అరగంటలో శ్రీవారి దర్సనం కావాలంటే సుపథం మార్గం నుంచి వెళ్ళాలి. సుపథం అంటే 300 రూపాయల టోకెన్ తీసుకోవాలి. అది కూడా విఐపిలు సిఫారసు చేసే వారికి మాత్రమే ఇస్తుంటారు. ఈ టోకెన్ తీసుకోవడం అంత సులువు కాదు. విఐపికి బాగా తెలియాలి. ఆ విఐపి ఇచ్చిన సిఫారసు లేఖను టిటిడి స్వీకరించాలి.
అది కూడా టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డి చేతిలో ఉంటుంది. అయితే టిక్కెట్ దొరికిందంటే చాలు దర్సనం చాలా సులువు. ఆలయానికి సమీపంలోని సుపథం నుంచి ఎంటరై అతి సులువుగా స్వామివారిని దర్సించేసుకోవచ్చు. అందుకే చాలామంది ఈ టిక్కెట్లు కోసమే ప్రయత్నం చేస్తుంటారు.
భక్తుల మధ్య ఎక్కువ సేపు నిలబడలేని వారు క్యూలైన్లలో నిలబడేందుకు ఇబ్బంది పడేవారికి సుపథం దర్సనం ఒక సువర్ణ అవకాశం. అయితే టిటిడి ఆ దర్శనంలో మార్పు చేసింది. కేవలం టిటిడి ఉద్యోగ కుటుంబీకులకు, పెన్షనర్లకు, మఠ, పీఠాధిపతులు, వారి శిష్యబృందానికి మాత్రమే సుపథం మార్గంలో ప్రవేశాన్ని కల్పించనుంది.
మిగిలిన ఎవరికీ ఆ అవకాశం లేదు. సిఫార్సు దర్సనాల అనుమతిని ఆదివారం నుంచి నిలిపివేసింది. ఇక అలాంటి దర్సనం చేసుకోవడం విఐపిలకు కుదరదు. ఒకవేళ 300 రూపాయల టోకెన్ తీసుకున్నా వైకుంఠం -1 నుంచే వారిని అనుమతిస్తారు.