Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉత్తరాంధ్ర అభయప్రదాత "తిరుమలగిరివాసుడు"

ఉత్తరాంధ్ర అభయప్రదాత
"శ్రీ శ్రీనివాస గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా.. భక్తవత్సలా గోవిందా.. భాగవతప్రియా గోవిందా... ఆపద మొక్కుల వాడా.. అనాధ రక్షకా... పాహిమాం... పాహిమాం..." అంటూ భక్తులు నిత్యం కొలిచే దైవం శ్రీవేంకటేశ్వరుడు. కలియుగంలో ప్రత్యక్ష దైవంగా భక్తుల నీరాజనాలందుకుంటున్న ఈ దైవానికి దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా అనేకమైన ఆలయాలున్నాయి.

అయితే ఎన్ని ఆలయాలున్నప్పటికీ.. అవన్నీ ఏడుకొండలపై కొలువైఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం తరువాతే అని చెప్పవచ్చు. తిరుమల తరువాత అంతటి ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది శ్రీకాకుళం పట్టణంలోని నారాయణ తిరుమలగిరిపై కొలువుదీరిన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం. ఉత్తరాంధ్ర భక్తజనకోటికి అభయప్రదాతగా నిలిచిన ఆ దేవదేవుడి ఆలయాన్ని చూసి వద్దాం రండి...!

ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే తిరుమలగిరిపై నెలవైన శ్రీవేంకటేశ్వర ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే... తిరుమల వెళ్లలేని భక్తులు ఈ ఆలయానికి విచ్చేసి, స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులను తీర్చుకుని వెళ్తుంటారు. ఇక్కడి కొండపైన ప్రకృతి సౌందర్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఆలయ చరిత్రను చూస్తే... ఒక భక్తుడి సంకల్పం ఫలితంగా ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు పూర్వీకులు చెబుతుంటారు. వేదాంత ప్రవక్త అయిన గురుగుబెల్లి నారాయణదాసు అనే భక్తుడి కలలో శ్రీవేంకటేశ్వర స్వామివారు ప్రత్యక్షమై నారాయణ తిరుమల కొండపై ఆలయం నిర్మించమని ఆదేశించారట.

స్వామివారి ఆదేశానుసారం... నారాయణదాసు అనువైన కొండ కోసం గాలిస్తుండగా, నాగావళి నదికి పశ్చిమ దిశలోని ఒక కొండను ఎంపిక చేశాడు. ఈ కొండపైని స్వామివారి పాదాల గుర్తులను అనుసరించి, అక్కడ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు. 1961వ సంవత్సరంలో తిరుపతిలో తయారు చేయించిన భూనీలాసమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి విగ్రహాలను పాంచరాత్రాగమ ప్రకారం ప్రతిష్టించాడు. అనంతరం 1997లో నారాయణదాసు మృతి చెందేదాకా ఆలయ ధర్మకర్తగా వ్యవహరించాడు.

అలా... నారాయణ తిరుమల కొండపై నిర్మాణమైన శ్రీవేంకటేశ్వర ఆలయం ఎన్నో ప్రత్యేకతలతో అలరారుతోంది. ఆలయంలోని శ్రీరామానుజాచార్య, శ్రీనమ్మాళ్వార్ విగ్రహాలు.. స్వామివారి దశావతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నర్సింహ, వామన, పరశురామ, రామ, శ్రీకృష్ణ, బలరామ, కల్కి అవతారాలతో కూడిన విగ్రహాలను భక్తులను పారవశ్యంలో ముంచెత్తుతాయి.

దేశంలోనే అత్యంత ఎత్తయిన గరుత్మంతుని (గరుఢ) విగ్రహం ఈ ఆలయంలో కలదు. అలాగే అష్టలక్ష్మి వైభవాన్ని విశదీకరించే లక్ష్మీదేవి విగ్రహాలు ఈ ఆలయానికే ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఆలయంలో ఐదు అంతస్తుల గాలి గోపురం తిరుమలేశుని సన్నిధిని గుర్తుకు తెస్తుంది. ఆలయంలోని బేడా మండపం, కళ్యాణ మండపం, యాగశాల, పుష్కరిణి, ప్రాకారాలు ఆకట్టుకుంటాయి.

ఈ శ్రీవేంకటేశ్వర ఆలయంలో ఆగమ శాస్త్రం ప్రకారం నిత్య పూజాదికాలను నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం స్వామివారికి కళ్యాణంతోపాటు, శ్రీకృష్ణాష్టమి, భీష్మ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి తదితర పండుగలను, పర్వదినాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఆలయంలో ప్రతిరోజూ బ్రహ్మ ముహూర్తంలో విష్ణు సహస్ర నామపారాయణం జరుగుతుంటుంది.

ఎలా వెళ్ళాలంటే... శ్రీకాకుళం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండుకు కిలో మీటరు దూరంలో ఉంటుంది శ్రీవేంకటేశ్వర ఆలయం. శ్రీకాకుళం రోడ్ (ఆముదాల వలస) రైల్వే స్టేషన్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస చేయాలనుకునేవారికి శ్రీకాకుళం పట్టణంలో అనేకమైన వసతి సౌకర్యాలు కలవు.

Share this Story:

Follow Webdunia telugu