ఆలయ చరిత్ర ఆసక్తిని రేకిత్తించేదిగా వుంటుంది. బ్రిటిషువారి కాలంలో మహాలక్ష్మి ప్రాంతాన్ని వర్లికి కలిపేందుకు యత్నించటం జరిగింది. అయితే పెద్ద పెద్ద అలలు బీభత్సాన్ని సృష్టించటంతో వారు ఆ ప్రయత్నాన్ని మానుకున్నారట. అదే సమయంలో మాతా మహలక్ష్మి రామ్జీ అనే కాంట్రాక్టరు కలలో ప్రత్యక్షమైంది. సముద్ర గర్భంలో వున్న మూడు విగ్రహాలను వెలికి తీసి ఆలయంలో స్థాపించాల్సిందిగా ఆజ్ఞాపించింది. దేవి ఆన మేరకు రామ్జీ విగ్రహ ప్రతిష్టాపన చేశాడు.
ఆలయంలో మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి విగ్రహాలున్నాయి. మూడు విగ్రహాలకు ముక్కు పుడకలతోపాటు, బంగారు గాజులు వజ్ర వైఢూర్యాలతో తయారుచేసిన నగలు వున్నాయి. ముగ్గురమ్మలను చూసిన భక్తులు భక్తి సాగరంలో మునిగిపోవాల్సిందే. ఎవరైతే త్రికరణశుద్ధితో అమ్మవార్లను పూజిస్తారో వారి కోర్కెలు తప్పక నెరవేరతాయని చెప్పబడింది. అమ్మవారిని వీక్షించేందుకు భక్తులు బారులు తీరి వుంటారు. సమయం ఎంతైనా... లక్ష్మీమాతను దర్శించి పూజలొనర్చిన తర్వాతే భక్తులు తిరుగుముఖం పడతారు.
ఎలా వెళ్లాలి: వాణిజ్య కేంద్రమైన ముంబైకు అన్ని ప్రధాన పట్టణాల నుంచి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. ముంబై చేరుకున్నవారు స్థానిక బస్సులలో ప్రయాణించి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో వుంటాయి. ఈ టాక్సీలు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, విమానాశ్రయాలనుంచి కూడా వుంటాయి.