చరిత్ర: ఇక్కడి జగన్నాథ ఆలయానికి 443 సంవత్సరాల చరిత్ర ఉంది. 125 ఏళ్ల క్రితం జగన్నాథుడు ఆలయ పూజారి నరసింఘాజీ కలలో ప్రత్యక్షమై రథయాత్ర ప్రారంభించాల్సిందిగా ఆదేశించాడని చెబుతున్నారు. దైవాజ్ఞ మేరకు పూజారి రథయాత్ర నిర్వహించగా అప్పటినుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోందట. జగన్నాథుడిని సందర్శించిన భక్తులను ప్రభువు ఆశీర్వదిస్తారని, జగన్నాథ రథాన్ని లాగిన వారు తమ జీవిత రథాన్ని ఉజ్వల భవిష్యత్తు వైపు లాగినట్లేనని భక్తుల నమ్మకం.
సాంప్రదాయికంగా పడవ నడిపే జాలర్లకు మాత్రమే రథయాత్రను మొదటగా లాగే హక్కు ఉంటూ వచ్చింది. భరూచ్ ప్రాంత జాలర్లు మొట్టమొదటి రథయాత్రకు రథాన్ని అందించారని చెప్పబడుతోంది. అయితే ప్రస్తుతం రథయాత్రలో పాల్గొనే ప్రతి ఒక్కరూ రథాన్ని తామే లాగాలని దేవుడిని సేవించాలని భావిస్తుంటారు.
రథయాత్ర మరోవైపు మత సామరస్యానికి ప్రతీకగా కూడా ఉంటోంది. ఆ రోజు ఆలయ పూజారికి ముస్లింలు స్వాగతం పలుకుతారు. రథయాత్రలో తాటిముంజ, బెర్రీలను దేవుడికి సమర్పిస్తారు. కిచడి -బియ్యం, పప్పు కలిపి చేసే వంట-, గుమ్మడికాయ పాయసాన్ని దేవుడికి ప్రసాదంగా సమర్పిస్తారు.
ఎలా చేరుకోవాలి: రైలు రోడ్డు మార్గం ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలనుంచి అహమ్మదాబాద్‌కు చేరుకోవచ్చు.