Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సకల సౌభాగ్యాలనిచ్చే "అయ్యనారప్పన్"

సకల సౌభాగ్యాలనిచ్చే
FILE
"తాను ఎవరి తలపై చేయి పెడితే వారు భస్మం అయిపోవాలని" పరమశివుడి నుంచి వరం పొందుతాడు పద్మాసురుడు అనే రాక్షసుడు. తాను పొందిన ఆ వరాన్ని పరీక్షించేందుకు అతడు శివుడి తలపై చేయి పెట్టబోయి, చివరికి తన తలపైనే పెట్టుకుని భస్మం అయిపోతాడు. ఈ అంశాలను సూచించే ప్రాంతమే కీళ్ పుత్తుపట్టు. విల్లుపురం జిల్లా దిండివనం సర్కిల్‌లో ఉన్న ఈ ప్రాంతంలో శివుడు, మహా విష్ణువు ఇద్దరి అంశలతో వెలసిన "అయ్యనారప్పన్" భక్తుల నీరాజనాలను అందుకుంటున్నాడు.

"మంజనీశ్వర అయ్యనార్" అనే పేరుతో కూడా పూజలందుకుంటున్న అయ్యనారప్పన్.. కోర్కె ఏదైనా వెంటనే తీర్చే దైవంగా కొలువబడుతున్నాడు. ఈయనను దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయనీ, దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. చేతబడి, దిష్టి, మోసపోవడం, హింసకు గురికావడం తదితరాల నుంచి బయటపడేందుకు కూడా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

ఈ ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా వినాయకుడిని దర్నించుకుని... ఆ తరువాతే అయ్యనారప్పన్‌ను దర్శించుకుంటుంటారు. ఇలా చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి చుట్టూ 40 ఎకరాల విస్తీర్ణంలో అరుదైన మూలికల చెట్లు ఉన్నాయి. వాటి గాలి సోకితేనే సకల రోగాలు నయమవుతాయని కూడా భక్తులు చెబుతుంటారు.

మధుమేహ వ్యాధి నివారణలో వాడే సిరుకురంజన్ అనే మూలికతో పాటు పలు అరుదైన మూలికా చెట్లు ఈ ఆలయంలోని ఉద్యానవనంలో ఉన్నాయి. అంతేగాకుండా ఆలయం చుట్టూ ఉండే పచ్చని అడవుల సౌందర్యం, ఆహ్లాదకరమైన గాలి మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అటు భక్తికి, ఇటు ప్రకృతి సౌందర్యానికి సాక్షీభూతమై ఎల్లప్పుడూ భక్తులతో కళకళలాడుతూ ఉంటుందీ క్షేత్రం.

ఆలయ చరిత్రను చూస్తే.. పద్మాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అన్ని లోకాలు తన ఆదేశాలకు కట్టుబడి ఉండాలని, తనకు మరణమే ఉండకూడదని, తాను ఎవరి తలపై చేయి పెడితే వారు భస్మం కావాలనే కోరికలతో... కఠోరంగా తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతడు కోరిన వరాలన్నీ ఇచ్చేస్తాడు.

అయితే అందరికీ తానే అధిపతినన్న అహంకారం తలకెక్కిన పద్మాసురుడు.. ఇంతకీ శివుడు ఇచ్చిన వరం నిజమో, కాదో తెలుసుకోవాలని శివుడి తలపైనే చెయ్యి పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. అయితే దీన్ని గ్రహించిన శివుడు పుత్తుపట్టు అడవిలోకి పారిపోయి, అక్కడున్న ఒక చెట్టులోని కాయలోపల దాక్కుంటాడు.

webdunia
FILE
ఇది తెలుసుకున్న పద్మాసురుడు ఒక మేక రూపంలో ఆ చెట్టు కాయను తినేందుకు సిద్ధపడగా... శివుడు మహావిష్ణువును తలచుకుంటాడు. దీంతో మోహిని రూపంలో ప్రత్యక్షమవుతాడు. అతిలోక సౌందర్యవతి అయిన మోహినిని చూడగానే మేక రూపాన్ని వదలిన పద్మాసురుడు అసలు రూపంలోకి వస్తాడు.

అప్పుడు తనని తాకాలని అనుకంటే.. తలస్నానం చేసి వచ్చాకనే తాకాలని నిబంధన పెడుతుంది మోహిని. దాంతో పద్మాసురుడు నీటికోసం వెతుక్కుంటూ పోతాడు. ఎక్కడా నీటిజాడ కనిపించక పోవటంతో నీరసించి వెతుకుతున్న అతడికి ఒకచోట కొద్దిగా నీరు కనిపిస్తుంది. ఆ నీటిని తీసుకుని చేతితో తలపై రాసుకున్న వెంటనే.. శివుడి వరం కారణంగా భస్మమైపోతాడు. అప్పడు చెట్టు కాయనుంచి బయటపడ్డ శివుడు మోహిని అందచందాలకు మైమరచిపోతాడు. అలా శివుడు, మహావిష్ణువు అంశతో "అయ్యనారప్పన్‌"గా అవతారం ఎత్తినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది.

ఆలయ విశిష్టతను చూస్తే.. మూలస్థానం, అర్ధ, మహా మండపాలతో ఈ "అయ్యనారప్పన్" ఆలయాన్ని రూపొందించారు. 1995లో ఆలయ మండపం నిర్మించి.. కుంభాభిషేకం నిర్వహించారు. ఆ తరువాత 2001లో ఐదంచెల గోపురం నిర్మించి, కుంభాభిషేకం జరిపారు. శనీశ్వరుడు, బుధ గ్రహాలకు పదవి ఇవ్వటం వల్ల అయ్యనారప్పన్ అధిపతి అయినట్లు పూర్వీకుల కథనం. అందుకే ఏడేళ్ల శని, అష్టమ శనిలతో బాధపడేవారు శనివారం రోజున అయ్యనారప్పన్‌కు దీపం వెలిగించి మొక్కుకున్నట్లయితే దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

అలాగే బుధ గ్రహం విద్యాభ్యాసానికి దోహదపడుతుంది కాబట్టి... బుధవారం రోజున అయ్యనారప్పన్‌ను మొక్కుకున్నట్లయితే విద్యపై ఆసక్తి కలుగుతుందని నమ్ముతుంటారు. ఇదిలా ఉంటే.. ఈ దేవుడికి కేవలం శైవ పూజలను మాత్రమే నిర్వహిస్తుంటారు. బలిపూజలు ఇక్కడ నిషిద్ధం. అయితే ఆలయానికి బయట ఉండే మలయాళతారుకు మేకలు, కోళ్లను బలి ఇవ్వవచ్చు.

ఈ ఆలయంలోని అయ్యనారప్పన్‌కు ఎదురుగా నందికి బదులుగా ఏనుగు ఉంటుంది. దీన్ని భైరవుడని భక్తులు పిలుస్తుంటారు. ఊర్లో గుర్రంపై, అడవిలో ఏనుగుపై అయ్యనారప్పన్ తిరుగుతూ... భక్తుల సమస్యలను పరిష్కరిస్తూ.. ఎళ్లవేళలా వారిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడని స్థానికులు చెబుతుంటారు.

ఎలా వెళ్లాలంటే... పుదుచ్చేరి నుంచి చెన్నై నగరానికి వెళ్లే మార్గంలోని ఈసీఆర్ రోడ్డు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో "అయ్యనారప్పన్" ఆలయం ఉంది. దిండివనం, చెన్నై, పుదుచ్చేరి నుంచి ఇక్కడి బస్సు సౌకర్యం ఉంది. ఈ ఆలయానికి చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి ఆటోలు, ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu