వరుసగా సెలవు రోజులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెలవులు ప్రకటించిన మొదట్లో పెద్దగా భక్తుల రద్దీ లేకపోయినా ఆ తర్వాత భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. శుక్రవారం సర్వదర్శనం కోసం 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 5 గంటలకు పైగా దర్శన సమయం పడుతోంది. అలాగే నడకదారి భక్తులు 3 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 4 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 72,279 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.39 లక్షలు వచ్చింది.
కాగా, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే కోటాను కోటి భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో తితిదేకు రూ.7.96 లక్షల ఆదాయం గడించింది. తలనీలాలను మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్ల వెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహిస్తారు.
తలనీలాలలో మొదటి రకం 931 అంగుళాలపైన, రెండో రకం 16 నుంచి 30 అంగుళాలు, మూడో రకం 10 నుంచి 15 అంగుళాలు, నాలుగో రకం 5 నుంచి 9 అంగుళాలు, ఐదో రకం ఐదు అంగుళాలు కన్నా తక్కువ తెల్లవెంట్రుకల రకాలను తితిదే ఈ-వేలంలో పెట్టింది.