తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శుక్రవారం ఉదయానికి కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనంతో పాటు కాలినడక భక్తులు వేచి ఉండే క్యూలైన్లు పూర్తిగా నిండిపోయి క్యూలైన్లు బయటకు వచ్చేశాయి. ఒకటిన్నర కిలోమీటర్‌కుపైగా క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. తితిదే మాత్రం సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం, కాలినడక భక్తులకు 10 గంటల్లోనే దర్శన భాగ్యం కల్పిస్తామని చెబుతున్నా అది సాధ్యం కావడం లేదు.
గదులు కూడా భక్తులకు దొరకడం లేదు. తితిదే ఆన్ లైన్ స్క్రీన్‌లపై గదులు ఖాళీ లేవంటూ బోర్డులు కనిపిస్తున్నాయి. తలనీలాలు సమర్పించే క్యూలైన్ల వద్ద కూడా అదే పరిస్థితి. గంటల తరబడి భక్తులు వేచి ఉండాల్సి వస్తోంది. గురువారం శ్రీవారిని 73,285 మంది భక్తులు దర్సించుకోగా హుండీ ఆదాయం 2 కోట్ల 33 లక్షల రూపాయలు లభించింది.