దేశంలోని అన్ని ప్రముఖ హిందూ దేవాలయాలు తమ వెబ్‌సైట్‌లో మిగిలిన ఆలయాల వెబ్‌సైట్ల వివరాలను పొందుపరిచి, నకిలీ వెబ్‌సైట్లను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానాలకు షిర్డీ సంస్థాన్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను పరిశీలించాలని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం తిరుమల అన్నమయ్య భవనంలో టిటిడి ఉన్నతాధికారులు, షిర్డీ సంస్థాన్ అధికారుల బృందంతో టిటిడి ఛైర్మన్ సమావేశం నిర్వహించారు.
కరోనా వ్యాప్తి కట్టడికి జాగ్రత్తలు తీసుకుంటూ టిటిడి భక్తులకు దర్శనం కల్పిస్తున్న నేపథ్యంలో తీసుకుంటున్న జాగ్రత్త చర్యలను, భక్తులకు సదుపాయాలు కల్పిస్తున్న తీరును పరిశీలించడానికి శనివారం షిర్డీ సంస్థాన్ అధికారులు తిరుమలకు వచ్చారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కోవిడ్-19 పరిస్థితుల్లో తిరుమలలో భక్తులకు కల్పిస్తున్న దర్శనం, వసతి, క్యూలైన్ల నిర్వహణ, అన్నదానం, శ్రీవారి సేవ, అకౌంట్స్, లడ్డూ ప్రసాదం పంపిణీ కౌంటర్ల నిర్వహణపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అలాగే టిటిడి నిర్వహిస్తున్న సామాజిక, ధార్మిక కార్యక్రమాలను తెలియజేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన అనంతరం షిర్డీలో భక్తులకు దర్శనం కల్పించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై షిర్డీ శ్రీ సాయిబాబా సంస్థాన్ అధికారులు టిటిడి నుండి సూచనలు, సలహాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా, ఎలాంటి లోపాలు లేకుండా ఆచార సంప్రదాయాల ప్రకారం వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలోని హిందూ దేవాలయాల్లో మొదటిస్థానంలో ఉన్న టిటిడి దేశంలోని ఇతర ప్రముఖ హిందూ దేవాలయాల్లో భక్తులు సౌకర్యవంతంగా దర్శనం చేసుకునే అంశంపై ఆలోచనలు పంచుకుంటుందని చెప్పారు. దీంతోపాటు షిర్డీ ఆలయానికి ఉన్న డిపాజిట్లపై ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అధిక వడ్డీ సమకూర్చుకునే అవకాశాలపై టిటిడి నుంచి సలహాలు స్వీకరించిందన్నారు.
టిటిడి ఆన్‌లైన్‌లో కల్పిస్తున్న దర్శన టికెట్లు, వసతి, విరాళాలు అందించడం లాంటి ఇతర సదుపాయాలను షిర్డీ అధికారులు తెలుసుకున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా హిందూ ధర్మప్రచారాన్ని మరింత విస్తృతం చేయడానికి అన్ని ప్రముఖ హిందూ ఆలయాలతో సమన్వయం చేసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందుకోసం అన్ని ప్రముఖ ఆలయాలతో ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఏడాదికి ఒకసారి సమావేశమై ఆలోచనలు పంచుకునేలా ఆలోచిస్తామన్నారు.
ముఖ్యమంత్రి శ్రీ వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశంతో టిటిడి దక్షిణాది రాష్ట్రాల్లో గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించనుందని ఛైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి షిర్డీ సంస్థాన్ అధికారులకు వివరించారు. తమిళనాడులో త్వరలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. షిర్డీ సంస్థాన్ సిఈవో శ్రీ కె.హరిశ్చంద్ర భగాటే మాట్లాడుతూ తిరుమలలో క్యూలైన్లు, అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం, భద్రత తదితర అంశాలను తమ బృందం ప్రత్యక్షంగా పరిశీలించిందని చెప్పారు. టిటిడి అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించిన అంశాలు షిర్డీ సంస్థాన్‌కు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.