Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ.100 కోట్లతో బెజ‌వాడ క‌న‌కదుర్గ గుడి అభివృద్ధి

విజయవాడ: అమ్మ‌ల‌గ‌న్న అమ్మ‌... ముగ్గుర‌మ్మ‌ల మూల‌పుట‌మ్మ బెజ‌వాడ కనకదుర్గ ఆలయాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలని దేవాదాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం సంవత్సర కాలంలో కనీసం రూ. 5

రూ.100 కోట్లతో బెజ‌వాడ క‌న‌కదుర్గ గుడి అభివృద్ధి
, శనివారం, 20 ఆగస్టు 2016 (21:54 IST)
విజయవాడ: అమ్మ‌ల‌గ‌న్న అమ్మ‌... ముగ్గుర‌మ్మ‌ల మూల‌పుట‌మ్మ బెజ‌వాడ కనకదుర్గ ఆలయాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలని దేవాదాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం సంవత్సర కాలంలో కనీసం రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందించింది. ఇంద్రకీలాద్రిపై రహదారులు, ల్యాండ్ స్కేపింగ్‌, పార్కులు, నడకదారులు, లైటింగ్‌.. ఇలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనుంది. 
 
దర్శనానికి వెళ్లే భక్తులకు శాశ్వత ప్రాతిపదికన క్యూలైన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సాధారణ రోజుల్లో 30 వేల నుంచి 70 వేల మంది భక్తులు.. శుక్ర, ఆదివారాల్లో లక్ష మంది దుర్గమ్మ దర్శనానికి వస్తుంటారు. దసరా పర్వదినాలు, భవానీ దీక్షలు సమయంలో భక్తులు పోటెత్తుతారు. ఏడాదికి రూ. 110 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. దుర్గ గుడి రాష్ట్ర నూతన రాజధాని ప్రాంతంలో ఉండటంతో దీని ప్రాధాన్యం మరింత పెరిగింది. 
 
రానున్న రోజుల్లో భక్తులు పెరుగుతారని.. ముఖ్యంగా రాజధానికి వచ్చే వీఐపీల సంఖ్య అధికం అవుతుందని దేవాదాయశాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధికి పూనుకుంటోంది. ఇంద్రకీలాద్రిపై స్థలం లేకపోవడం, ఇరుకుగా ఉండటంతో ఆ సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఆలయానికి ఐఏఎస్‌ అధికారిని ఈవోగా నియమించింది. ఇంద్రకీలాద్రిపైకి కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలను అనుమతించకూడదని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చింది. అభివృద్ధి పనులు పూర్తయ్యాక ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురావాలనుకుంటోంది. పుష్కరాల నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం నుంచే ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. 
 
ఆల‌య స‌మీపంలోనే పార్కింగ్ ...
ఇంద్ర‌కీలాద్రిపై వాహనాల పార్కింగ్‌కు అధికారులు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. ఆలయానికి సమీపంలో పార్కింగ్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అర్జున వీధిలో పార్కింగ్‌కు స్థలం లేకపోవడంతో, దగ్గరలో మరో స్థలాన్ని గుర్తించే పనిలో దేవాదాయశాఖ ఉంది. అక్కడి నుంచి బస్సుల్లో భక్తుల్ని తీసుకెళ్లాలన్నది దేవాదాయశాఖ ఆలోచన. ప్రస్తుతం దుర్గగుడి నడుపుతున్న బస్సులు బాగా పాతవి. వీటి స్థానంలో కొత్త బస్సులు అవసరమైన మేరకు కొనుగోలు చేసి.. పార్కింగ్‌ ఏరియా నుంచి ఆలయం సమీపంలోని అర్జునవీధి వరకు నడిపించేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 
 
అర్జున వీధి నుంచి ఆలయానికి శాశ్వత క్యూలైన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మహా మండపం నుంచి మెట్ల మార్గంలో వెళ్లడం అంటే ఏడు అంతస్తులున్న భవనాన్ని మెట్ల ద్వారా ఎక్కినట్లు అవుతుంది. ముఖ్యంగా వృద్ధులకు ఇబ్బంది అవుతుంది. అందుకే దీనికి ప్ర‌త్యామ్నాయంపై దేవాదాయ‌శాఖ దృష్టి పెడుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల‌నాటి సినీ న‌టి జ‌మున పుష్క‌ర స్నానం...