Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో అగ్నిప్రమాదాలకు కారణం ఎవరు?... చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే..?

కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వరాలయంలో అగ్ని ప్రమాదాలు బాగా పెరిగిపోతున్నాయి. లక్షల మంది భక్తుల ఆరాధ్యమైన వెంకటేశ్వరస్వామి నిలయంలో ప్రమాదాలు జరుగుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అసలు శుక్రవారం జరి

తిరుమలలో అగ్నిప్రమాదాలకు కారణం ఎవరు?... చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే..?
, శనివారం, 11 జూన్ 2016 (11:59 IST)
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వరాలయంలో అగ్ని ప్రమాదాలు బాగా పెరిగిపోతున్నాయి. లక్షల మంది భక్తుల ఆరాధ్యమైన వెంకటేశ్వరస్వామి నిలయంలో ప్రమాదాలు జరుగుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అసలు శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదానికి, జరుగుతున్న ప్రమాదాలకు ఎవరు కారణం..అయితే ఈ కథనం చూడండి.. మీకే అర్థమవుతుంది.
 
ప్రపంచ ప్రఖ్యాత గాంచిన తిరుమల దివ్యక్షేత్రంలో మానవ తప్పిదాలతోనే తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకరకంగా గతంలో కంటే తగ్గుముఖం పట్టినప్పటికీ తిరుమలలో జరుగుతున్న ఘటనలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయి. 2013సంవత్సరంలో శ్రీవారి ఆలయంలోని పోటులో విద్యుత్‌ షార్ట్ షర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగింది. అదే సంవత్సరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సముదాయంలో భారీ ప్రమాదమే జరిగింది.
 
వేలమందికి భోజనాలు పెట్టే నిత్యాన్నదాన సముదాయంలో జరిగిన ప్రమాదంలో గోనె సంచులు తగలబడడంతో ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయలేక పోయారు అగ్నిమాపక సిబ్బంది. గంటల పాటు శ్రమపడి మరీ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేయాల్సిన పరిస్థితి. అయితే దేవుడి దయవల్ల భక్తులందరు అప్పట్లో సురక్షితంగానే బయటపడ్డారు. అంతేకాదు విశ్రాంతి సముదాయాలు, శ్రీవారి ఆలయంలో నిత్యం విద్యుత్‌ షార్ట్ షర్క్యూట్‌లు జరుగుతూనే ఉన్నాయి. నిత్యం భక్తజన సంచారం ఉన్న ప్రాంతాల్లో జరిగే ప్రమాదాల నివారణకు తితిదే చర్యలు చేపట్టలేదన్న విమర్శలు లేకపోలేదు. 
 
శుక్రవారం జరిగిన ప్రమాదంలో తితిదే బూంది పోటు సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వేడిగా కాగిన నెయ్యి ఆవిరి రూపంలో లేచి గోడలకు, పైకప్పుకు అతుక్కుంది. ఒక్కసారిగా వేడితో మంటలు చెలరేగాయి. అయితే తితిదే ఈఓ, జెఈఓ మాత్రం అసలు మంటలు విస్తరించే ఆస్కారం లేదని చెప్పడంపై మాత్రం శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. 
 
ఆలయం బయట జరిగిన ప్రమాదమే కాదు గతంలో జరిగిన ప్రమాదాలతో శ్రీవారి భక్తులు భయాందోళనకు లోనయ్యారు. తితిదే, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం కారణంగా భారీ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. సుమారు 5గంటల తరువాత బూందీ పోటును తితిదే పునరుద్ధరించింది. ఆలయానికి ఉత్తరం వైపున లడ్డూ ప్రసాదానికి వినియోగించే బూంది తయారీ పోటు ఉంది. ఇక్కడి నుంచి బూందిని కన్వేయర్‌ బెల్ట్ ద్వారా ఆలయానికి తీసుకెళ్ళి ఆగమశాస్త్రం నిబంధన ప్రకారం లడ్డూలు అక్కడే తయారు చేస్తారు. బూంది పోటులో నాలుగు వరుసల్లో నలభై గ్యాస్‌ పొయ్యిలున్నాయి. వీటి ద్వారా బూందీ తయారీ ప్రక్రియ జరుగుతోంది. బూందీ పోటుకు సమీపంలోనే అతి పెద్ద నెయ్యి ట్యాంకర్లు ఉండడం, పక్కనే వంట గ్యాస్‌ తయారీకి పైపులైన్లు ఉండడం గమనార్హం. వీటి వరకు మంటలు వ్యాపించి ఉంటే ఏ విధంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. 
 
స్వామి వారి ఆలయానికి అతి సమీపంలోనే ఇంతటి అగ్నిప్రమాదం జరగడంపై భక్తుల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. బూంది పోటు సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్న ఆరోపణలు లేకపోలేదు. అసలు బూంది తయారుచేసే సామాన్లు వేడి అయ్యేంత వరకు సిబ్బంది ఏం చేస్తున్నారోనన్న సందేహం రాకమానదు. విధుల్లో నిర్లక్ష్యం వహించడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నది స్పష్టంగా తెలుస్తోంది.

ఇప్పటికే ఈ విషయంపై తితిదే ఈఓ సాంబశివరావు సీరియస్‌ కూడా అయ్యారు. బూంది సిబ్బందితో ఆయన స్వయంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. దీనిపై విచారణ జరపాలని కూడా ఆలయ అధికారులను ఈఓ ఆదేశించారు. అన్నీ అయిన తరువాత ఆకులు పట్టుకున్నారన్న చందంగా తితిదే ఈఓ ఆగ్రహం అటుచింతే మాత్రం లక్షలాదిమంది భక్తుల మనోభావాలు మాత్రం తితిదే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల దెబ్బతింటున్నాయి. శ్రీవారి ఆలయంలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడం మంచిది కాదని భక్తులు సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో అద్భుతం... ఏడుకొండలవాసుడు కొలువైన ప్రాంతం శంఖు ఆకారంలో...