Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిద్ధార్థుడి తపోస్థలి "బుద్ధగయ"

సిద్ధార్థుడి తపోస్థలి
బౌద్ధులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం "బుద్ధగయ". గౌతముడికి జ్ఞానోదయమైన ప్రాంతం కావడంతో "బోధ్‌గయ"గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. బోధ్‌గయే క్రమంగా బుద్ధగయగా వాడుకలోకి వచ్చింది. ఈ ప్రదేశం "నిరంజన" అనే నదీ తీరంలో ఉంది. ప్రపంచానికి ఓ గొప్ప అహింసామూర్తిని ప్రసాదించిన ఈ బుద్ధగయను ఒకానొక కాలంలో "ఉరువేలా" అని పిలిచేవారట.

బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా దగ్గరలో ఉండే ఈ ప్రాంతంలో... సుమారు 2,500 సంవత్సరాల క్రితం దట్టమైన అరణ్యం ఉండేదనీ, ఈ అరణ్యంలోనే కపిలవస్తు రాజకుమారుడైన సిద్ధార్థుడు సంచరిస్తుండేవాడని ప్రజల నమ్మకం. బౌధ్ధులకు అతిముఖ్యమైన యాత్రా స్థలాలలో ఒకటైన ఈ బుద్ధగయలో అడుగుపెట్టగానే ఎవరికయినా ఓ పవిత్ స్థలంలోకి అడుగుపెట్టామన్న భావన కలుగకమానదు.

బౌద్ధమతాన్ని అనుసరించే చైనా, టిబెట్, భూటాన్, జపాన్, థాయిలాండ్ తదితర దేశాలు నిర్మించిన బౌద్ధాలయాలు ఈ బుద్ధగయలో అడుగడుగునా మనకు స్వాగతం పలుకుతాయి. ఇక్కడి బజార్లలో ఆయా దేశాలకు చెందిన బౌద్ధ బిక్షువులు గుంపులు గుంపులుగా సంచరిస్తూ మనకు కనిపిస్తారు.

ఇక ఆలయం వివరాల్లోకి వస్తే... 48 అడుగుల చదరంతో, 170 అడుగుల ఎత్తుతో కట్టబడి ఉంది. గర్భగుడివద్ద స్థూపాకారంగా ఉండి, చివరన కలశంలాగా గోళాకారంలో ఉంటుంది. అంతా రాతి కట్టడమైన ఈ ఆలయంపైకి వెళ్ళేందుకు నాలుగువైపుల నుండి మెట్లున్నాయి. మెట్లు ఎక్కుతుండగా కనిపించేవిధంగా బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్టించారు. పైన నాలుగు మూలలా చిన్న గోపురాలు, వాటిపై మళ్లీ బుద్ధ విగ్రహాలను అమర్చి ఉంటాయి.

మందిరం చుట్టూ ఉండే చెట్ల పచ్చదనం వల్ల వాతావరణం అందంగా, ఆహ్లాదంగా ఉండి యాత్రికులకు మనోరంజకంగా అనిపిస్తుంది. తూర్పుదిశగా ఉండే ఈ మందిరంలో పడమర గోడకు ఆనుకొని, తూర్పుముఖంగా నిశ్చల సమాధిలో ఆసీనుడైన బుద్ధ భగవానుడి విగ్రహం "కోరికలే దుఃఖాలన్నింటికీ మూలకారణం" అని చెబుతున్నట్లు ఉంటుంది.

బుద్ధ భగవానుడి విగ్రహమంతా బంగారంతో తాపడం చేయబడి ఉంటుంది. మందిరం ఆవరణ అంతా చిన్నా, పెద్దా స్థూపాలతో నిండి ఉండగా, వాటిల్లో కొన్ని అద్భుతమైన శిల్పసంపదతో అలరారుతుంటాయి. ఈ మందిరాన్ని హవిష్ణుకుడనే రాజు నిర్మించాడని కొంతమంది, కాదు అశోక చక్రవర్తి నిర్మించాడని మరికొంతమంది చరిత్రకారుల వాదన.

ఇక మందిరం వెనుకభాగంలో బోధివృక్షం ఉంది. ఈ చెట్టు క్రిందనే బుద్ధుడికి జ్ఞానోదయం కలిగిందని, ఆ వృక్షశాఖనే అశోక చక్రవర్తి కుమార్తె సంఘమిత్ర శ్రీలంకలోని అనురాధాపురంలో నాటిందని చెబుతుంటారు. బుద్ధుడి తపోభూమి అయిన బోధివృక్ష మూలస్థానాన్ని "వజ్రాసనం" అంటారు. ఈ వృక్షానికి రంగు, రంగుల గుడ్డలు కట్టి ఉంటాయి. ఇలా గుడ్డలు కడితే భక్తుల కోరికలు నెరవేరుతాయనే విశ్వాసం ప్రచారంలో ఉంది.

ఇంకా ఈ ఆలయం ప్రాంగణంలో.. బుద్ధుడి పాద స్పర్శతో పునీతమైన "చంక్రమణ" అనే ప్రదేశం, "అనిమేషలోచన" అనే స్థూపం, "రత్నఘర్ చైత్యం" అనే ఆలయం, "మచిలింద సరస్సు", బుద్ధుడు ధ్యానముద్రలో ఉండే అతిపెద్ద భారీ విగ్రహం... తదితరాలన్నీ చూడదగ్గవి. బీహార్ రాజధాని పాట్నా నుంచి 178 కిలోమీటర్ల దూరంలో ఈ బుద్ధగయకు చేరుకోవాలంటే... రైళ్లు, బస్సు సర్వీసులు ఎల్లప్పుడూ పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu