తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులో అపచారం చేశారు. బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం పడుతుండటంతో ఏకంగా గోవిందరాజస్వామి వాహనసేవనే నిలిపేశారు. ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తుందోన్న నెపంతో వాహనాన్ని ఊరేగించీ ఊరేగించకుండానే మమ అనిపించేశారు. తితిదే చరిత్రలో మొదటి సారి బ్రహ్మోత్సవాల్లో స్వామి, అమ్మవార్లు మాఢా వీధుల్లో ఊరేగింపుకు రాలేదు.
గోవిందరాజుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లు మోహినీ అవతారంలో ఊరేగాల్సి ఉంది. వాహనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా తితిదే చేసింది. అయితే వర్షం పడుతోందని వాహనసేవను నిలిపివేసింది.
ఆలయంలోపలి నుంచి బయటకు వాహనాన్ని తీసుకుని రానే లేదు. ఉత్సవమూర్తులను ఆలయం లోపలే ఉంచేశారు. గతంలో తితిదే ఎన్నోసార్లు వర్షాలు కురిసినా పెద్ద పెద్ద గొడుగులతో వాహనసేవలను కొనసాగిస్తుంది. అయితే ఈ సారి తితిదే అధికారులు తీసుకున్న నిర్ణయంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహన సేవ జరుగకపోతే అపచారమంటూ పలువురు భక్తులు చెప్పుకుంటున్నారు.