విభిన్నమైన ఆలయాలకు భారతదేశం పెట్టింది పేరు. ఇక్కడ ఉన్నన్ని పురాతన దేవాలయాలు మరెక్కడా ఉండవు. సాధారణంగా ఆలయాలన్నీ ప్రళయం ముగిసిన తర్వాత ఆవిర్భవించాయని చెబుతారు, కానీ కుంభకోణంలో ఉన్న ఈ ఆలయం ప్రళయం సంభవించడానికి ముందే వెలసింది.
ఈ దేవాలయంలో ఉన్న మూలవిరాట్టును సందర్శిస్తే వివాహ సమస్యలు, ఇంటికి సంబంధించిన కేసులు త్వరగా పరిష్కారమవుతాయనే నమ్మకం ఉంది. అందుకే దేశ విదేశాల నుండి ఈ దేవాలయాన్ని సందర్శించడానికి అనేకమంది వస్తుంటారు.
ప్రళయం తర్వాత సృష్టి ఆగిపోకూడదనే ఉద్దేశ్యంతో బ్రహ్మదేవుడు జీవబీజాలను ఒక కుంభంలో పెట్టి దానిని భూమి పైకి వదిలాడు. ఆ కుంభం ముందుగా భూమిని తాకిన ప్రదేశమే కుంభకోణం పేరుతో ప్రసిద్ధి చెందింది. ప్రళయం ముగిసిన తర్వాత పరమశివుడు ఆ కుంభాన్ని బాణంతో కొట్టగా పగిలిపోయి అందులో ఉన్న జీవ బీజాలతో పాటు ఆకులు, తీగలు చుట్టుప్రక్కల చెల్లాచెదురుగా పడి వివిధ ఆలయాలుగా వెలిశాయి. అయితే వీటన్నింటి కంటే ముందే అక్కడ ఆది వరాహ స్వామి దేవాలయం ఉంది.
పురాణాల ప్రకారం హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూదేవిని చెరపట్టి పాతాళానికి తీసుకుపోగా ఆమె ప్రార్థనను విన్న శ్రీమహావిష్ణువు వరాహ రూపంలో అక్కడికి వెళ్లి, హిరణ్యాక్షుడిని సంహరించి నీటి మీదుగా భూదేవిని భూమి పైకి తీసుకువస్తాడు. ఆ సమయంలో మునివర్యుల ప్రార్థన మేరకు భూదేవి సమేతంగా కుంభకోణంలో ఉండిపోతాడు. ఇది ఈ దేవాలయం యొక్క స్థల పురాణం. గర్భగుడిలో స్వామి కూర్చొన్న భంగిమలో, ఎడమకాలిపై భూదేవిని కూర్చుండబెట్టుకుని ఉంటాడు.
భూదేవి స్వామి వైపు చూసి స్మరిస్తున్నట్లుగా తన ఎడమకాలు ఆదిశేషునిపై పెట్టుకుని ఉంటుంది. వరాహ సాలగ్రామం, శంఖు చక్రాలతో మూల విరాట్టుకు ముందు ఉంటుంది. ఇక్కడ ఉత్సవ విగ్రహం కూడా వరాహ రూపంలో ఉంటుంది. ఇక ఈ దేవాలయంలో నాగేంద్రుడు తులసి కోట కింద ప్రతిష్టించబడినందు వలన దీనికి చాలా విశిష్టత ఉందని, ఇక్కడ దీపారాధన చేస్తే రాహుకేతు దోషాలు తొలగిపోతాయనే నమ్మకం కూడా ఉంది.
వరాహ స్వామి భూదేవిని పాతాళంలో నుండి రక్షించి తీసుకొచ్చారు కనుక భూమిలో పెరిగే మొక్కల వేర్లు తీసుకుని, చూర్ణం చేసి అందులో బెల్లం, నెయ్యి కలిపి ఆ మిశ్రమాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి, దానినే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ విధానం తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. 12 ఏళ్లకొకసారి కుంభకోణంలో జరిగే మహామహం ఉత్సవాలతో ఐదు వైష్ణవ దేవాలయాలకు సంబంధం ఉంది, వాటిలో ఈ దేవాలయం కూడా ఉండగా సారంగపాణి, చక్రపాణి, వరదరాజస్వామి, రాజగోపాలస్వామి దేవాలయం మిగిలిన నాలుగు దేవాలయాలు.
మహామహం సమయంలో ఈ ఐదు దేవాలయాలలోని ఉత్సవమూర్తులను పుష్కరిణి వరకూ ఊరేగింపుగా తీసుకొస్తారు. చైత్రమాసంలో 7వ దినాన ఈ దేవాలయంలో ఉన్న వరాహ స్వామిని దర్శించుకోవడానికి సారంగపాణి, చక్రపాణి వస్తారని ప్రజలకు గాఢంగా నమ్ముతున్నందున ఆ రోజున పెద్ద ఉత్సవం జరుగుతుంది.
భూదేవిని రక్షించిన మహావిష్ణువు భూమి పైకి వచ్చాక ఇక్కడ వెలిశారు కాబట్టి పెళ్లికాని వ్యక్తులు ఇక్కడ పూజలు చేస్తే పెళ్లవుతుందని చెప్తారు. అంతేకాకుండా ఇక్కడ స్వామివారిని వేడుకుంటే భూమి, ఇంటికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయని కూడా ప్రజల నమ్మకం.