Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శివనామ స్మరణలో శివక్షేత్రాలు... ఇరు రాష్ట్రాల్లో వైభవంగా శివరాత్రి వేడుకలు

Advertiesment
Maha Shivratri 2021
, గురువారం, 11 మార్చి 2021 (08:21 IST)
రెండు  తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు.. దేశ వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శివక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం మల్లన్న క్షేత్రం, శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరస్వామి ఆలయం, అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి ఆలయం, మహానంది, కోటప్పకొండలోని త్రికూటేశ్వరస్వామి ఆలయాలకు వేకువజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శ్రీశైలంలో అర్థరాత్రి 2 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలోని వేములవాడ రాజన్న ఆలయం, కీసర రామలింగేశ్వరస్వామి ఆలయం, కాళేశ్వరం, రామప్ప ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
 
మరోవైపు, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇరు రాష్ట్రాల గవర్నర్లు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కోట్లాది మంది శివ భక్తులకు మహా శివరాత్రి.. అత్యంత పవిత్రమైన రోజని ఏపీ గవర్నర్ హరిచందన్ అన్నారు. శివరాత్రి పండుగను ఎంతో ఉత్సాహంగా, భక్తితో జరుపుకోవటం సాంప్రదాయంగా వస్తుందని, జాగారం ఉండటం ద్వారా ముక్తి సాధించవచ్చని విశ్వసిస్తారని గుర్తుచేశారు.
 
శివరాత్రి రోజున శివుడిని ఆరాధించడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారన్నారు. ఈ శుభ సందర్భంగా మనందరిలో ప్రేమ, ఆప్యాయత, స్నేహం, సోదరభావం ప్రేరేపించాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి కూడా శుభాకాంక్షలు తెలిపారు. 
 
అలాగే, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావులు కూడా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి ఉపవాస పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్న ప్రజలకు ఎల్లవేళలా శివుడి ఆశీర్వాదం ఉంటుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మహాశివుని అనుగ్రహం కోసం పూజలుచేసే శివరాత్రి అత్యంత పవిత్రమైనదని గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు. 
 
ఇదిలావుంటే, వేములాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో భక్తులు రాజన్న దర్శనానికి పోటెత్తారు. వేకువజాము నుంచే పుణ్య స్నానాలు చేసి క్యూలైన్లలో స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. మూడురోజుల పాటు జరిగే ఉత్సవాల కోసం కోడెమొక్కులు మినహా అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. 
 
మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. సాధారణ దర్శనాలు, కోడెమొక్కులకు వేర్వేరుగా టికెట్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతికరమైన కోడెమొక్కును చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా మహామండపం నుంచే భక్తులకు అధికారులు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. ఉదయం రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 
 
రాత్రి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం
మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం 6.05 గంటలకు స్వామివారి కల్యాణమండపంలో మహాలింగార్చన కార్యక్రమం జరుగనుంది. రాత్రి 11.35గంటలకు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. ఉత్సవాల దృష్ట్యా ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. మహామండపం నుంచే భక్తులకు లఘుదర్శనం కల్పిస్తున్నారు.
 
కొవిడ్‌ కారణంగా ధర్మగుండంలో స్నానాలను అధికారులు నిలిపివేశారు. జల్లు స్నానాలకు ప్రత్యేకంగా నల్లాలను ఏర్పాటు చేశారు. అలాగే భక్తులకు ఇబ్బందులు లేకుండా వేములవాడ పట్టణంలో పలు చోట్ల చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చే భక్తుల కోసం తిప్పాపూర్‌ నుంచి వేములవాడ గుడిచెరువు వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. అలాగే జాగరణ చేసే భక్తుల కోసం గుడిచెరువులో శివార్చన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#MahaShivratri అంటే ఏంటి.. శివరాత్రి మహత్యం ఏంటి?