శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం స్వామివారు రథోత్సవానికి బదులుగా సర్వభూపాల వాహనంపై కటాక్షించారు. కోవిడ్ -19 నేపథ్యంలో ఈ కార్యక్రమం ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
భూమిని పాలించేవాడు భూపాలుడు. సమస్త విశ్వంలో లెక్కలేనన్ని సూర్యమండలాలున్నాయి. అన్ని సూర్య మండలాల్లోనూ భూమి ఉంది. ఆ భూగ్రహాలన్నింటినీ పాలించడం సర్వభూపాలత్వం. నైసర్గిక సరిహద్దులు గల కొంత భూమిపై అధికారం కలిగిన వ్యక్తి భూపాలకుడంటున్నాం. ఇలాంటి భూపాలురందరూ బ్రహ్మోత్సవాలకు తరలివస్తారు.
తమ ఏలుబడిలోని భూమిని కల్యాణాత్మకం చేసి రక్షించండని శ్రీవారిని ప్రార్థిస్తారు. ఇదొక విశిష్టసేవ. ఈ సేవ కోసం అందరూ ఐకమత్యంతో, భక్తిపూర్ణహృదయంతో, శరణాగతులై తామే జగత్ కల్యాణమూర్తికి వాహనమైపోతారు. అలా వాహనాలుగా మారిన చక్రవర్తుల భుజస్కంధాలపై కల్యాణమూర్తి కొలువుదీరడమే సర్వభూపాల వాహనసేవ.