Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శుక్ర దోష నివారణా క్షేత్రం "తిరునావలీశ్వరాలయం"

శుక్ర దోష నివారణా క్షేత్రం
తిరునావలూరులోని తిరునావలీశ్వర ఆలయం ప్రముఖ శుక్రదోష నివారణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శుక్రుడంతటి వాడికే శాప విమోచనం కలిగించిన క్షేత్రంగా విశ్వసించటంతో ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా అలరారుతోంది. విల్లుపురం జిల్లాలోని తిరునావలూరులో నెలకొన్న ఈ ఆలయానికి సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది.

మొదటి పరాంతక చోళుడి కుమారుడు రాజ ఆదిత్యన్ ఈ తిరునావలీశ్వర ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయంలోని మూల విరాట్టుకు భక్త జనేశ్వరుడు, తిరునావలీశ్వరుడు అనే పేర్లు ఉన్నాయి. తమిళంలో తిరు అనేది తెలుగు శ్రీ అనే పదానికి సమానార్థకం కాగా.. నావల్ అంటే నేరేడు చెట్లు అని అర్థం.

ఈ ఆలయ ప్రాంగణంలో నేరేడు చెట్లు అధికంగా ఉండటంతో ఆ ప్రాంతానికి తిరునావలూరు అనే పేరు వచ్చినట్లు, ఊరి పేరు ప్రకారమే స్వామివారికి తిరునావలీశ్వరుడుగా పిల్చుకుంటున్నట్లు ప్రతీతి. ఆలయ స్థల వృక్షం కూడా నేరేడు చెట్టే కాగా... అమ్మవారిని సుందరనాయకి, మనోన్మణి అనే పేర్లతో భక్తులు పిలుస్తుంటారు.
మూల విరాట్టుపై సూర్య కిరణాలు
  ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో ఆలయ మూల విరాట్టుపై సూర్య కిరణాలు నేరుగా ప్రసరిస్తాయి. ఈ సుందర దృశ్యం చూసేందుకు ఆ రోజు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటుంటారు.      


ఆలయ ప్రాశస్త్యం విషయానికి వస్తే... ఒకానొక సందర్భంలో మునీశ్వరుల శాపానికి గురైన శుక్రుడు తిరునావలీశ్వర ఆలయంలోని స్వామివారిని పూజించి విమోచనం పొందినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే ఈ ఆలయం శుక్రదోష విమోచన క్షేత్రంగా విలసిల్లుతోంది. శుక్ర దోషం ఉన్నవారు ఈ ఆలయానికి అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు.

63 మంది నయనార్లలో ఒకరైన సుందరర్ జన్మస్థలం కూడా తిరునావలూరే కావడంతో, ఆలయం ఎదురుగా ఆయనకు ఒక ప్రత్యేక సన్నిధిని నెలకొల్పారు. అప్పట్లోనే ఈ ఆలయ ప్రాశస్త్యం శ్రీలంక వరకు వ్యాప్తి చెందడంతో, అక్కడి తమిళ రాజులు తిరునావలీశ్వర ఆలయానికి విరాళాలు కూడా అందజేసినట్లు శాసనాలు చెబుతున్నాయి.

ఈ ఆలయంలో మూడుపూటలా నిత్య పూజలను నిర్వహిస్తుంటారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 4 గంటల నుంచి, రాత్రి 9 గంటల వరకు ఆలయం తెరువబడి ఉంటుంది. నెలలో రెండు రోజులు ప్రదోష పూజలు.. మంగళ, శుక్ర వారాలలో అమ్మవారికి విశేష పూజలు.. ఏడాదిలో మహాశివరాత్రి లాంటి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో నవగ్రహ సన్నిధి, భైరవుడు, గురు దక్షిణామూర్తి, నయనార్లు, అమ్మవారి సన్నిధులు వేరువేరుగా ఉన్నాయి.

ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో ఆలయ మూల విరాట్టుపై సూర్య కిరణాలు నేరుగా ప్రసరిస్తాయి. ఈ సుందర దృశ్యం చూసేందుకు ఆ రోజు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటుంటారు. సాధారణంగా ఆలయాల్లో గురు దక్షిణామూర్తి స్వామివారు కూర్చున్న భంగిమలో కనిపిస్తాడు. కానీ ఈ ఆలయంలో మాత్రం నిలబడిన భంగిమలో, వృషభంపై ఓ చేయి వేసి కనిపిస్తూ ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు.

ఎలా వెళ్లాలంటే... తమిళనాడులోని చెన్నై నగరం నుంచి వెళ్లే భక్తులు బన్రుట్టి, విళుపురం నుంచి బస్సు మార్గంలో తిరునావలూరు వెళ్లవచ్చు. చెన్నై-తిరుచ్చి మార్గంలో సుమారు 200 కిలోమీటర్ల దూరంలోను... బన్రుట్టి నుంచి 18 కిలో మీటర్ల దూరంలోను, విళుపురం నుంచి 22 కిలోమీటర్ల దూరంలోను తిరునావలూరు ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu