శ్రీవారి ఆభరణాల లెక్క నిగ్గు తేలుస్తాం : తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

శనివారం, 22 జూన్ 2019 (16:43 IST)
తిరుమల తిరుపతి దేవస్థానపాలక మండలి (తితిదే) నూతన ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇందుకోసం శ్రీవారి మెట్టు మార్గంలో ఆయన కాలిబాటన కొండపైకి నడిచివెళ్లారు. ఆ తర్వాత తలనీలాలు సమర్పించి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. పిమ్మట తితిదే పాలక మండలి ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. 
 
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, తనతో పాటు తితిదేకు తొలి ప్రాధాన్యత సామాన్య భక్తులేనని చెప్పారు. తిరుమల గిరుల్లో ఉన్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని చెప్పారు. అలాగే, శ్రీవారి ఆభరణాల విషయంలో కూడా లెక్కలను నిగ్గు తేలుస్తామని ఆయన స్పష్టం చేశారు. 
 
అంతేకాకుండా, అర్చకుల సమస్యలపై పీఠాధిపతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, త్వరలోనే మఠాధిపతులు, పీఠాధిపతులతో సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. కాగా, ఈయన గతంలో ఒంగోలు లోక్‌సభ సభ్యుడుగా ఉన్నారు. ఈ దఫా ఆయనకు టిక్కెట్ ఇవ్వకుండా మాగుంట శ్రీనివాస రెడ్డికి టిక్కెట్ ఇవ్వగా ఆయన గెలుపొందారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 23-06-2019 నుంచి 29-06-2019 వరకు మీ వార రాశిఫలాలు