Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుపతిలో మండుతున్న ఎండలు... శ్రీవారి భక్తులు ఉక్కిరిబిక్కిరి

తిరుమల వెంకన్న భక్తులపై ఎండ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. ఉదయం పొద్దుపొడిచింది మొదలు భగభగ మండే అగ్నిగోళంలా సూర్యుడు చెలరేగిపోతున్నాడు. దీంతో భక్తులు ఎక్కడ తలదాచుకోవాలో తెలియక విలవిలలాడిపోతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్మాత్మిక సంస్థ టిటిడి భక్తులకు వేస

Advertiesment
Summer heat in Tirupati
, సోమవారం, 20 మార్చి 2017 (14:48 IST)
తిరుమల వెంకన్న భక్తులపై ఎండ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. ఉదయం పొద్దుపొడిచింది మొదలు భగభగ మండే అగ్నిగోళంలా సూర్యుడు చెలరేగిపోతున్నాడు. దీంతో భక్తులు ఎక్కడ తలదాచుకోవాలో తెలియక విలవిలలాడిపోతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్మాత్మిక సంస్థ టిటిడి భక్తులకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించడం లేదు. గోవిందా..గోవిందా.. అంటూ భగభగ మండే ఎండల్లోనే చెప్పులు లేని కాళ్ళతో భక్తులు పరుగులు తీస్తున్నారు. 
 
తిరుమల అంటే నిత్య కళ్యాణం.. పచ్చతోరణం.. ఆ కలియుగ వైకుంఠుడికి ప్రతినిత్యం సంబరమే. ఆయన వైభోగాన్ని చూడటం కోసం అన్ని వేళలా భక్తులు ఎగబడుతూనే ఉంటారు. స్వామి దర్శనం పొందాలనే ఆతృత వారి అన్ని కష్టాలను మరిపిస్తోంది. కానీ వెంకన్న భక్తులను ఎండతీవ్రత బాగా ఇబ్బంది పెడుతోంది. స్వామివారి సన్నిధిలో తిరుపతిలోని ముఖ్య వసతి గృహాల్లో చెప్పులు లేకుండానే భక్తులు ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే భగభగ మండే ఎండ తీవ్రతకు వారి కాళ్ళు బొబ్బలెక్కుతున్నాయి. 
 
ప్రతిసారి వేసవిలో ఎంతోకొంత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే టిటిడి ఈసారి మాత్రం వాటిని పట్టించుకోలేదు. తిరుమల వరకే తూతూమంత్రంగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని తిరుపతిలో ఉండే భక్తుల సముదాయాలను పూర్తిగా విస్మరించింది. బయటి ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల్లో ఎక్కువమంది తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం అతిథి గృహాల్లో వసతి పొందుతూ ఉంటారు. ఈ రెండు ప్రాంతాలు భక్తులతో ఎప్పుడూ కళకళలాడుతుంటాయి. వీటికి విశాలమైన ప్రాంగణాలు ఉన్నప్పటికీ అది పూర్తిగా బండపరుపుతో ఉండడం వల్ల భక్తులు నడవలేని పరిస్థితి ఏర్పడుతోంది. 
 
గతంలో ఇలాంటి ప్రాంతాల్లో వేసవి వచ్చిందంటే పెయింట్ పూయడం, అలాగే చలువ పందిళ్ళు ఏర్పాటు చేయడం, అక్కడక్కడ కార్పెట్లు వేయడం ఇలాంటివి చేసేది టిటిడి. వేసవి మొదలై చాలారోజులవుతున్నా ఈసారి మాత్రం అలాంటి ఏర్పాట్లు ఏదీ చేయలేదు. దీంతో భక్తులు వేసవి తాపానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి నీడ లేకుండా ఆ వసతి గృహాల ప్రాంగణాల్లో నడుస్తూ ఉన్న భక్తుల విలవిలలాడుతున్నారు. స్వామివారికి తలనీలాలు సమర్పించుకుని కిందకు వచ్చే లోపల తీవ్ర అస్వస్థతకు గురవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి.
 
టిటిడి అనుకుంటే భక్తులకే కాదు. తిరుపతి నగరం మొత్తాన్ని వేడి తీవ్రత నుంచి బయట పడేయగలదు. అన్ని నిధులున్నాయి కాబట్టి చలివేంద్రాలను ఏర్పాటు చేసి మజ్జిగ లాంటి ద్రవపదార్థాలను సరఫరా చేస్తే భక్తులకు చాలా ఉపశమనంగా ఉంటుంది. ఇలాంటివి చేయడానికి మంచి ఆలోచన ఉంటే చాలు కానీ టిటిడికి డబ్బులకు ఎలాంటి కొదవలేదు. అయినా కూడా ఎందుకు ఇలాంటి విషయాలను విస్మరిస్తున్నారో ఆ కలియుగ వైకుంఠునికే తెలియాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ముగ్గురికీ వివస్త్రయై వడ్డన చేసేందుకు వచ్చిన పతివ్రత....