కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నమూనా ఆలయాన్ని కృష్ణా పుష్కరాలలో ఏర్పాటుకు, ఇతర ఇంజనీరింగ్ పనులకు సంబంధించి జూన్ నెలలో మొదలుపెట్టేల కార్యాచరణ ప్రణాళికలు తయారుచేయాలని ఇంజనీరింగ్ అధికారులను తితిదే కార్యనిర్వహణాధికారి సాంబశివరావు ఆదేశించారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో సోమవారం సీనియర్ అధికారులతో ఈఓ సమీక్షా సమావేశం నిర్వహించారు.
కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12వ తేదీ ప్రారంభం సంధర్భంగా శాఖాధికారులు వారివారి శాఖలకు సంబంధించిన పనులను ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళాలని అధికారులను కోరారు. పుష్కరాల్లో తితిదే పుస్తక విక్రయశాలలో ఆధ్మాత్మిక, ధార్మిక పుస్తకాలు, సి.డి.లను అందుబాటులో వుంచుకోవాలన్నారు. ఇప్పటినుంచి ముద్రణకు సంబంధించి ముందస్తు ప్రణాళికలు సిద్థం చేసుకోవాలని సూచించారు.
తితిదే ముద్రణ విభాగం ముద్రించే పుస్తకాల ఖరీదు నిర్థారించేందుకు తిరుపతి జెఈతో కూడిన కమిటీని ఈఓ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో రిటైర్డ్ ఐ.ఎ.ఎస్.అధికారి ముక్తేశ్వరరావు, పిఆర్‌ఓ రవి, ఎప్‌ఏ అండ్ సిఏఓ బాలాజీ, ముద్రణ విభాగం డిప్యూటీ ఈఓ వీరబ్రహ్మంలతో ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న తితిదే కళ్యాణ మండపాల్లో అభివృద్థి పనులకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని సిఈని ఆదేశించారు. అదేవిధంగా విజయవాడ, మంగళగిరి తదితర ప్రాంతాల్లో వున్న కళ్యాణ మండపాల్లో మరమ్మత్తులు పనులను వేగవంతంగా పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు.