Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాలరాతి కావ్యం "స్వామి నారాయణ మందిరం"

పాలరాతి కావ్యం
"ఇంత అద్భుతమైన కట్టడాన్ని నేనెక్కడా చూడలేదు. చాలామంది చెబుతుంటే తెలియలేదుగానీ, కళ్లారా చూస్తేగానీ ఆ గొప్పదనం తెలియడంలేదు. వైకుంఠం ఎక్కడో లేదు. నా జీవితం ధన్యమైపోయింది" ఇలాంటి లెక్కలేనన్ని ప్రశంసలు బ్రిటన్‌లోని "స్వామి నారాయణ మందిరం" సొంతం.

అందుకే ఈ మందిరం గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకున్నారో, ఏమోగానీ.. బ్రిటన్ ప్రజానీకం ఏకంగా... "ఫ్రైడ్ ఆఫ్ ప్లేస్"గా ఎన్నుకుని ఈ ఆలయానికి సమున్నత గౌరవం ఇచ్చారు. విదేశాల్లో నెలకొన్న ఓ భారతీయ ఆధ్యాత్మిక కేంద్రానికి ఇంత గౌరవం దక్కడం విశేషంగా చెప్పుకోవచ్చు.

దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ఉత్తర లండన్‌లో ఇస్లింగ్‌టన్‌లో స్వామి నారాయణ మందిరాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రద్దీ పెరగటంతో నెస్‌డక్లోని ఓ గిడ్డంగికి మారింది. అయితే, ఇలా ప్రతిసారీ వేరేచోటికి తరలి వెళ్లడం ఆలయ నిర్వాహకులకు ఇబ్బందిగా మారడంతో, శాశ్వత భవనాన్ని నిర్మించాలన్న ఆలోచన చేశారు. అలా పుట్టిందే.. ప్రస్తుతం నెస్‌డక్‌లో నెలవైన స్వామి నారాయణ మందిరం.

ఉత్తర లండన్‌లోని నెస్‌డెన్ ప్రాంతంలో రూపుదిద్దుకున్న ఈ ఆలయం... నిజంగానే చాలా గొప్ప నిర్మాణం. 2,820 టన్నుల బల్గేరియా సున్నపురాయిని, రెండువేల టన్నుల ఇటలీ చలువరాతిని మందిర నిర్మాణంలో వాడారు. దాదాపు పదిహేనువందల మంది శిల్పులు పై ముడిసరకులకు ప్రాణం పోసే బాధ్యత తీసుకున్నారు. ఏళ్లతరబడి శ్రమించి 26,500 అందాల నగిషీలను సిద్ధం చేసి అందించారు.

ఈ నగిషీలను అందంగా పేర్చడం కోసం మరో మూడేళ్ల కాలం పట్టింది. ఆలయ నిర్మాణంలో ఎక్కడ కూడా ఒక్క ముక్క ఇనుముగానీ, సీసంకానీ వాడకపోవటం గమనార్హం. యూకేలోని ఏ ఆధ్యాత్మిక కేంద్రానికి కూడా ఇంతటి ప్రత్యేకత లేదు. 1995వ సంవత్సరం నుంచి భక్తజనులను పావనం చేసున్న ఈ ఆలయాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరి అనుభూతి జీవితంలో మరువలేనిదిగా మిగిలిపోతోంది.

మందిరం లోపలికి అడుగుపెడితే.. అదో ఇంద్ర లోకమే. ఆ ఆధ్యాత్మిక కేంద్ర సముదాయానికి ప్రధాన ఆలయమే ప్రత్యేక ఆకర్షణ. ఆ వైభోగాన్ని కళ్లారా చూస్తూ అడుగులేస్తుంటే, "అండర్‌స్టాండిగ్ హిందూయిజం (హిందూ ధర్మాన్ని అర్థం చేసుకోండి)" అని రాసి ఉన్న ఓ పెద్ద బోర్డు సందర్శకులను ఇట్టే కట్టిపడేస్తుంది.

స్వామి నారాయణ మందిరం ఓ శాశ్వత ప్రదర్శన శాల అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే... భారతదేశం గురించి, హిందూ ధర్మం గురించి తెలుసు కోవాలనుకునేవారికి అక్కడ బోలెడంత సమాచారం లభిస్తుంది. అలాగని వేల పేజీల వేదాలు, ఉపనిషత్తులు తిరగేయాల్సిన అవసరం లేదండోయ్..! చిన్ని చిన్ని పదాలతో, అందమైన బొమ్మలతో అలరించే చందమామ కథల్లాగా చెప్పారక్కడ.

అంతేగాకుండా.. గణితం, ఖగోళం, వైద్యం... ఇలా ప్రపంచానికి మనం ఇచ్చిన కానుకలు ఏమిటో చక్కగా వివరించారు. ఇకపోతే... సాంస్కృతిక కేంద్రం "హవేలి" అందాలు మాటల్లో వర్ణించలేనివిగా ఉంటాయి. అడుగడుగునా గుజరాతీ శైలి కనువిందు చేస్తుంది. రెండడుగులు వేస్తే వ్యాయామశాల, పుస్తకాల దుకాణం, కాఫీ షాపు, కిరాణా కొట్టు కనిపిస్తాయి.

ఇదిలా ఉంటే... స్వామి నారాయణ ఆలయం నిర్వాహకుల సారథ్యంలో, బ్రిటన్‌లో ఒక స్కూలును కూడా నడుపుతున్నారు.ఇక్కడ స్వచ్ఛమైన భారతీయ శైలిలో పాఠాలు చెబుతుంటారు. అలాగే సంగీతం, నృత్యం, భారతీయ భాషలను కూడా నేర్పిస్తారు. పనులరీత్యానో, విహార యాత్రలకో వెళ్లినట్లయితే.. విదేశంలో వెలసినా భారతీయతకు చక్కటి నిదర్శనంగా నిలిచిన ఈ "ఫ్రైడ్ ఆఫ్ ప్లేస్"ను దర్శించటం మాత్రం మరువవద్దు సుమా..!

Share this Story:

Follow Webdunia telugu