Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెండో భద్రాద్రి నెల్లిమర్ల "రామతీర్థం"

రెండో భద్రాద్రి నెల్లిమర్ల
శివాలయాలలో శ్రీరామనవమి వేడుకలు, రామాలయాలలో శివరాత్రి వేడుకలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి అరుదైన పూజాదికాలను చూసి తరించాలంటే.. విజయనగరం జిల్లా, రామతీర్థం సీతారామస్వామి దేవస్థానానికి వెళ్లి తీరాల్సిందే..! ఈ ఆలయంలో శ్రీరామనవమిని ఎంత వేడుకగా చేసుకుంటారో, అంతే ఘనంగా శివరాత్రి ఉత్సావాలను కూడా నిర్వహిస్తారు.

భక్తుల విశేష పూజలను అందుకుంటూ రెండో భద్రాదిగా వాసికెక్కిన రామతీర్థం స్థల పురాణం విషయానికి వస్తే... 15వ శతాబ్దంలోనే ఇక్కడ రామతీర్థం ఆలయాన్ని నిర్మించారు. పాండవులు తమ అరణ్యవాసంలో భాగంగా రామతీర్థం చేరుకొని కొన్ని రోజులు ఇక్కడ గడిపినట్లు స్థల పురాణం. దీనికి నిదర్శనంగా భీముని గృహం ఇప్పటికీ అక్కడ ఉంది. రామతీర్థం చూసేందుకు వచ్చే భక్తులు తప్పకుండా భీముని గృహాన్ని కూడా సందర్శిస్తుంటారు.

పాండవులు ఇక్కడ ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు సీతారామ లక్ష్మణ విగ్రహాలను వేదగర్భుడు అనే వైష్ణవ భక్తుడికి ఇవ్వగా... వేదగర్భుడు ఆ మూలవిరాట్‌ను నలభై సంవత్సరాలపాటు కంటికి రెప్పలా కాపాడి ఆ తరువాత భూగర్భంలో ఎవరికంటా పడకుండా దాచిపెట్టాడట. ఆయన తరువాత ఈ విగ్రహాల జాడ ఎవరికీ తెలియదట.

ఒకరోజు ఓ వృద్ధురాలికి స్వప్నంలో లక్ష్మణుడు కనబడి సీతారామ లక్ష్మణుల విగ్రహాలు దాచిపెట్టిన భూగర్భం వివరాలను తెలియజేశాడట. పుట్టు మూగతనంతో బాధపడుతున్న ఆ వృద్ధురాలు లక్ష్మణుడి దర్శనంతో మాటలు వచ్చి, ఆయన చెప్పినట్లుగా విగ్రహాలను వెలికితీసి... ఈ మొత్తం వృత్తాంతాన్ని అప్పటి రాజు పూసపాటి మహారాజుకు తెలియజేసి విగ్రహాలను అందజేసిందట.

ఆ తరువాత పూసపాటి మహారాజు ఆ విగ్రహాలను రామతీర్థంలో ప్రతిష్టింపజేసి, ఆలయాన్ని నిర్మించి, ఆలయ నిర్వహణకుగానూ కొన్ని భూములను ఇనాంగా ఇచ్చాడట. అప్పటినుంచి ఆయన ఇచ్చిన భఊముల ఆదాయంతోనే ఇప్పటివరకూ ఆలయంలో పూజాదికాలను నిర్వహిస్తున్నారని పూర్వీకుల కథనం.

సీతారామ లక్ష్మణులు రామతీర్థం ప్రాంతంలో కొంతకాలం గడిపారన్నదానికి నిదర్శనంగా శ్రీరాముని పాద ముద్రికలు, ఆంజనేయస్వామి అడుగులు ఈ కొండపై ఇప్పటికీ కనిపిస్తాయి. మరోవైపు పాండవుల సంచారానికి నిదర్శనంగా భీముని గృహం ఉందన్న సంగతి తెలిసిందే.

కొండపై నెలవైన రామతీర్థం ఆలయం ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తుంది. ఇక్కడి ప్రకృతి అందాలు, ప్రశాంతత భక్తులను ఆకట్టుకుంటాయి. అంతేగాకుండా, కొండపై ఉన్న కోనేరు ఈ పుణ్యక్షేత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కొండపైన చెరువులు ఎక్కడా ఉండవన్న సంగతి తెలిసిందే, అయితే ఈ కొండపైన ఒక చెరువు ఉండటమేగాక, ఆ చెరువులో సంవత్సరమంతా నీరు ఉండటం వింతల్లోకెల్లా వింతగా చెప్పుకోవచ్చు.

కరువుకాటకాలలో సైతం నీటితో కళకళలాడుతుండే ఈ చెరువు... శ్రీరాముని మహిమవల్లనే అలా ఉంటోందని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్నానం చేయలేనివారు కోనేటి నీటితో కాళ్లు, చేతులు కడుక్కుని ఆలయంలోకి ప్రవేశిస్తుంటారు. ఈ ఆలయంలో హిందూ పండుగలను అత్యంత సంప్రదాయబద్ధంగా జరుపుతుంటారు.

ఆంధ్ర రాష్ట్రం నలుమూలలనుంచే కాకుండా, పక్క రాష్ట్రాలైన ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌ల నుంచి కూడా రామతీర్థం ఆలయానికి అధిక సంఖ్యలో వస్తుంటారు. శైవ భక్తులతో పాటు, వైష్ణవ భక్తులు కూడా ఈ ఆలయ ఉత్సవాల్లో, ప్రత్యేక పూజలలో విశేషంగా పాల్గొంటుంటారు.

విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలానికి తూర్పుదిక్కున ఉన్న ఈ ఆలయానికి చేరుకునేందుకు రోడ్డు, రైల్వే సౌకర్యాలు ఉన్నాయి. విజయనగరం బస్టాండు నుంచి, నెల్లిమర్ల మండల కేంద్రం నుంచి ఏపీఎస్ ఆర్టీసీవారు ఆలయందాకా ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. అదే విధంగా రైల్లో వచ్చేవారు, విజయనగరం రైల్వే స్టేషన్‌లో దిగి, అక్కడి నుంచి బస్సు ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. బస చేయాలనుకునేవారికి మండల కేంద్రంలో పలు వసతి సౌకర్యాలు కూడా కలవు.

Share this Story:

Follow Webdunia telugu