Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యేసు అదృశ్యరూపాన్ని ప్రదర్శించే "రూపాంతరాలయం"

యేసు అదృశ్యరూపాన్ని ప్రదర్శించే
FILE
యేసుప్రభువు నరావతారుడిగా పరలోక మర్మాలను బోధించే కాలంలో పేతురు, యాకోబు, యోహాను అనే శిష్యులను వెంటబెట్టుకుని ఒక ఎత్తైన కొండపైకి తీసుకెళ్లి వారి ఎదుట రూపాంతరం చెందారట. అప్పుడు ఆయన ముఖం సూర్యునివలె ప్రకాశిస్తూ ఉండిందట. ఈ ఘటనను పురస్కరించుకుని కొన్ని సంఘాలకు రూపాంతర సంఘాలనీ, కొన్ని దేవాలయాలకు రూపాంతర చర్చిలను పేర్లు పెట్టుకుంటుంటారు. అలాంటి వాటిలో భీమవరంలోని రూపాంతర దేవాలయం ప్రసిద్ధి చెందింది.

అన్నిచోట్లా క్రైస్తవ ఆలయాలన్నీ ఒకలాగా ఉంటే, భీమవరంలోని దేవాలయానికి మాత్రం రూపాంతర ఆలయం అని పేరు పెట్టడంతో ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రూపాంతరం అంటే తన అదృశ్యరూపాన్ని ప్రదర్శించటం అని అర్థం. యేసు ప్రభువు తన అదృశ్యరూపాన్ని ప్రదర్శించాడనేందుకు చిహ్నంగా రూపుదిద్దుకున్నదే ఈ రూపాంతర ఆలయం.

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో నెలవైన ఈ రూపాంతర ఆలయాన్ని కుల, మతాలకు అతీతంగా ఎంతోమంది భక్తులు ప్రతిరోజూ సందర్శిస్తుంటారు. ఉదయంపూట కళాశాలలకు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు.. ఇలా అన్నిరంగాల ప్రజలు ప్రతిరోజూ ఈ రూపాంతర ఆలయంలో యేసుప్రభువును ప్రార్థించుకుని వెళ్తుంటారు.

అమెరికాలోని రూపాంతార దేవాలయంలో ఫాస్టరుగా పనిచేసిన డాక్టర్ స్మక్కర్ దొర జ్ఞాపకార్థం ఈ చర్చికి రూపాంతర ఆలయం అని నామకరణం చేశారు. లూథరన్ సంఘంలో ఈ చర్చికి చాలా ప్రత్యేకత కలదు. క్రిస్మస్ పండుగను అత్యంత ఘనంగా జరుపబడే ఈ ఆలయానికి పరిసర గ్రామాల నుంచి అన్ని మతాల ప్రజలు దర్శించుకుంటారు.

webdunia
FILE
రూపాంతర ఆలయం చరిత్రను చూస్తే.. ఆంధ్రాలో లూథరన్ సంఘాన్ని ఫాదర్ హయ్యర్ స్థాపించారు. ఆ తరువాత 1840లో భారతదేశ విదేశీ మిషనరీగా వచ్చిన డాక్టర్ హాన్స్‌క్రిస్టియన్ స్మిత్ పశ్చిమ గోదావరిలోనూ, డాక్టర్ పాల్‌సన్ తూర్పుగోదావరి జిల్లాల్లోనూ అభివృద్ధి చేశారు.

ఫారిన్ బోర్డులో జనరల్ సెక్రటరీగా ఉన్న డాక్టర్ స్మక్కార్ తాను చనిపోయేందుకు ముందు తన యావదాస్థిని అమ్మి, ఆ సొమ్మును.. తాను విరాళాలుగా సేకరించిన మరికొంత సొమ్మును ఈ రూపాంతర ఆలయ నిర్మాణం కోసం స్మిత్ దొరకు పంపించినట్లు తెలుస్తోంది. ఈ సొమ్ముతో నిర్మించిన ఈ ఆలయానికి స్మక్కార్ దొర అమెరికాలో పనిచేసిన రూపాంతర చర్చి పేరుతోనే నామకరణ చేశారు.

1894 ఫిబ్రవరి 14వ తేదీన స్మిత్ దొరచే రూపాంతర చర్చికి పునాది వేశారు. ఈ చర్చి నిర్మాణంలో పెద్ద పెద్ద రాళ్లు, కలప వాడారు. అప్పటికి సిమెంట్ వాడకంలో లేనందున రాతి సున్నాన్ని పునాది గోడలకు ఉపయోగించారు. కాగా.. దేవాలయ గోడలకు ఉపయోగించి రాతి సున్నం పటుత్వం తగ్గిపోవటంతో 1980లో బిరుదుగడ్డ సుందరరావు అధ్యక్షతన విరాళాలను సేకరించి 1993లో మరమ్మత్తులు చేయించారు.

రూపాంతర ఆలయంలో వారానికి మూడురోజులపాటు ఆరాధనా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధనా కార్యక్రమం, సాయంత్రం ఆంగ్లంలో ఆరాధన జరుగుతుంది. బుధ, శుక్రవారాలలో యూత్, మహిళా కూటాలు జరుగుతాయి. ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి 10.30 గంటల వరకూ తెరిచే ఉంటుంది. భీమవరం పట్టణం నడిబొడ్డున ఉన్న రూపాంతర ఆలయం అన్ని మతాల వారినీ ఆకర్షిస్తోంది. అంతేగాకుండా, యేసుప్రభువు కృపా కటాక్షలను అందరికీ అందిస్తూ, ఆశీర్వదిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu