నర్శింగ్‌వాడిలోని దత్తాత్రేయ ఆలయం
ఈ వారం తీర్థయాత్రలో భాగంగా దత్తేశ్వర ఆలయాన్ని మీకు పరిచయం చేస్తున్నాం. మహారాష్ట్ర రాష్ట్రంలోని కోల్హాపూర్, నర్శింగ్‌వాడి అనే గ్రామంలో పవిత్ర కృష్ణానది తీరాన ఈ ఆలయం వెలసివుంది. ఈ ప్రాంతం నర్సోబావాడి అనే ప్రాంతంగా కూడా మంచి పేరుపొందింది. ఈ ప్రాంతంలో దత్తాత్రేయ సుమారు 12 సంవత్సరాల పాటు భక్తితత్వాన్ని ప్రజలకు అందించారు. అందుకే ఈ ప్రాంతాన్ని దత్తా మహారాజ్ తపోభూమిగా అభివర్ణిస్తారు. ఇక్కడ ఉన్న దత్తాత్రేయ పాదముద్రలను ఇక్కడకు వచ్చే భక్తులు పూజిస్తారు. పురాణాల ప్రకారం దత్తా మహారాజ్ ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఆయన తన యాత్రను ప్రారంభించి, ఉడుంబెర్, గనగపూర్‌లను సందర్శించి చివరకు కర్డాలివన్‌కు చేరుకున్నట్టు పేర్కొంటారు. నర్శింగేశ్వరాతి అనే తన మానవ అవతారాన్ని ఇక్కడే వదిలిపెట్టి ఇక్కడి భక్తుల భావన. ఈ ప్రాంతాన్ని ప్రతిరోజు వేలాది మంది
భక్తులు దత్తాత్రేయ మందిరాన్ని సందర్శించి, భక్తి ప్రపత్తులతో పూజిస్తారు. ఇక్కడే పంచాంగ, కృష్ణ నదుల సంగమం జరుగుతుంది. కృష్ణానదీ నీటి పరవళ్ళ శబ్దంతో ఆలయ గంటల శబ్దం, వేద మంత్రోచ్ఛారణలు మిళితమై అదోరకమైన అద్వితీయమైన అనుభూతికి లోను చేస్తుంది. ఈ ఆలయ గోపురం మసీదు నిర్మాణ ఆకారాన్ని పోలివుండటం దీని ప్రత్యేకత. ఈ ఆలయ ప్రాంగణంలో అనేక చిన్న ఆలయాలు, కోటలు, పేరొందిన సాధువుల విగ్రహాలు ఉన్నాయి. ప్రతి పౌర్ణమికి ఇక్కడకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రతి శనివారాన్ని దత్తాత్రేయ జన్మదినోత్సవంగా ఇక్కడ వేడుకలు నిర్వహిస్తుంటారు. దీంతో ఈ ప్రాంతం ప్రతి శనివారం భక్తుల సంఖ్యలో తరలి వచ్చి దత్తాత్రేయ పాదముద్రికలను దర్శనం చేసుకుని పూజలు చేస్తారు.
ప్రతి యేడాది దత్తాత్రేయ జయంతి వేడుకలను ఇక్కడ నిర్వహిస్తారు. ఆ సమయంలో దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడకు వచ్చి దత్తాత్రేయ ఆశీర్వాదాన్ని అందుకుంటారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులను ఏ ఒక్కరు కూడా అడ్డగించరు. ఆలయ ప్రాంగణంలో శునకాలు కూడా సంచరిస్తుంటాయి. ఈ శునకాలను కూడా భక్తులు ప్రార్థిస్తూ.. వాటికి ఆహార పదార్థాలను అందజేస్తుంటారు.
ఎలా చేరుకోవాలి...
రోడ్డు మార్గం.. కోల్హాపూర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో నర్షింగ్‌వాడి ఉంది. అలాగే పూణెకు 245 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూణె నుంచి బస్సులు లేదా టాక్సీలలో ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.
రైలు మార్గం.. కోల్హాపూర్‌కు చేరుకునేందుకు ముంబై, పూణెల నుంచి రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి.
విమానమార్గం ద్వారా... ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న విమానాశ్రయం కోల్హాపూర్.