ముగ్ధ మనోహర బాలగోపాలుడి ఆలయం "గురువాయూర్"
నాలుగు చేతులలో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి.. తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడి ఆలయం "గురువాయూర్". కేరళలోని త్రిసూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని కన్నన్, ఉన్నికృష్ణన్ (బాలకృష్ణుడు), ఉనికన్నన్, గురువాయురప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారు.కేరళ సంప్రదాయ పద్ధతిలో నిర్మించిన గురువాయూర్ ఆలయం అతి ప్రాచీనమైన చరిత్ర కలిగినది. దేశం నలుమూలలనుంచి ఈ ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. ఆది శంకరాచార్యుడు ఏర్పాటు చేసిన పూజా విధానాన్ని ఇప్పటికీ ఆచరించే ఈ ఆలయంలో నంబూదిరి వంశపారంపర్యంగా పూజాదికాలు జరుగుతుంటాయి.గురువాయూర్ ఆలయంలో ప్రతి ఏడాది ఆఖరున 41 రోజులపాటు మండల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. రాత్రి సేవలో భాగంగా ఏనుగు అంబారీపై కృష్ణ విగ్రహాన్ని ఆలయంచుట్టూ ఊరేగింపుగా తిప్పే ఉత్సవం కన్నులపండువగా సాగుతుంది. ఈ సమయంలో స్వామివారిని దర్శించుకునే భక్తులు తమ కోర్కెల సాధనకోసం తులాభారం, అన్నదానం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఆలయ చరిత్రను చూస్తే.. స్వామివారి విగ్రహాన్ని పాతాళం జనశిలతో నిర్మించినట్లు పూర్వీకులు చెబుతుంటారు. కృష్ణావతారం సమాప్తి అయ్యే కాలంలో శ్రీకృష్ణుడు తన సహచరుడైన ఉద్ధవునికి కృష్ణ విగ్రహాన్ని ఇచ్చి లోక కళ్యాణం కోసం ఈ విగ్రహాన్ని ఎక్కడైనా స్థాపించమని ఆజ్ఞాపించాడు. జల ప్రళయం అనంతరం ఆ విగ్రహాన్ని వాయువు కాపాడి, దేవగురువు బృహస్పతికి అప్పగించాడు.
దేవ గురువైన బృహస్పతికి వాయువు సహాయంతో ఏర్పడిన ఈ ప్రాంతాన్ని గురువాయూర్‌గా, స్వామిని గురువాయురప్పగా కొలుస్తుంటారు. విష్ణువు అవతారమైన ఈ బాల గోపాలుడికి అర్చకులు శంఖాభిషేకం, అర్చనలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తుంటారు.వివిధ రకాల పుష్పాలతో, సకలాభరణాలతో స్వామిని అందంగా అలంకరిస్తారు. ఇదే రూపంలోనే దేవకీ వసుదేవులకు, కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు దర్శనమిచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. గురువాయూర్ ఆలయంలో ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రముఖ సంగీత విద్వాంసులు చెంబై వైద్యనాథ భాగవతార్ పేరుమీద నిర్వహిస్తారు.అలాగే ఫిబ్రవరి, మార్చి నెలల్లో పది రోజులపాటు అష్టమి రోహిణీ ఉత్సవాలను జరుపుతారు. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఓణం పండుగను ఈ ఆలయంలో కేరళవాసులు ఘనంగా జరుపుకుంటారు. అలాగే కృష్ణుడి ఆలయానికి దగ్గర్లోనే శ్రీ ప్రార్థసారథి ఆలయం, వమ్మియూర్ శివాలయం కూడా దర్శనీయ క్షేత్రాలే. ఈ ఆలయాల్లో కూడా ఎల్లప్పుడూ విశేష పూజలు జరుగుతుంటాయి. గురువాయూర్ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే.. త్రిసూర్ రైల్వేస్టేషన్ నుంచి 30 కి.మీ ప్రయాణిస్తే, గురువాయూర్ చేరవచ్చు. కేరళలోని అన్ని ప్రధాన కేంద్రాల నుంచి కూడా ఇక్కడకు బస్సు సౌకర్యం ఉంది. కొచ్చివిమానాశ్రయం (75 కి.మీ) దూరంలో ఉంది. శ్రీకృష్ణుని సుందర దరహాస ముగ్ధ మనోహర మూర్తిని చూసినంతనే తనువూ, మనసూ పావనమై సర్వాభీష్టాలూ నెరవేరుతాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.