తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, సిబ్బంది కార్యనిర్వహణాధికారి సాంబశివరావు క్లాస్ పీకారు. విధుల్లో అలసత్వం వహించకండని సున్నితంగా మందలించారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో సీనియర్ అధికారులతో ఈఓ సమావేశమయ్యారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే శ్రీవారి భక్తులకు భద్రత కల్పించడంతో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. తిరుపతిలోని తితిదే సముదాయాలు శ్రీనివాసం, విష్ణునివాసంలలో సి.సి.కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కృష్ణా పుష్కరాల్లో నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయడానికి, అమరావతిలో శ్రీవారి ఆలయం నిర్మించడానికి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. తితిదే అనుబంధ ఆలయాల్లో రోజూ వేదపారాయణం, దివ్యప్రబంధ పారాయణం పఠించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తితిదేకి సంబంధించిన ఎఫ్.ఎం రేడియోలో తిరుమల సమాచారాన్ని ఎక్కువసార్లు శ్రోతలకు వినిపించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు.