తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో సోమవారం పుష్పయాగ మహోత్సవం ఏకాంతంగా జరిగింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
పుష్పయాగం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు శ్రీసీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.
మధ్యాహ్నం 3.00 గంటలకు ఆలయంలోని ఊంజల మండపంలో అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల పూలు, ఆరు రకాల పత్రాలు కలిపి మొత్తం 2 టన్నుల పుష్పాలు, పత్రాలతో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పుష్పాలు విరాళంగా అందాయి.
శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో పుష్పయాగం చేపట్టారు. మొదటగా అర్చకులు 108 సార్లు విష్ణుగాయత్రి మంత్రాన్ని పఠించి పుష్పాలకు అధిపతి అయిన పుల్లుడు అనే దేవున్ని ప్రసన్నం చేసుకున్నారు. ఇలా చేయడం వల్ల ప్రకృతిమాత పులకించి ఎలాంటి వైపరీత్యాలు తలెత్తకుండా స్వామివారు కరుణిస్తారని నమ్మకం.
శ్రీకోదండరామాలయంలో మార్చి 13 నుండి 21వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.
పుష్పయాగం అనంతరం శ్రీసీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు, ఏఈవో శ్రీ దుర్గరాజు, గార్డెన్ మేనేజర్ శ్రీ జనార్థన్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.