2016లో టాలీవుడ్ టాప్ బిచ్చగాడు.. నాగార్జున, ఎన్టీఆర్, బన్నీలదే హవా.. 2017లో మాత్రం ఆ మూడు సినిమాలు?
2016లో తెలుగు చిత్రసీమ అరకొర ఫలితాలను మాత్రమే సాధించగలిగింది. కానీ కొత్త రకమైన కథలు వచ్చాయి. తద్వారా ప్రేక్షకుల అభిరుచి మారిందనే విషయం అవగతం చేసుకోవచ్చు. ఈ ఏడాది సక్సెస్ సినిమాల సంఖ్య తక్కువగా ఉన్నప్ప
2016లో తెలుగు చిత్రసీమ అరకొర ఫలితాలను మాత్రమే సాధించగలిగింది. కానీ కొత్త రకమైన కథలు వచ్చాయి. తద్వారా ప్రేక్షకుల అభిరుచి మారిందనే విషయం అవగతం చేసుకోవచ్చు. ఈ ఏడాది సక్సెస్ సినిమాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. చిన్నాపెద్దా తేడా లేకుండా మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాల్లో కొత్తదనంతో పాటు కథాబలం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక స్టార్ సినిమాలకు విజయావకాశాలు మెండుగా లభించాయి. 2015లో బాహుబలి, శ్రీమంతుడు కలెక్షన్స్ సాధించగా, 2016 సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజైనాయి.
నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా', బాలకృష్ణ 'డిక్టేటర్', ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో', శర్వానంద్ 'ఎక్స్‌ప్రెస్ రాజా' విడుదలయ్యాయి. ఆ చిత్రాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. భిన్నమైన కథలతో తెరకెక్కిన ఈ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. జనవరి 1నే విడుదలైన రామ్ 'నేను శైలజ' కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకొంది.
రామ్ గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్ సినిమాకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. అయితే స్టార్ హీరో పవన్‌కల్యాణ్ 'సర్దార్ గబ్బర్‌సింగ్', మహేష్ 'బ్రహ్మోత్సవం' సినిమాలు మాత్రం ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్నినాయనా, డిక్టేటర్ చిత్రాల తర్వాత వచ్చిన నాగార్జున-కార్తీల 'ఊపిరి', అల్లు అర్జున్ 'సరైనోడు' కూడా బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి.
ఫ్రెంచిలో విజయవంతమైన 'ది ఇన్‌టచబుల్స్'కి రీమేక్‌గా తెరకెక్కిన 'ఊపిరి' ఈ యేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఎన్టీఆర్ ఈ ఏడాది రెండు సినిమాలను రిలీజ్ చేసుకున్నాడు. ఒకటి నాన్నకు ప్రేమతో కాగా రెండోది.. మాస్ కథల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన 'జనతా గ్యారేజ్. ఇక చెర్రీ బ్రూస్ లీ, ధృవ చిత్రాల్లో కనిపించాడు. పక్కా మాస్ కథలతో తెరకెక్కిన వెంకటేష్ 'బాబు బంగారం', రామ్ 'హైపర్'లు వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించుకొన్నాయి.
2016లో యువ హీరోల.. చిన్న సినిమాల సందడి..
నితిన్ అఆ, నాగచైతన్య నటించిన 'ప్రేమమ్' కూడా బాక్సాఫీసుని కళకళలాడించాయి. అలాగే సాయిధరమ్ తేజ్ 'సుప్రీమ్', విష్ణు-రాజ్‌తరుణ్‌ల 'ఈడో రకం ఆడోరకం', నాని నటించిన 'కృష్ణగాడి వీర ప్రేమగాథ', 'జెంటిల్‌మన్', 'మజ్ను' చిత్రాలు కూడా ప్రేక్షకుల్ని అలరించాయి. నిఖిల్ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' కూడా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకొంది.
