కలియుగ వైకుంఠుడు శ్రీ వేంకటేశ్వర స్వామి పట్టపురాణి పద్మావతి అమ్మవారు నెలవై ఉన్న తిరుచానూరులో నూతన అన్నదాన సముదాయాన్ని నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థాన (తితిదే) పాలకమండలి నిర్ణయం తీసుకుంది. టిటిడి పాలకమండలి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన పాలకమండలి మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమావేశమైంది.
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను పాలకమండలి తీసుకుంది. తిరుమలలో ఏవిధంగా అయితే శ్రీవారి భక్తులకు అన్నప్రసాదాలను అందిస్తారో అదేవిధంగా తిరుచానూరులో కూడా అందించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. తిరుచానూరు ఆలయ ఆవరణలో 6 కోట్ల 5 లక్షల రూపాయలను ఖర్చుపెట్టి అన్నదాన సముదాయాన్ని నిర్మించనున్నట్లు చదలవాడ కృష్ణమూర్తి వెల్లడించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యాలకు ఉపయోగించే శఠారీలను తయారు చేయించాలని మొదటగా రెండు శఠారీలకు 72 లక్షల రూపాయలను వ్యయం చేయనున్నట్లు తెలిపారు. దాతలెవరైనా శఠారీలను తయారు చేయిస్తే స్వీకరిస్తామన్నారు. తితిదే పాలకమండలి సభ్యులు రామచంద్రా రెడ్డి ఒక శఠారీని తయారు చేయించడానికి ముందుకు వచ్చారు.
మరోవైపు స్వామివారి వాహన సేవలకు ఉపయోగించే సర్వభూపాల, ముత్యపుపందిరి వాహనాలను 3 కోట్ల 86 లక్షల రూపాయలు వెచ్చించి బంగారంతో తయారు చేయిస్తామన్నారు. పోటు కార్మికులను మరో యేడాదిపాటు కొనసాగించనున్నట్లు తెలిపారు. 35 లక్షలతో తిరుమలలోని అన్నప్రసాద సముదాయానికి స్టీల్ సామాన్ల కొనుగోళ్ళు చేయనున్నామని, మే 22 నుంచి 29వ తేదీ వరకు శుభప్రదం నిర్వహిస్తామని, తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీకి ఒక కోటి రూపాయలు హిందూ ధర్మపరిరక్షణకు 50 లక్షల రూపాయలు అభివృద్ధి కోసం కేటాయిస్తున్నామన్నారు.
అలాగే అర్చకుల సంక్షేమ నిధికి రూ.25 కోట్లు ఇవ్వనున్నామని, బర్డ్ ఆసుపత్రిని దేశంలోనే అత్యున్నతమైన ఆసుప్రతిగా తీర్చిదిద్దుతామని, స్విమ్స్‌లో మైక్రోబయాలజీ, ల్యాబ్‌ల విస్తరణ 4 కోట్ల 80 లక్షల రూపాయలు కేటాయిస్తామన్నారు. కెన్యా దేశం నైరోబిలో శ్రీనివాస కళ్యాణం మే 28వ తేదీన నిర్వహిస్తామన్నారు. పరకామణి భవనాల నిర్మాణాల కోసం రూ.4.5 కోట్లు వెచ్చిస్తామని, మే 10 నుంచి రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.
యేడాదికి నెయ్యి కొనుగోలుకు రూ.66 కోట్లు, ఒంటిమిట్టలో కళ్యాణం మండపాలు, వసతి గృహాలు నిర్మించడానికి రూ.4 కోట్ల 60 లక్షలు, మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ తిమ్మప్ప దేవాలయానికి రూ.35 లక్షలు, బంజారా హిల్స్‌లో రూ.18 కోట్లతో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తామని ఆయన చెప్పారు.