భక్తుల కోర్కెలు తీర్చే.. పద్మావతి అమ్మవారు
దేశంలోని పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతున్న పవిత్ర స్థలం అలివేలు మంగాపురం. తిరుపతికి సమీపంలో వెలసివున్న చిన్న ప్రాంతానికి మరో పేరు తిరుచానూరు. ఇక్కడి ఆలయంలో అందమైన ప్రతిరూపంతో పద్మావతి అమ్మవారు కొలువై అశేష భక్తుల నుంచి నీరాజనాలు అందుకోంటోంది. ఏడు కొండల్లో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ముక్తి పొందాలనుకునే భక్తులు... తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకుండా వెనుదిరగ కూడదని పురాణాలు చెపుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. శ్రీ మలయప్ప స్వామిని దర్శించుకుంటే లభించే భక్తి, ముక్తిమార్గాలు శ్రీ పద్మావతి అమ్మవారిని కనులారా చూస్తేనే వస్తాయని ఇక్కడకు వచ్చే అశేష భక్తుల ప్రగాఢ విశ్వాసం. చరిత్ర పురాణం... తిరుచానూరులో శ్రీ వేంకటేశ్వరునికి ఒక చిన్న ఆలయం ఉండేది. ఈ ఆలయాన్ని అన్ని రకాల మతస్థులు వచ్చి దర్శించుకుని పూజలు చేసేవారు. ఆ దేవాలయం అతి చిన్నదిగా ఉండటం వల్ల అక్కడ అన్ని రకాల స్వామి పూజలు చేయడం వీలు పడలేదు. దీంతో ఆ ఆలయానికి కొద్ది దూరంలో మరో ఆలయాన్ని నిర్మించారు. అక్కడ అతి ముఖ్యమైన పూజలు మాత్రమే చేసే వారని చెపుతుంటారు. తర్వాత ఆలయానికి విశాలమైన స్థలం లేకపోవడంతో అందులోని విగ్రహాలను వేరే చోటికి
తరలించారు. అలా ఈ ఆలయం కొంత మేరకు ప్రాముఖ్యతను కోల్పోయినట్టు స్థానికుల అభిప్రాయం.
అయితే.. 12వ శతాబ్దిలో ఈ ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చిన యాదవరాజు ఇక్కడ శ్రీకృష్ణ బలరామ ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత అనగా.. రెండు శతాబ్దాల అనంతరం అంటే 16, 17వ శతాబ్దిలో సుందర వరదరాజ స్వామిని ఇక్కడ ప్రతిష్టించారు. ఆ సమయంలోనే పద్మావతి అమ్మవారికి వేరొక ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెపుతోంది. పురాణంలో పేర్కొన్నట్టుగా అలమేలు మంగాపురంలో ఉన్న ఆలయ ప్రాంగణంలోని కోనేరులోని తామర పువ్వు నుంచి పద్మావతి అమ్మవారు జన్మించినట్టు మరో ప్రచారం కూడా ఉంది.
పలు దైవ విగ్రహాలు... ఈ ఆలయంలో ఎన్నో విగ్రహాలు ఉన్నప్పటికీ.. పద్మావతీ అమ్మవారి విగ్రహమే చూడముచ్చటగా భక్తులను ఇట్టే ఆకర్షిస్తుంది. శ్రీమలయప్ప స్వామి వారి సహధర్మచారిణిగా ఉన్న పద్మావతి అమ్మవారు శ్రీనివాసుని చేతిలోవున్న తామరపై పద్మాసనంతో కొలువైవుంది. ఆమె కొలువుదీరిన స్థానం ఎంతో ప్రేమ, మర్యాదకు ప్రతీక. పద్మావతి అమ్మవారు వెలసిన ఆలయంలో మరికొన్ని దైవ విగ్రహాలు ప్రతిష్టతమై ఉన్నాయి. ఇక్కడ శ్రీకృష్ణ, బలరామ, సుందరరాజ స్వామి, సూర్య నారాయణ స్వామి అందమైన విగ్రహాలు కొలువై ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆలయంలో పెరుగుతున్న ఏనుగు కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఈ గజరాజే పద్మావతి అమ్మవారి వాహనం. తిరుచానూరులో జరిగే ఉత్సవాల్లో ఏనుగు రూపంలో ఆకారంలో వాహనాలను తయారు చేస్తారు. ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్న భారతావనిలో ఉన్న అనేక పుణ్య స్థలాల్లో ఒకటి తిరుచానూరు అలివేలు మంగాపురం. ఎలా చేరుకోవాలి... తిరుపతి రైల్వే స్టేషన్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఇక్కడకు వెళ్లేందుకు తిరుపతి నుంచి అనేక బస్సు సర్వీసులు ఉన్నాయి.
రైలు, రోడ్డు మార్గం ద్వారా... రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 547 కిలోమీటర్ల దూరంలో తిరుపతి పట్టణం ఉంది. అనుకూలమైన రోడ్డు, రైలు మార్గాలు ఈ ప్రాంతానికి ఉన్నాయి. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి.
విమానం మార్గం ద్వారా... హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు విమానాశ్రయాల నుంచి తిరుపతికి వివిధ విమానయాన సంస్థలు సర్వీసులు నడుపుతున్నాయి.