Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దివినున్న కైలాసాన్ని తలపించే "మధ్యకైలాష్"

దివినున్న కైలాసాన్ని తలపించే
FILE
కైలాసాన్ని, అక్కడి మహిమాన్వితాన్ని కన్నులారా తిలకించాలంటే కవుల వర్ణనలలో దర్శించగలమే తప్ప స్వయంగా చూడాలంటే అసాధ్యమైనపని. అలాంటి అనుభూతిని కలిగించే ఓ ఆలయం ఉందంటే ఎంత భాగ్యమో కదూ.. ఎలాగైనా సరే ఆ భూ కైలాసాన్ని చూసి తీరాల్సిందేనని మనసు పరుగులు తీయటం ఎవరికైనా సహజం. అయితే మరెందుకు ఆలస్యం వెంటనే చెన్నైకి బయల్దేరితే సరి..!

చెన్నై నగరంలోని అడయార్ కస్తూరిభాయ్ నగర్ రైల్వేస్టేషన్ నుంచి ఓఎంఆర్ రోడ్డుకు వెళ్లే మార్గంలో నెలవై భక్తులను అలరిస్తోంది మధ్యకైలాష్ ఆలయం. కొన్ని సంవత్సరాల క్రితం తిరువేంకటస్వామి అనే ఓ పాఠశాల విద్యార్థి తన సహ విద్యార్థులతో కసి ప్రస్తుతం మధ్యకైలాష్ ఆలయం వెలసిన చోట "చిన్న వినాయక విగ్రహాన్ని" ప్రతిష్టించాడు.

ఈ చిరు వినాయకుడి విగ్రహాన్ని గమనించిన పాదచారులు ప్రతిరోజూ పూజలు చేయసాగారు. భక్తుల తాకిడిని గుర్తించిన తిరువేంకటస్వామి తన చదువు పూర్తయి ఉద్యోగంలో చేరిన తరువాత ఆలయ అభివృద్ధికి కృషి చేశాడు. అలా రూపుదిద్దుకున్న ఆలయానికి భక్తుల రాక మరింతగా పెరగసాగింది.

భక్తులు అందించిన విరాళాలతో స్వామివారి ఆలయానికి 1984లో కుంభాబిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆదిత్య (సూర్యుడు), పరమేశ్వరుడు, అభిరామి అమ్మవారు, మహావిష్ణువు, ఆంజనేయస్వామి, ఆద్యంత ప్రభువు తదితర దేవతలకు ప్రత్యేక మంటపాలను నిర్మించారు. ఇలా క్రమంగా రూపుదిద్దుకున్నదే ప్రస్తుత మధ్యకైలాష్ ఆలయం.
కర్మకార్యాలకు ప్రత్యేక అనుమతి
పూర్వీకుల కర్మకార్యాలు నిర్వహించేందుకు కూడా ఈ మధ్యకైలాష్ ఆలయంలో ప్రత్యేక అనుమతి ఉంది. అమరులైన పూర్వీకులకు తమ ఇళ్లల్లో కర్మ కార్యక్రమాలు నిర్వహించేందుకు వసతులు లేనివారు, గుళ్ళల్లో ఈ కార్యాలు చేసేందుకు ఇష్టపడే వారికోసం ప్రత్యేకించి ఈ ఆలయంలో వసతి...
webdunia


మధ్యకైలాష్ ఆలయంలోని మంటపాలు, విగ్రహాలు వేటికవే ప్రత్యేకత సంతరించుకున్నాయి. బ్రహ్మచారులైన విఘ్నేశ్వరుడు, ఆంజనేయస్వామివార్లు వారి అర్ధ శరీరాలతో ఏకమైనట్లు ఏర్పాటైన విగ్రహం భక్తులను ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమకు కైలాసాన్ని దర్శించినంత అనుభూతి కలుగుతోందని చెబుతున్నారంటే, ఈ ఆలయం వారిలో ఎంత భక్తిపారవశ్యాన్ని నింపుతోందో అర్థం చేసుకోవచ్చు.

ప్రతి సంవత్సరం మధ్యకైలాష్‌లో వినాయక చతుర్థి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ సమయంలో బొజ్జ గణపయ్య ఆలయం నుంచి బయలుదేరి వీధి విహారం చేస్తారు. భక్తుల హారతులను అందుకుని వారికి తన కరుణా కటాక్ష వీక్షణాలను అందిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం తదితర కార్యక్రమాలు జరుగుతాయి.

అలాగే తమిళ మహాకవి భారతీయార్ అభిమానుల ఆధ్వర్యంలో మధ్యకైలాష్ ఆలయంలో ప్రతియేటా భారతీయార్ విగ్రహాలతో ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సమయంలో విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేస్తారు. ఇదే సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.

ఇక చివరిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే.. పూర్వీకుల కర్మకార్యాలు నిర్వహించేందుకు కూడా ఈ మధ్యకైలాష్ ఆలయంలో ప్రత్యేక అనుమతి ఉంది. అమరులైన పూర్వీకులకు తమ ఇళ్లల్లో కర్మ కార్యక్రమాలు నిర్వహించేందుకు వసతులు లేనివారు, గుళ్ళల్లో ఈ కార్యాలు చేసేందుకు ఇష్టపడే వారికోసం ప్రత్యేకించి ఈ ఆలయంలో వసతి కల్పిస్తున్నారు. ఇందుకుగానూ ఓ వ్యక్తి పేరిట రూ.5,250 చెల్లిస్తే సరిపోతుంది. జీవితకాలం వారు ఇక్కడ కర్మకాండలను నిర్వహించుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu