శని - షిన్‌గ్నాపూర్ శనీశ్వరాలయం
శనీశ్వర దేవాలయంతో ఆ గ్రామం ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఆ గ్రామంలోని ఇళ్లు, దుకాణాలు మరియు బ్యాంకుతో సహా వేటికి తలుపులండవు. ఇక తాళాలతో పనేలేదు. స్థానిక విశ్వాసాలను అనుసరించి ఆ గ్రామాన్ని శనీశ్వరుడు కాపాడుతుంటాడు. అక్కడ చోరీకి పాల్పడిన వారెవరైనా సజీవంగా గ్రామ పొలిమేరలను దాటలేరని ప్రతీతి. ఇప్పటి వరకు ఒక్క దొంగతనం కూడా నమోదు కాని గ్రామంగా ఆ గ్రామం రికార్డులకెక్కింది. మహారాష్ట్ర, నాసిక్ సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా శని-షిన్‌గ్నాపూర్ వాసికెక్కింది. ఇక్కడి దేవాలయంలో ఒక చిత్రపటం కానీ విగ్రహం కానీ కనపడదు. సాంప్రదాయ దేవాలయాలకు భిన్నంగా ఇక్కడ రాతి స్తంభం భక్తుల పూజలందుకుంటోంది. షిన్‌గ్నాపూర్‌లో ఎవరైనా పాము కాటుకు గురైతే, వారిని ఇక్కడకు తీసుకువచ్చి శనీశ్వరుని ప్రతిరూపమైన రాతి స్తంభానికి ప్రత్యేక పూజలు చేస్తే చాలు పాము కాటు బాధితుల దేహంలో విష ప్రభావం తొలగిపోతుందని స్థానికుల నమ్మిక. ఈ ప్రాంతానికి అనుబంధమైన మరో విశ్వాసం బహుళ ప్రచారంలో ఉంది. ఎవరైనా భక్తుల నీడ రాతిస్తంభంపై పడినట్లయితే శనీశ్వరునికి ఉత్తర దిక్కున గల
వేప చెట్టు తన కొమ్మలను కిందకు వంచుతుంది.
పూజా విధానం-
షిన్‌గ్నాపూర్‌లోని శనీశ్వరుని సేవించదలచిన భక్తులు అభ్యంగస్నానమాచరించి తడి బట్టలతో స్వయంభూవుగా అవతరించిన శనీశ్వరుని వేదిక వద్దకు చేరుకోవాలి. శనీశ్వరుని చుట్టూ ప్రదక్షణలు చేసిన తరువాత దేవాలయ ప్రాంగణంలోని బావిలోని పవిత్ర జలాలతో నువ్వుల నూనెతో అభిషేకించి పూజలు చెయ్యాలి. బలి ఇచ్చే వ్యవహరాన్ని ఇక్కడ అనుమతించరు. పురుష భక్తులెవరైనా సరే తడి బట్టలతో శనీశ్వరుడు కొలువున్న వేదికపైకి ఎక్కి పూజలు చేయవచ్చు.
స్త్రీలు వేదికకు దిగువన ఉండి పూజలు చెయ్యాలి. శనీశ్వరునికి పూజా కార్యక్రమాలు చేపట్టేందుకు మాత్రమే పవిత్ర జలాన్ని అందించే ప్రత్యేక బావి దేవాలయ ప్రాంగణంలో ఉంది. స్త్రీలు ఈ బావి నీటిని వాడరాదు. ఈ దేవాలయానికి ప్రత్యేకించి పూజారులు లేకపోయినప్పటికీ భక్తుల అభీష్టం మేరకు శనీశ్వరునికి అభిషేకం చేయించేందుకు శని, సోమవారాల్లో ఇక్కడ బ్రాహ్మణులు అందుబాటులో ఉంటారు. ఇక శని అమావాస్య నాడు పలువురు ప్రముఖులతో పాటు వేల సంఖ్యలో భక్తులు శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేసేందుకు ఇక్కడకు వస్తుంటారు.
చేరుకునే మార్గం:
విమానం ద్వారా: ఇక్కడకు 160 కి.మీ.ల దూరంలో పూనే విమానాశ్రయం కలదు.
రైలు ద్వారా: ఇక్కడకు సమీపంలో శ్రీరామ్‌పూర్ రైల్వే స్టేషన్ కలదు.
రోడ్డు ద్వారా: మార్గం: ముంబై-పూణే-అహ్మద్‌నగర్-శని షిన్‌గ్నాపూర్, దూరం: ఇంచుమించుగా 330 కి.మీ.లు.