అలాగే ఎలాంటి అంచనాలు లేకుండా కోటి వ్యయంతోనే తెరకెక్కిన 'క్షణం' రూ: 10కోట్లకిపైగా వసూళ్లు సాధించింది. ఇదే తరహాలో పెళ్ళిచూపులు సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తరుణ్‌భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా నటించిన ఆ చిత్రం ఇప్పుడు పలు భాషల్లో రీమేక్ అవుతోంది. నాగశౌర్య కథానాయకుడిగా నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'కళ్యాణ వైభోగమే', చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మోహన్‌లాల్, గౌతమి ప్రధాన పాత్రలుగా నటించిన 'మనమంతా', పరశురామ్ దర్శకత్వంలో అల్లు శిరీష్ కథానాయకుడిగా నటించిన 'శ్రీరస్తు శుభమస్తు' వంటి సినిమాలు కూడా హిట్ అయ్యాయి.
ఇదే తరహాలో శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నారా రోహిత్ - నాగశౌర్య కథానాయకులుగా నటించిన 'జ్యో అచ్యుతానంద', శివరాజ్ కనుమూరి దర్శకత్వంలో శ్రీనివాస్ రెడ్డి కథానాయకుడిగా నటించిన 'జయమ్ము నిశ్చయమ్మురా', 'మనలో ఒకడు, నందిని నర్సింగ్‌హోమ్ చిత్రాలు కూడా లో బడ్జెట్ మూవీలుగా ప్రేక్షకులను అలరించాయి.
అలాగే ప్రకాష్‌రాజ్ ప్రధానధారిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'మన వూరి రామాయణం'తో పాటు, టెర్రర్, సాహసం శ్వాసగా సాగిపో, గుంటూరు టాకీస్, లచ్చిందేవికి ఓ లెక్కుంది, లజ్జ, స్పీడున్నోడు, మలుపు, తుంటరి, ఒక మనసు, అభినేత్రి, నరుడా డోనరుడా, పిట్టగోడ తదితర చిత్రాలు కూడా మంచి సినిమాలైనా కలెక్షన్లు మాత్రం అంతంతమాత్రంగానే నమోదు చేసుకున్నాడు. ఇక అనువాద చిత్రంగా విడుదలైన బిచ్చగాడు సినిమా టాలీవుడ్ చరిత్రలో రికార్డుల పంట పండించింది.
ఈ క్రమంలో విజయ్ ఆంటోనీ బిచ్చగాడు రూ.20 కోట్ల వసూళ్లతో టాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసింది. అలాగే అనువాద చిత్రాలైన రజనీకాంత్ 'కబాలి'కి కూడా భారీ వసూళ్లను రాబట్టుకుంది. సూర్య '24', కార్తీ 'కాష్మోరా'లు తమిళంలోలాగే తెలుగులోనూ ఆదరణ పొందాయి. విజయ్ పోలీస్, విక్రమ్ ఇంకొక్కడు, ధనుష్ 'నవ మన్మథుడు, రైలు, ధర్మయోగి, విశాల్ కథకళి, రాయుడు, ఒక్కడొచ్చాడు చిత్రాలతో పాటు, జీవా నటించిన రంగం2, విజయ్ ఆంటోనీ బేతాళుడు, శివకార్తికేయన్ 'రెమో' చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. మలయాళం నుంచి మోహన్‌లాల్ చిత్రం 'మన్యంపులి', కన్నడ నుంచి 'నాగభరణం'లాంటి చిత్రాలు కూడా విడుదలయ్యాయి. 'మన్యంపులి'కి మంచి వసూళ్లు దక్కాయి. హాలీవుడ్ నుంచి వచ్చిన 'జంగిల్‌బుక్' తెలుగులో పెద్దయెత్తున వసూళ్లు సొంతం చేసుకొంది.
ఇక డిసెంబర్ చివరి వారంలో విడుదలైన రామ్ గోపాల్ వర్మ వంగవీటి సినిమాకు విమర్శలతో పాటు కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. ఇంకేముంది? 2016 టాలీవుడ్‌కు సో.. సో.. గానే మిగిలిపోయింది. కానీ 2017 మాత్రం టాలీవుడ్ ప్రేక్షకులు పండగ చేసుకునేలా ఉంటుందని సినీ పండితులు అప్పుడే జోస్యం చెప్పేశారు. 2017లో సంక్రాంతికి చిరంజీవి ఖైదీ, బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణితో పాటు ముఖ్యంగా బాహుబలి: ది కన్‌క్లూజన్ కూడా విడుదల కాబోతోంది. 2016లో హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు మూవీస్‌లో సరైనోడు, ఊపిరి, నాన్నకు ప్రేమతో వంటి సినిమాలు నిలిచాయి.