటివారిని చూసిన వెంటనే మనసులో ప్రేమ భావం పుట్టడం కొత్తేమీ కాదు. ఎందుకంటే తమకు కాబోయే భాగస్వామి ఎలా ఉండాలి అనే విషయంలో ప్రతివారికీ కొన్ని ఆలోచనలు, అభిప్రాయాలు, ఊహలు ఉంటాయి. అందులో ఏ ఒక్క అంశం కలిగిన వారు మన కళ్లలో పడ్డా మన హృదయం స్పందిస్తుంది. |
హృదయాన్ని స్పందింపజేసిన వారినంతా మనం ప్రేమిస్తున్నామేమో అనుకోవడం పొరబాటే అవుతుంది |
|
|
ఆడవారైనా, మగవారైనా ఈ సూత్రం వర్తిస్తుంది. అయితే హృదయంలో కలిగే ప్రతి స్పందన ప్రేమకు దారి తీయాలని లేదు. కాబట్టి హృదయాన్ని స్పందింపజేసిన వారినంతా మనం ప్రేమిస్తున్నామేమో అనుకోవడం పొరబాటే అవుతుంది. ఎందుకంటే కొందర్ని తొలిసారి చూచినపుడు ఎలాంటి స్పందన కలగకపోవచ్చు. వారితో సానిహిత్యం పెరిగే కొద్దీ మనసులో వారంటే ఉన్న భావం ప్రేమగా రూపుదిద్దుకోవచ్చు.
అలాగే కొందర్ని చూచిన తొలిచూపులోనే మన మనసు లయ తప్పవచ్చు. ఈ రెండింటిలో ఏ రకంగా హృదయం స్పందించినా మొదట ఆ స్పందన తీవ్రత ఎంత అన్న విషయాన్ని మనం అంచనా వేసి తీరాలి. అది మనసులోంచి పుట్టిన స్పందనా లేక మెదడులోంచి పుట్టినా స్పందనా అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా అంచనా వేయాలి.
అలా అంచనా వేస్తున్న సందర్భంలో జీవితాంతం ఎదుటివారి తోడు అవసరం అని మన హృదయం చెప్పిందంటే మరిక దేని గురించి ఆలోచించకుండా కార్యరంగంలోకి దూకేయవచ్చు. అయితే ఇలా దూకిన మీదట ఎదుటివారిని మనవైపుకు ఆకర్షించి వారిలో సైతం ప్రేమను పుట్టించి ఇరువురు కలిసి జీవనపయనంలోకి అడుగుపెట్టాలంటే మాత్రం ప్రారంభంలో చెప్పినట్టు తప్పకుండా నిరీక్షించాల్సి ఉంటుంది.
సినిమాల్లో చూపించినట్టు అమ్మాయి నచ్చగానే వెళ్లి ఐలవ్య్యూ చెప్పేసి అటుపై ఓ రెండు సీన్లలో అదీ ఇదీ చేసేసి మూడో సీన్ నుంచి చెట్టాపట్టాలేసుకుని తిరగాలంటే నిజజీవితంలో అస్సలు కుదరకపోవచ్చు. ఒకవేళ కుదిరినా సినిమా ప్రేమలాగానే మన ప్రేమ కూడా మూనాళ్ల ముచ్చటగానే మిగిలిపోవచ్చు. అందుకే కాస్త ఆలస్యమైనా సరే ఇద్దరిలోనూ ప్రేమ భావన ఒకేతీరుగా స్పందన కల్గించేవరకు నిరీక్షించ గల్గితేనే వారి ప్రేమ కలకాలం నిలిచి ఉంటుంది. నిరీక్షించడం అంటే ఏమిటి అన్న విషయంలోనూ సదేహం కల్గవచ్చు. నువ్వు నాకు నచ్చావు అని ఎదుటివారికి చెప్పినపుడు వారిలోనూ దాదాపు అలాంటి భావనే కలిగి త్వరలోనే వారు మనకు ఐలవ్యూ అని చెప్పేస్తే ఇక దేని గురించి నిరీక్షించాలి. |
ప్రేమకు నిరీక్షణే పెద్ద పెట్టుబడి. ఆ పెట్టుబడి పెడితే మీ ప్రేమ మీకు ఆనందాల లాభాన్ని తెచ్చిపెడుతుంది |
|
|
ఇక్కడ నిరీక్షించడం అంటే ఎదుటివారి నుంచి ఐలవ్యూ అనే మాట కోసం ఎదురు చూడడమే కాదు. ఐలవ్యూ అన్న మాట ఎదుటివారినుంచి వినబడ్డ తర్వాత కూడా కొన్ని విషయాల్లో నిరీక్షణ అవసరం. ఇద్దరిలోనూ పుట్టిన ప్రేమావేశం నిజమైనదేనా, అది కలకాలం ఇలాగే ఉంటుందా అన్న విషయాలు స్వయంగా అనుభవానికి రావాలంటే ప్రేమికులు నిరీక్షించి తీరాల్సిందే.
అలాగే ప్రేమించుకుంటున్నాం అన్న పేరుతో చెట్టూ పుట్టా పట్టుకు తిరిగేసి ఆ తర్వాత చేసిన తప్పులు తలచుకుని చితించడం కంటే మనలోని ప్రేమ ఎంత మేరకు బలమైనది అని తెలిసేవరకు ప్రేమికులిద్దరూ సమాజ కట్టుబాట్లు మేరకు కొంతకాలం నిరీక్షించి తీరాలి. ఇన్ని రకాలుగా నిరీక్షించ గల్గితేనే నిజమైన ప్రేమ మనకు సొంతమవుతుంది. అందుకే ప్రేమకు నిరీక్షణే పెద్ద పెట్టుబడి. ఆ పెట్టుబడి పెడితే మీ ప్రేమ మీకు ఆనందాల లాభాన్ని తెచ్చిపెడుతుంది.