పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శతసహస్ర దీపార్చన సేవామండలి ఆధ్వర్యంలో విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో శనివారం సాయంత్రం నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, లక్ష దీపార్చన కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది.
ఈ సందర్భంగా 300 అడుగుల మహాలింగాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి శతసహస్ర దీపాలతో వెలిగించి ఆనందపరవశులయ్యారు. 300 మంది జంటలు పాల్గొని భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు. కార్తీక దీపాల కాంతులలో స్టేడియం ప్రాంగణం ఇల కైలాసాన్ని తలపించింది.
ఈ కార్యక్రమానికి తాళ్లాయపాలెంలోని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి పాల్గొని భక్తులకు దీపారాధన యోక్క ప్రాశస్థాన్ని వివరించి అనుగ్రహభాషణం చేశారు. కార్యక్రమంలో యాబలూరి లోకనాథశర్మ, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, జి.డి.వి.ప్రసాద్, నాగలింగం శివాజీ తదితరులు పాల్గొన్నారు.