తిరుమలలో కుండపోతగా వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా అర్థరాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది. తిరుమలకు వచ్చే యాత్రీకుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్సు వెలుపల క్యూలైన్లలో ఉన్న భక్తులు భారీ వర్షంతో ఇబ్బంది పడుతున్నారు.
మరోవైపు.. తిరుమలలో రద్దీ అనూహ్యంగా పెరిగింది. నిన్న రద్దీ కాస్త తగ్గుముఖం పట్టిందని తితిదే అధికారులు భావించినా అనూహ్యంగా రద్దీ పెరిగింది. మంగళవారం అర్థరాత్రికే కంపార్టుమెంట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. బుధవారం ఉదయానికి క్యూలైన్లు బయటకు వచ్చేశాయి. తిరుమల గిరులలో ఎక్కడ చూసినా జనసందోహం కనిపిస్తోంది.
వేసవి సెలవులు ముగియనుండటంతో రోజురోజుకు తిరుమలలో రద్దీ పెరుగుతోంది. గత వారం అధిక సంఖ్యలో భక్తుల రద్దీ చేరుకున్న విషయం తెలిసిందే. మంగళవారానికి రద్దీ కాస్త తగ్గుముఖం పట్టిందని తితిదే వూపిరి పీల్చుకుంది. అయితే బుధవారం ఉదయం 5 గంటల సమయానికి 32 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయి క్యూలైన్లు బయటకు వచ్చేశాయి. వర్షంలో తడుస్తూనే భక్తులు క్యూలైన్లలో స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు.
కాలినడక భక్తుల కంపార్టుమెంట్లు కూడా అదే పరిస్థితి. ఎన్ని గంటల్లో దర్శంనం అవుతుందని తితిదే స్పష్టంగా చెప్పకపోయినా సర్వదర్శనం భక్తులకు 10 గంటల్లో, కాలినడక భక్తులకు 8 గంటల్లో దర్శనం కల్పిస్తామని చెబుతోంది. అయితే తితిదే ప్రకటించిన సమయం ఎంతమాత్రం సాధ్యం కావడం లేదు. గదులు ఖాళీ లేవు. కళ్యాణకట్ట వద్ద కూడా గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి ఉన్నారు భక్తులు. చివరకు రోడ్లపైనే భక్తుల నిరీక్షణ.
తిరుమల క్షేత్రంలో భక్తులు ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. ఒకవైపు వర్షం.. మరోవైపు చలి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలను తీసుకువచ్చిన వారి పరిస్థితి మరింత అన్యాయం. ఎప్పటిలాగే తితిదే చేతులెత్తేసింది. చలికి వణికిపోతూ తితిదే కార్యాలయాల వద్దనో.. చెట్ల కిందో భక్తులు తలదాచుకుంటున్నారు.