దక్షిణాది ప్రసిద్థమైన శైవ క్షేత్రాలలో చిదంబరం ఒకటి. పరమేశ్వరుడు కొలువై వున్న ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో వున్నది. పురణాల గాధలననుసరించి శివుడు 'ఓం' మంత్రాక్షరంతో చిదంబరంలో కొలువైవున్నట్లు చెప్పబడింది. అందువల్లనే శైవులకు ఈ పుణ్యక్షేత్రం అత్యంత ప్రీతిపాత్రమైంది. పరమేశ్వరునికి సంబంధించిన ఐదు ప్రసిద్ధ క్షేత్రాలలో చిదంబరం ఒకటి. ఈ ఆలయాన్ని శివుని ఆకాశ క్షేత్రంగా భక్తులు పరిగణిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిని వాయువుగాను, కాంచీపురంలోని దేవాలయాన్ని పృథ్విగానూ, తిరువానికాలో వున్న ఆలయాన్ని నీరుగానూ, తిరువణ్ణామలైలో కొలువై వున్న అరుణాచలేశ్వర ఆలయం నిప్పుగానూ భావిస్తారు. ఈ దేవాలయాన్ని అగ్నిమూల ఆలయమని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ దేవాలయంలో భక్తులకు పరమేశ్వరుడు ఓ జ్యోతి రూపంలో దర్శనమిస్తాడు.
దేవాలయంలో వున్న నాలుగు అందమైన స్తంభాలు ఒక్కోటి ఒక్కో దిక్కులో వుంటాయి. దేవాలయంలోపలి భాగంలో కళానైపుణ్యం తొణకిసలాడుతుంది. ఈ దేవాలయం నాట్యానికి పుట్టినిల్లుగా గోచరిస్తుంది. ఇక్కడ వున్న ప్రతి రాయి, స్తంభంపై భరతనాట్య భంగిమలను తెలుపుతుంటాయి. ఎంతో నైపుణ్యంతో పరమేశ్వరుడు ఈ నాట్యాన్ని చేశాడనీ... అందువల్లనే ఆయనను నటరాజ స్వామిగా కీర్తించారని చెప్పబడింది.
గుడి మధ్యలో శివకామ సుందరీ సమేతుడైన పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ చిదంబరుని గురించిన రహస్యం ఒకటి మీరు తెలుసుకోవాలి. ఆ రహస్యమేమటని తెలుసుకోవాలనుకుంటే మీరు ఆలయ పూజారులకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వుంటుంది. ఎందుకంటే... భక్తులు ఇచ్చే కానుకల ద్వారానే ఆలయ నిర్వహణ జరుగుతోంది.
ఇది శైవ క్షేత్రం అయినప్పటికీ, మీరు ఇక్కడ గోవిందరాజుల సన్నిధిని చూడవచ్చు. ఇక్కడ మరో అద్భుతమైన విశేషమేమిటంటే... గోవిందరాజులు, పరమేశ్వరుడు ఒకేచోట నిలబడి వుండటం. ఇక్కడ అందమైన కొలనుతోపాటు భరతనాట్యం చేసేందుకు హాలు కూడా వుంది. ప్రతి ఏటా నాట్య ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు పాల్గొని తమ నాట్యాన్ని ప్రదర్శిస్తారు.
చిదంబరాన్ని చేరుకోవడం ఎలా:
రైలు ద్వారా: చెన్నై రైల్వే స్టేషను నుంచి చిదంబరం (చెన్నై-తంజావూరు రైలు మార్గంలో) 245 కిలోమీటర్ల దూరంలో వుంది.
రోడ్డు ద్వారా: చెన్నై నుంచి నాలుగు లేదా 5 గంటల్లో బస్సు లేదా కారులో చిదంబరాన్ని చేరుకోవచ్చు.
విమానమార్గం: చెన్నై విమానశ్రయమే చిదంబరానికి సమీపంలో వున్న విమానాశ్రయం. ఇక్కడ నుంచి మీరు రైలు లేదా రోడ్డు మార్గంలో చిదంబరం ఆలయాన్ని చేరుకోవచ్చు.