Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భీమసేనుని మనవడి ఆలయాన్ని చూద్దాం రండి!!

భీమసేనుని మనవడి ఆలయాన్ని చూద్దాం రండి!!
-వ్రజేంద్ర సింగ్ ఝాల
ఈ తీర్థయాత్రలో భాగంగా మిమ్మల్ని రాజస్థాన్‌లో సికార్ జిల్లాలోని షెకావతి ఖాటు శ్యామ్‌జీ వద్దకు తీసుకువెళుతున్నాం. శ్యామ్‌జీని సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మగా భావిస్తారు.

ఇక శ్యామ్‌జీ ఆలయం విషయానికి వస్తే... ఇది చాలా పురాతనమైన దేవాలయం. ప్రస్తుతమున్న దేవాలయాన్ని 1720వ సంవత్సరంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. చరిత్రకారుడు పీటి. ఝాబర్మాల్ వివరాల ప్రకారం... 1679లో ఔరంగజేబు చేసిన దండయాత్రలో ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.

ఇక్కడ శ్యామ్‌జీని మరో అవతార పురుషునిగా కూడా ప్రస్తుతిస్తారట. భీమసేనుని మనవడు, ఘటోత్కచుని కుమారుడైన బాబారిక్‌ను భగవాన్ శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న శ్యామ్‌జీగా కొలుస్తారు. దీనికి కారణం లేకపోలేదు. మహాభారత కాలంలో సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడు బాబారిక్‌తో కలియుగంలో శ్యామ్‌గా పూజలందుకుంటావని దీవించాడట.

ప్రతి ఏటా ఫల్డుణ మాసంలోని శుక్ల పక్షంనాడు శ్యామ్‌జీ‌ని దర్శించుకుని తరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఆ దేవాలయం వద్ద ఓ షాపును నిర్వహిస్తున్న ఓ వ్యాపారి ప్రతి ఏటా ఈ దేవాలయానికి లక్షలాది భక్తులు వస్తారని చెప్పాడు. అంతేకాదు ప్రతి ఏకాదశి, ఆదివారాలనాడు భగవంతుని దర్శించుకునేందుకు భక్తులు బారుతీరి ఉంటారిక్కడ.

ఇక్కడ దేవునికిచ్చే హారతులు 5 రకాలుగా ఉంటాయి. ఉదయం 5 గంటలకు మంగళహారతి, ఉదయం 7 గంటలకు ధూప హారతి, మధ్యాహ్నం 12.15 నిమిషాలకు భోగ్ హారతి, సాయంత్రం 7.30 నిమిషాలకు సంధ్యా హారతి, రాత్రి 10 గంటలకు శయని హారతి ఇస్తారు. వేసవిలో ఈ వేళల్లో మార్పులు ఉంటాయి. కాగా శ్యామ్‌జీ పుట్టినరోజు అయిన కార్తీక శుక్ల ఏకాదశినాడు మాత్రం ఆలయాన్ని 24 గంటలూ తెరిచే ఉంచుతారు.
WD


ఇతర చూడదగ్గ ప్రదేశాలు: శ్యామ్ జీ ఆలయం సమీపంలో శ్యామ్ బాగ్ గార్డెన్, శ్యామ్ కుండ్‌లను దర్శించుకుని తీరాల్సిందే. ఇక్కడే భక్తాగ్రేసరుడు ఆలుసింగ్ సమాధి కూడా ఉంది. శ్యామ్ కుండ్‌లో స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగి పుణ్యాత్ములవుతారని విశ్వాసం.

ఎలా వెళ్లాలి:
రోడ్డు ద్వారా: జైపూర్, సికార్ నుంచి శ్యామ్‌జీ ఆలయానికి చేరుకునేందుకు బస్సులు, టాక్సీలు, జీపులు ఉన్నాయి.
రైలు ద్వారా: రాజస్థాన్‌లోని రింగస్ రైల్వే జంక్షన్ శ్యామ్ జీ ఆలయానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.
విమాన మార్గం ద్వారా: సమీప విమానాశ్రయం జైపూర్. ఇక్కడ నుంచి శ్యామ్ జీ ఆలయం 80 కిలో మీటర్ల దూరంలో ఉన్నది.

Share this Story:

Follow Webdunia telugu